టెస్ట్, వన్డే, టీ20 అనే మూడు ఫార్మాట్లలో క్రికెట్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఫార్మాట్‌కూ ప్లేయర్లు అవలంబించే పద్ధతులు వేరుగా ఉంటాయి. టెస్టుల్లో సహనం అవసరం, వన్డేలు సమయస్ఫూర్తితో ఆడాలి, అదే టీ20ల్లో వేగంగా పరుగులు రాబట్టగలగాలి. అందుకే.. ఒక ప్లేయర్ అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. ప్రస్తుతం పురుషుల్లోనైనా.. మహిళల్లోనైనా ఇలా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించే క్రీడాకారులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వీరిలో ముందు వరుసలో ఉంటారు స్మృతీ మంధాన. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ఐసీసీ ప్రకటించిన ‘ఉమెన్స్ వన్డే, టీ20 టీమ్స్ ఆఫ్ ది ఇయర్’ జాబితా !

రెండిట్లో చోటు దక్కించుకున్న స్మృతి !
2018 సంవత్సరానికి గాను ‘ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, ‘ఐసీసీ ఉమెన్స్ ఓడీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్న స్మృతి ఒకేసారి రెండు ఐసీసీ అవార్డులను సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఇటీవల ఐసీసీ ప్రకటించిన ‘ఉమెన్స్ వన్డే, టీ20 టీమ్స్ ఆఫ్ ది ఇయర్’ జాబితాల్లో కూడా చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది స్మృతి. భారత్ తరఫున వన్డేల్లో ఓపెనర్‌గా దిగి బౌలర్లపై విరుచుకుపడే మంధానకు ఐసీసీ కూడా తన ఉమన్స్ వన్డే టీమ్‌లో రెండో స్థానాన్ని కేటాయించింది. ఇక టీ20ల్లో ఈ డ్యాషింగ్ బ్యాట్స్ఉమన్కు నాలుగో స్థానాన్ని కట్టబెట్టింది ఐసీసీ.
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో స్మృతితో పాటు మరో ముగ్గురు భారత మహిళా క్రికెటర్లు్ చోటు దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్లు శిఖా పాండే, జులన్ గోస్వామి, స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరుసగా 8,9, 11 స్థానాల్లో నిలిచి.. మంధానతో కలిసి వన్డే జట్టును పంచుకున్నారు. ఇక టీ20ల్లో మంధాన (4)తో పాటు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, బౌలర్ రాధా యాదవ్‌కు వరుసగా 7, 11 స్థానాలను కేటాయించింది ఐసీసీ. వన్డే, టీ20రెండు జట్లలోనూ భారత్ తరఫున మంధాన ఒక్కరే చోటు దక్కించుకోగా, ఆస్ట్రేలియా నుంచి నలుగురు మహిళలు రెండు జాబితాల్లో చోటు దక్కించుకున్నారు. ఈ రెండు జట్లకి కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్‌ను నియమించిన ఐసీసీ, వికెట్ కీపర్‌గా అలిస్సా హీలేను ఎంచుకుంది. ఇక ఇదే ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ అన్ని ఫార్మాట్లకు కలిపి ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను దక్కించుకుంటే.. థాయ్‌ల్యాండ్‌కు చెందిన చనిడా సుత్తిరువాంగ్ ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది.
ఐసీసీ ప్రకటించిన టీమ్ వివరాలు బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం :
వన్డే :
అలిస్సా హీలే (wk) (ఆస్ట్రేలియా), స్మృతీ మంధాన (ఇండియా), తంసిన్ బ్యూమాంట్ (ఇంగ్లండ్), మెగ్ లానింగ్ (c) (ఆస్ట్రేలియా), స్టఫానీ టేలర్ (వెస్టిండీస్), ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా), జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), శిఖా పాండే (ఇండియా), జులన్ గోస్వామి (ఇండియా), మేగన్ స్కట్ (ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్ (ఇండియా).
టీ20 :
అలిస్సా హీలే (wk) (ఆస్ట్రేలియా), డానిల్లే వ్యాట్ (ఇంగ్లండ్), మెగ్ లానింగ్ (c) (ఆస్ట్రేలియా), స్మృతీ మంధాన (ఇండియా), లిజెల్లె లీ (దక్షిణాఫ్రికా), ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (ఇండియా), నిడా దార్ (పాకిస్థాన్), మేగన్ స్కట్ (ఆస్ట్రేలియా), శబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), రాధా యాదవ్ (ఇండియా).