దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ప్రస్తుతం నిరుద్యోగంతో పాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలు దేశ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అంటూ తన పద్దుల చిట్టాను విప్పారు. కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన నిర్మలమ్మ యువతను మరింత శక్తిమంతం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను నినాదం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. మరి ‘సబ్‌కా సాత్... సబ్‌కా వికాస్... సబ్‌కా విశ్వాస్’ నినాదమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక వ్యవస్థలో యువతకు, మహిళలకు ఎటువంటి వెసులుబాటును కల్పించారు ? కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రణాళికలు వేశారు ? ముఖ్యంగా మహిళా లోకానికి ఈ ఏడాది బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ? వంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం రండి !

ఎవరికీ నష్టం కలగలేదు.. ఆదాయం పెరిగింది !
బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ కొనసాగించే సంప్రదాయాన్ని గతసారి పక్కన పెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి కూడా గతేడాదిలాగే బడ్జెట్ పత్రాలను ఎర్రటి వస్త్రంతో చుట్టిన బహీ-ఖాతా (సంచీ)లో తీసుకొచ్చారు. అంతకుముందు వరకు బడ్జెట్ పత్రాలను ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చేవారు. అయితే గతేడాది ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. పాత సంప్రదాయాన్ని మార్చి పద్దుల సంచీ తీసుకొచ్చారు.
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమవడంతోనే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ‘ఇది సామాన్యుల బడ్జెట్’ అని అభివర్ణించారు. మొదటగా దార్శనికులైన అరుణ్‌జైట్లీకి నివాళిని అర్పించిన నిర్మలమ్మ నవ సాంకేతిక పరిజ్ఞానంలో బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా... యువతను మరింత శక్తిమంతం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు. జీఎస్టీతో ఎవరికీ నష్టం కలగకుండా రాష్ట్రాలతో పాటు కేంద్రం ఆదాయం కూడా పెరిగిందని.. ఒకే దేశం-ఒకే పన్ను నినాదం మంచి ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు నిర్మలమ్మ.

మూడు లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం !
ఏప్రిల్ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం అవుతాయని మాటిచ్చిన నిర్మలమ్మ... గత రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారని... దాదాపు 10శాతం పన్ను భారం తగ్గిందని తెలిపారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని... కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుందని ఆమె సూచించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయీ నేరుగా నిరుపేదలకు అందించే ప్రయత్నంలో భాగంగా న్యూ ఇండియా(ఆశావహ భారత్), సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ (అందరికీ ఆర్థికవృద్ధి), ప్రజా సంక్షేమం వంటి మూడు లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. అంతేకాదు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకూ 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేశారని పేర్కొన్నారు నిర్మలమ్మ.

ఆరోగ్యానికి రెండు.. విద్యకు మూడు !
దేశ సౌభాగ్యం గ్రామాల్లోనే ఉందనే సత్యాన్ని గుర్తు చేస్తూ తన బడ్జెట్ కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధిని చేర్చారు నిర్మలమ్మ. ఆ తర్వాత ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుకి రెండో ప్రాధాన్యతను ఇవ్వగా, మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమాన్ని చేర్చారు. అంతేకాదు భారత్ ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్న ఆర్థిక మంత్రి, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తామని వాగ్దానం చేశారు.
ఇక ధాన్యలక్ష్మి పథకాన్ని మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా అమలు చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా పండిన పంటను తమ గ్రామంలోనే నిల్వ చేసుకునేలా కేంద్ర సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోనే గోదాములను నిర్మిస్తారు. తద్వారా స్థానికులకు కూడా ఉపాధి లభిస్తుంది.

