అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందడమంటే జీవితంలో ఓ మెట్టు పైకెక్కడమే! అయితే ఒకేసారి కాదు.. మరోసారి కూడా ఈ మధురానుభూతి మన సొంతమైతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..! ప్రస్తుతం కరీనా-సైఫ్ జంట కూడా ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది. నాలుగేళ్ల క్రితం తైమూర్ అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ బాలీవుడ్ కపుల్.. తాజాగా మరో ముద్దుల బాబుకి తల్లిదండ్రులయ్యారు.. తద్వారా అమ్మానాన్నలుగా మరోసారి ప్రమోషన్ పొందారీ అందాల జంట. ఇక తమ బుజ్జాయిని అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తారా? వాడెలా ఉంటాడో చూడాలన్న ఆతృత అభిమానులందరిలో నెలకొంది. ఇలాంటి తరుణంలో కరీనా తండ్రి రణ్‌ధీర్ తన మనవడి పోలికల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
గర్భం ధరించినా తన వృత్తిగత జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపింది బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్. 2016లో తైమూర్‌కి జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. ఓవైపు తల్లిగా తన చిన్నారి ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు తన కెరీర్‌నీ కొనసాగించింది. గతేడాది ఆగస్టులో మరోసారి తల్లిని కాబోతున్నానని ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ.. గర్భిణిగా ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరోవైపు తన వృత్తిగత జీవితాన్నీ కొనసాగించింది. ఈ క్రమంలో తాను నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్ర షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంది. అంతేనా కాబోయే అమ్మలందరికీ సరికొత్త మెటర్నిటీ ఫ్యాషన్స్ పరిచయం చేస్తూ, గర్భిణిగా తాను పాటించిన ఆహార-వ్యాయామ నియమాల గురించి చెబుతూ అందరిలో ప్రేరణ నింపింది బెబో.
మాకు బాబు పుట్టాడు!
ఫిబ్రవరిలో తమ కుటుంబంలో మరో బుజ్జాయి చేరబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతోన్న సైఫీనా జంట.. ఈ నెల 21న మరోసారి పండంటి కొడుక్కి తల్లిదండ్రులయ్యారు. దీంతో పటౌడీ ప్రిన్స్ తైమూర్ అన్నయ్యగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని సైఫ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు.
‘మాకు బాబు పుట్టాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించి, మాపై ప్రేమ కురిపించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు..’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు సైఫ్. ఇదే విషయాన్ని కరీనా కూడా ‘ఇట్స్ ఎ బాయ్’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో సి-సెక్షన్ ద్వారా కరీనా ప్రసవం జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండోసారి తల్లిదండ్రులైన సైఫీనా జంటకు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరలోనే కొత్తింటికి!
మరోవైపు కరీనా తండ్రి రణ్‌ధీర్ కపూర్ పట్టరాని ఆనందంలో తేలియాడుతున్నారు. తన మనవడిని చూసి వీడు అచ్చం తైమూర్‌లాగే ఉన్నాడంటూ మురిసిపోతున్నారు. దీంతో అభిమానుల్లో ఆ బుజ్జాయిని ఎప్పుడెప్పుడు చూద్దామా, వాడికి ఏం పేరు పెట్టబోతున్నారో అన్న ఆతృత నెలకొంది. ఇక ప్రస్తుతం ముంబయిలోని ఫార్చ్యూన్ హైట్స్‌లో నివాసముంటోన్న సైఫీనా త్వరలోనే బాంద్రాలోని తమ కొత్త ఇంటికి మారబోతున్నారట. అందులో తైమూర్ కోసం ప్రత్యేకమైన గది-ఆటస్థలం, తమ రెండో బుజ్జాయి కోసం అన్ని హంగులతో కూడిన నర్సరీ, స్విమ్మింగ్‌పూల్, టెర్రస్, అవుట్డోర్.. వంటి సకల సదుపాయాలున్నాయట!
కంగ్రాట్స్ సైఫీనా!
Also Read:
కరీనా ప్రెగ్నెన్సీ డైట్ ఇదేనట!
కాబోయే అమ్మలందరి కోసమే ఈ చిన్న ప్రయత్నం!
కాబోయే అమ్మలకు కరీనా ‘ఆరోగ్య’ పాఠాలు!