Image for Representation
ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతోంది. ‘స్ట్రెయిన్’, ‘వేరియంట్’, ‘మ్యుటేషన్’ అంటూ తన రూపాన్ని, ఉనికిని మార్చుకుంటూ లక్షలాది మందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వివిధ దేశాలతో పాటు మనదేశంలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తుండడం కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఎక్కడ ఈ వైరస్ సోకుతుందేమోనని రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తెగ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే ఎందరో శతాధిక వృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి బాధితులకు బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన లూసియా డిక్లెర్క్ అనే వృద్ధురాలు. 105 ఏళ్ల వయసున్న ఈ బామ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు స్పానిష్ ఫ్లూ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనోధైర్యం ముందు కొవిడ్ మహమ్మారి నిలవలేకపోయింది.
105 ఏళ్ల వయసులో కరోనాను జయించారు!
కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఒకటి. ఆ దేశంపై పగబట్టినట్లు ప్రవర్తిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 5 లక్షల మందిని బలి తీసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా ఏ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. ఈ క్రమంలో న్యూజెర్సీలోని ఓ నర్సింగ్‌హోంలో ఉంటోన్న లూసియా కొద్ది రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడ్డారు. గత నెలలో 105వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆమె కరోనా నిబంధనల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. అయితే దురదృష్టవశాత్తూ వెంటనే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా ఉందని నిర్ధారణ అయిన ఒక రోజు ముందే ఆమె కరోనా టీకా రెండో డోసు తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో సుమారు రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లూసియా ఇటీవల కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఎన్నో వైపరీత్యాలను ఎదుర్కొని!
మొత్తం మూడుసార్లు వివాహం చేసుకున్న లూసియాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరితో పాటు ఐదుగురు మనవళ్లు, 12 మంది ముని మనవళ్లు, 11 మంది ముని ముని మనవళ్లు ఉన్నారు. 1916లో హవాయిలో పుట్టిన ఆమె ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లోని గ్వాటెమాలాకు చేరుకుంది. ఈ క్రమంలో స్పానిష్ ఫ్లూ, రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లో తన ముగ్గురు భర్తలతో పాటు పెద్ద కుమారుడిని కూడా కోల్పోయింది. ఆ తర్వాత వ్యోమింగ్, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి చివరకు తన పెద్ద కుమారుడితో కలిసి న్యూజెర్సీలో స్థిరపడ్డారు. నాలుగేళ్ల క్రితం వరకు ఎంతో యాక్టివ్‌గా ఉన్న లూసియా ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి న్యూజెర్సీలోని ఓ నర్సింగ్ హోంలోనే నివాసముంటున్నారు.
మొదట ఆందోళన చెందినా!
105 ఏళ్ల లూసియా ప్రస్తుతం న్యూజెర్సీ నర్సింగ్ హోంలో ఉన్న అత్యంత వృద్ధురాలు కావడం గమనార్హం. ఆధ్యాత్మిక భావన మెండుగా ఉన్న ఆమె కరోనాకు ముందు ప్రతి వారం చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు. ఆ తర్వాత లాక్డౌన్ మొదలు కావడంతో ప్రస్తుతం నర్సింగ్‌హోంలోనే ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో 105 వ వసంతంలోకి అడుగుపెట్టిన లూయిస్ దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడ్డారు. తనతో పాటు మొత్తం 62 మంది వృద్ధులకు ఈ మహమ్మారి సోకగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మొదట తేలికపాటి లక్షణాలు కనిపించడంతో లూసియాను ఓ ఆస్పత్రిలో చేర్పించారు నర్సింగ్‌హోం నిర్వాహకులు. ఆ తర్వాత ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. అలా రెండు వారాల పాటు ఆస్పత్రిలో ఉన్న ఆమె ఇటీవల కొవిడ్‌పై విజయం సాధించి మళ్లీ తన నర్సింగ్‌హోంకు తిరిగి వచ్చేశారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యకరమైన జీవనశైలే ఆమెను కరోనా నుంచి కాపాడిందంటున్నారు వైద్యులు.
‘దేవుడిని బాగా ఆరాధించే లూసియా.. కరోనా సోకిందని తెలియగానే తానూ మొదట కొంచెం ఆందోళన చెందారు. కానీ ఈ మహమ్మారి నుంచి భగవంతుడు తనను రక్షిస్తాడని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందుకు తగ్గట్లే చికిత్సా సమయంలోనూ ఆమె ఎంతో ధైర్యంగా ఉన్నారు. కరోనా నిర్ధారణ కాకముందే లూసియా కరోనా టీకా తీసుకున్నారు. ఆమె రికవరీలో ఇది కూడా బాగా సహాయపడిందని మేం అనుకుంటున్నాం’ అని అంటున్నారు డాక్టర్లు.
బేకింగ్ సోడాతో పళ్లు తోముకునేవారు!
ఈ క్రమంలో లూసియా జీవనశైలి గురించి ఆమె కుటుంబ సభ్యులు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘బామ్మకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంది. ఆమె ఆరోగ్యం కోసం నేరుగా కలబంద రసం తాగేవారు. అదేవిధంగా బేకింగ్ సోడాతో పళ్లు తోముకునేవారు. అందుకే 99 ఏళ్లు వచ్చే వరకు ఆమెకెలాంటి దంత సంబంధ సమస్యలు ఎదురు కాలేదు. ఈ క్రమంలో 105 ఏళ్ల తన జీవిత కాలంలో ఎన్నో రకాల సమస్యలను సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఆమె మానసిక బలమే ఆమె దీర్ఘాయుష్షుకు కారణం’ అని అంటున్నారు.
జంక్‌ఫుడ్‌కు దూరం!
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ తన నర్సింగ్‌హోంకు తిరిగొచ్చారు లూసియా. మళ్లీ మునపటిలాగే ఎంతో ఉత్సాహంతో తన సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. ‘నేను జంక్‌ఫుడ్‌కు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటాను. క్రమం తప్పకుండా రోజూ ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్షలు తినడం నాకు అలవాటు. బహుశా ఇవే నాకు కరోనాతో పోరాడాల్సిన శక్తినిచ్చాయేమో’ అని తన హెల్దీ లైఫ్‌స్టైల్ గురించి చెప్పుకొచ్చారు లూసియా.