‘ఆరోగ్య’ బడ్జెట్ !
* ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుకి రెండో ప్రాధాన్యతను ఇచ్చిన నిర్మలమ్మ స్థూలంగా ఆరోగ్య రంగానికి 69 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
* ఇంద్రధనుష్ పథకాన్ని విస్తరించి ఆయుష్మాన్ భారత్‌కు అదనపు ఆసుపత్రులను జోడిస్తామన్నారు.
* ఇక గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే క్రమంలో ‘జల్ జీవన్ మిషన్’కు రూ.3.06లక్షల కోట్లు, పారిశుద్ధ్యంలో భాగంగా స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
* అంతేకాదు ఆరోగ్య రంగంపై మరింత దృష్టిపెడుతూ జీవనశైలి మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం అమలు చేస్తామన్నారు నిర్మలమ్మ. ఈక్రమంలో జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు తీసుకొని, 2025కల్లా క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
* అంతేకాదు 10లక్షల జనాభా దాటిన నగరాల్లో స్వచ్ఛమైన గాలే కరువవుతుందని, అందుకే నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు కేటాయిస్తున్నామన్నారు నిర్మలమ్మ.
* అంతేకాదు మహిళలకు ఉన్నత విద్యావకాశాలు, ఉపాధి కల్పించడంతో పాటు పౌష్టికాహార విషయంలో ఒక టాస్క్‌ఫోర్స్‌నే ఏర్పాటు చేసి ఆరు నెలల్లో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. ఈక్రమంలో మహిళా సంక్షేమానికి 28,600 కోట్ల రూపాయలను కేటాయించారు.

విద్య, చిన్నారుల సంక్షేమం..!
* భారత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యా రంగానికి 99,300 కోట్లను కేటాయించిన ఆర్థికమంత్రి.. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు కూడా స్వాగతం పలుకుతామన్నారు. ఈక్రమంలోనే భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు ‘ఇండ్‌శాట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
* ఇంజినీరింగ్, వైద్య విభాగాలకు యూనివర్సిటీలు ఉన్నట్లే పోలీస్ శాఖకు నేషనల్ పోలీస్ వర్సిటీ అని, ఫోరెన్సిక్ శాఖకు నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ అని ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు. అంతేకాదు 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడతామన్నారు.

బాలురకంటే బాలికలే ఎక్కువ !
* ఈ బడ్జెట్‌లో మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమాన్ని చేర్చిన నిర్మలమ్మ విద్యా రంగానికి కేటాయించిన దానితో పోలిస్తే చిన్నారుల సంక్షేమానికి కేటాయింపులు కాస్త తగ్గాయనే చెప్పాలి.
* ఈక్రమంలోనే ‘బేటీ బచావో- బేటీ పడావో’ పథకం గొప్ప విజయం సాధించిందని... ఈ పథకం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలలో బాలికల శాతం పెరిగిందని అన్నారు. అంతేకాదు పాఠశాల స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్య వరకు బాలికలు అన్నిట్లో ముందంజలో ఉన్నారన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు.
* ఎలిమెంటరీ స్థాయిలో బాలుర శాతం 89.28% ఉండగా, బాలికల శాతం 94.32% గా ఉంది. అదే సెకండరీ స్థాయిలో తీసుకుంటే 78% గా ఉన్న బాలురకంటే బాలికలు 81.32 % ఎక్కువగా ఉన్నారు. ఇక హయ్యర్ సెకండరీ బాలబాలికల శాతాన్ని తీసుకుంటే.. బాలురు 59.70 % కాగా, బాలికలు 57.54%గా ఉన్నారని తెలిపారు నిర్మలమ్మ.
* చిన్నారుల సంక్షేమం ఇలా ఉంటే.. వయోవృద్ధులకు, దివ్యాంగుల సంక్షేమానికి 9,500 కోట్లు కేటాయించారు నిర్మలమ్మ.
* ఇక మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు 28,600 కోట్ల రూపాయలను కేటాయించగా దేశవ్యాప్తంగా ఉన్న పౌష్టికాహార పథకాలకు 35,600 కోట్ల రూపాయలను కేటాయించారు.

