2012 డిసెంబర్ 16..
-ఆరుగురు మానవ మృగాల చేతిలో చిక్కుకున్న ఓ అబల ఆక్రందన అరణ్య రోదనగానే మారింది ఆరోజు....!
-సాటి మనిషి అన్న స్పృహ, కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తించిన ముష్కరుల తీరుతో మానవత్వం మంటగలిసింది ఆరోజు..
- సమాజంలో మనుషులతో పాటు మనిషి ముసుగు ధరించిన కొన్ని మృగాలు కూడా తిరుగుతుంటాయని మొదటిసారి తెలిసొచ్చింది ఆరోజు..!
-‘ఆడపిల్ల ఆర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం’ అని మహాత్మా గాంధీ ఆశించిన మెరుగైన సమాజం ఇక కలేనేమో అని అనుమానం వచ్చింది ఆరోజు..
‘ భవిష్యత్‌లో ఇలాంటి రోజు మరెప్పుడూ రాకూడదు’ అని అందరూ కోరుకున్న నిర్భయ ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. కానీ బాధితురాలి కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదు. కదులుతున్న బస్సులోనే ఆ ఆడపిల్ల జీవితాన్ని కడతేర్చిన ఆ మానవ మృగాలకు సమాజంలో బతికే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది. కానీ కాలం చెల్లిన చట్టాలు దోషులకు కాపలాగా ఉంటున్నాయి. అందుకే తీర్పును సమీక్షించాలని కోరుతూ ఇంకా రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలవుతున్నాయి.
నిర్భయకు న్యాయమెప్పుడు?
ఇటీవల ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ..నిర్భయకు కూడా సత్వర న్యాయం జరగాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. అందుకు తగ్గట్లే త్వరలోనే ఆ నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయనున్నట్లు కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయి కానీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఈ క్రమంలోనే తన కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ కేంద్ర హోం శాఖకు తాజాగా ఒక లేఖ రాసింది. నిర్భయ నేరస్తులను ఉరితీసే అవకాశం తనకు కల్పించాలని అందులో కోరింది. అది కూడా తన రక్తాక్షరాలతో..!

ఆవేదనకు అక్షర రూపమిస్తూ!
నిర్భయ దోషులకు మరణశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు రెండున్నరేళ్ల క్రితమే తీర్పునిచ్చింది. అయితే ఇంకా శిక్ష అమలు కాలేదు. దానికి కారణాలు అనేకం. శిక్షకు సంబంధించిన రివ్యూ పిటిషన్లు ఇంకా దాఖలవుతూనే ఉన్నాయి. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత నిర్భయ దోషులకు కూడా త్వరలోనే మరణశిక్ష అమలు చేయనున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. దిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులను ఉరి తీయడానికి తలారీని వెదుకుతున్నట్లు జైలు అధికారులు కూడా ప్రకటించడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. ఈక్రమంలో నిర్భయ దోషులను ఉరితీసే అవకాశమివ్వాలంటూ పలువురు తీహార్ జైలు అధికారులకు లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రేపిస్టులను తాను ఉరితీస్తానని, బాధితురాలి ఆత్మకు శాంతి కలిగిస్తానని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు చెందిన రవి కుమార్ రాష్ర్టపతికి లేఖ రాశాడు. ఆ తర్వాత చెన్నైకు చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇలాగే ఓ లేఖ రాశాడు. వారిని ఉరి తీసేందుకు తనను తాత్కాలిక తలారీగా నియమించమని తీహార్ డీజీపీని కోరాడు.
తాజాగా ఇదే డిమాండ్‌తో షూటర్ వర్తికాసింగ్ తన గుండెలోని ఆవేదనకు అక్షర రూపమిస్తూ ఓ లేఖ రాసింది. ఆ మృగాలను ఉరికొయ్యకు వేలాడదీసే అవకాశం తనకు కల్పించమని కోరుతూ రక్తంతో రాసిన లేఖను కేంద్ర హోం శాఖకు పంపింది.

నాకు మద్దతివ్వండి!
ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడిన దోషులను మహిళలతోనే ఉరి తీయించాలని లేఖలో కోరింది వర్తిక. ‘ ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ దోషులను నా చేతులతో ఉరితీసే అవకాశం కల్పించండి. తద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్ష అమలు చేయగలదనే సందేశం సమాజానికి తెలియాలి. అత్యాచారానికి పాల్పడిన రేపిస్టులకు ఇది ఒక గుణపాఠం అవుతుంది. మహిళా ఎంపీలు, నటులు, సైనికులు, సంస్థలు నాకు మద్దతివ్వండి. దీంతోనైనా సమాజంలో మార్పు వస్తుందని ఆశిద్దాం’ అని అందులో కోరింది. ఈ మేరకు రెండు పేజీలున్న ఈ లేఖను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు స్పీడ్ పోస్టులో పంపానని చెప్పుకొచ్చిందీ షూటర్.