Image for Representation
వ్యక్తులైనా, దేశమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే అందులో మహిళల పాత్ర ఎంతో కీలకం. వంట గదిలో గరిటె తిప్పడం దగ్గర్నుంచి... రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లేవరకు ఏ రంగమైనా అందులో మహిళల చొరవ, కృషి కచ్చితంగా ఉండాల్సిందే. ఎలాంటి బాధ్యతలనిచ్చినా ఎంతో అణకువగా నిర్వర్తించే స్త్రీలు... తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఆది పరాశక్తులుగా మారతారు. గతంలో మహిళలు నడిపిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలే ఇందుకు నిదర్శనం. ఇలా మహిళల సహనశీల శక్తికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం. నాలుగు నెలలుగా నిద్రాహారాలు మాని పురుషులతో సమానంగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు పలువురు మహిళా రైతులు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్ మ్యాగజైన్ పోరుబాటలో నిమగ్నమైన మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఇందులో భాగంగా మార్చి నెల ఎడిషన్ కవర్ పేజీపై మహిళా రైతుల ఫొటోతో పాటు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
నాలుగు నెలలుగా !
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్షకులు చేపట్టిన ఆందోళనలు మార్చి 6 నాటికి 100వ రోజుకు చేరుకోనున్నాయి. గతేడాది నవంబర్ 26 నుంచి ప్రారంభమైన ఈ పోరాటం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఇంకా ప్రతిష్ఠంబన కొనసాగుతూనే ఉంది. ఇక ఈ పోరాటంలో అనేక మంది మహిళలు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఇల్లు, పిల్లలను వదిలేసి వెన్ను చూపకుండా మరీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా కిసాన్ దివస్’గా నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఆ రోజు జరిగే నిరసన కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తారని ఆ సంఘాలు తెలిపాయి.
మహిళలు ముందుండి పోరాడుతున్నారు!
ఈ క్రమంలో దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న అన్నదాతల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్న మహిళల పోరాట స్ఫూర్తిపై ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రశంసల వర్షం కురిపించింది. రైతుల ఉద్యమంలో మహిళలు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారంటూ మార్చి నెల ఎడిషన్ కవర్ పేజీపై మహిళా రైతుల ఫొటోను ప్రచురించింది. ఫొటోలో భాగంగా ఒక మహిళా రైతు ఓ చేత్తో చంటిబిడ్డను ఎత్తుకుని మరో చేత్తో ఉద్యమ నినాదాలు చేస్తూ జై కొడుతున్న దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నన్ను బెదిరించలేరు... నన్ను కొనలేరు!
ఇక ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్... తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా రైతుల అనుభవాలు, బాధలపై ఒక ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది టైమ్ మ్యాగజైన్. ‘నన్ను బెదిరించలేరు... నన్ను కొనలేరు’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ కథనంలో నూతన సాగు చట్టాలపై మాత్రమే కాకుండా... పితృస్వామ్యం, స్త్రీ హత్య, లైంగిక హింస, లింగ వివక్ష.. వంటి అంశాలకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో పాటు రైతుల ఉద్యమంపై స్పందించిన సుప్రీంకోర్టు... ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలను ఇంటికెళ్లాలని అభ్యర్థించడం, అయినా ఆ మహిళా రైతులు నిరసనల్లో పాల్గొంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ సందర్భంగా ‘మేమెందుకు వెనక్కి వెళ్లాలి. ఇది మగవారి పోరాటం మాత్రమే కాదు. పురుషులతో సమానంగా మేం కూడా పంట పొలాల్లో పనులు చేస్తున్నాం’ అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 74 ఏళ్ల జస్బీర్ కౌర్ చెప్పిన మాటలను టైమ్ మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.