యువతకు ధీమా !
* దేశ ఆర్థిక రంగాన్ని వృద్ధిలోకి తెచ్చే వాటిలో వ్యాపార రంగం కూడా ఒకటన్న నిర్మలమ్మ.. ఈరోజుల్లో యువత ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉన్నారు కానీ ఉద్యోగం చేసే స్థాయిలో లేరన్నారు. వ్యాపారంలో యువత నైపుణ్యాలను మరింత పెంచడానికి, వారికి వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రత్యేకంగా ‘ఇన్వెస్ట్‌మెంట్ క్లియరన్స్ సెల్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
* అంతేకాదు యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ముఖ్యంగా స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించే క్రమంలో నైపుణ్య శిక్షణకు 3వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌కు అదనం.
* అలానే టెక్స్‌టైల్ రంగంలో రాణించాలనుకునే యువతకు చేయూతగా నేషనల్ టెక్స్‌టైల్ మిషన్‌కు రూ.1480కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు నిర్మలమ్మ.
* ప్రభుత్వ రంగాల్లో యువత కోసం మరిన్ని ఉద్యోగాలు కూడా ప్రకటిస్తామన్నారు. ఈక్రమంలోనే నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. ఇప్పటి వరకు యువత నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయా పోస్టులను బట్టి విడివిడిగా పరీక్షలను రాస్తూ వస్తోంది.
* లక్ష గ్రామాలకు ఎఫ్‌ఓసీ (Fible Optic Cable) ద్వారా డిజిటల్ కనెక్టివిటీ అందిస్తామన్నారు నిర్మలమ్మ. అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయితీలు, పోలీస్‌స్టేషన్‌లకు డిజిటల్ సేవల్ని అనుసంధానించనున్నట్లు తెలిపారు.

5 లక్షలకు బ్యాంకు డిపాజిట్ బీమా పెంపు !
సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు ఇది చాలా ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. బ్యాంకులు తమ వైఫల్యాల కారణంగా వినియోగదారులకు చెల్లించే డిపాజిట్ బీమా గతంలో 1 లక్ష రూపాయలే ఉండేది. ఇప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు.

పన్ను మినహాయింపులివిగో !
* ఆదాయపన్ను చెల్లించేవారికి ఊరట కలిగిస్తూ 5 లక్షల రూపాయల్లోపు ఆదాయం ఉన్నవారు అసలు పన్ను కట్టనవసరం లేదని గత బడ్జెట్‌లో పేర్కొన్న విషయాన్నే మరోసారి ప్రస్తావించారు నిర్మలమ్మ. అయితే రూ.5 లక్షల నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను, రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను, రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకూ ఆదాయం ఆర్జించే వారికి 20శాతం పన్ను, 12.5లక్షల నుంచి రూ.15లక్షల ఆదాయ వర్గాలకు 25శాతం పన్ను వర్తిస్తుందని తెలిపారు. ఇక రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
* అంతేకాదు సక్రమంగా పన్ను చెల్లించే వారిని కాపాడుకుంటామని.. వారికి పాలనా రంగం నుంచి ఎటువంటి వేధింపులు ఉండకుండా చూసుకుంటామని తెలిపారు. అయితే పన్ను ఎగవేతదారులపై మటుకు మునుపటి కంటే కఠినంగా వ్యవహరించనున్నామని అన్నారు.

* అయితే కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు నిర్మలమ్మ. అంటే.. పన్ను మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
* మరో విశేషం ఏంటంటే.. చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు లబ్ధి చేకూరే విధంగా ఏడాది పాటు వారికి ట్యాక్స్ హాలిడేను ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. అలానే కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(పెట్టుబడిదారులను బట్టి ప్రభుత్వం సంస్థల నుంచి వసూలు చేసే పన్ను)ను రద్దు చేస్తూ.. రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్ (తనిఖీ పన్ను) మినహాయింపును కలిగిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ.
ఆమె రికార్డ్ ఆమే చెరిపేశారు !
కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఘనత సాధించిన నిర్మలమ్మ, బడ్జెట్ ప్రసంగంలో గతేడాది 2 గంటల 17 నిమిషాలతో రికార్డ్ నెలకొల్పగా.. ఈసారి 2 గంటల 39 నిమిషాలతో తన రికార్డ్‌ను తనే చెరిపేసుకున్నారు. ఈక్రమంలో కొంత అస్వస్థతకు కూడా గురవడం గమనార్హం. ఇకపోతే ఈ బడ్జెట్ ప్రసంగానికి ఆమె కూతురు వాజ్ఞ్మయి పరకాల కూడా హాజరవడం విశేషం.