Photos: www.instagram.com/batumi_mama
గతంలో పెద్దలెవరైనా ఆశీర్వదిస్తే... గంపెడు పిల్లలతో కలకాలం సంతోషంగా గడపండి అని దీవించేవారు. అయితే గంపెడు సంతానంతో సంతోషం ఏముంటుందిలే అని ముందు ఇద్దరికి, ఇప్పుడైతే ఏకంగా ఒక్కరికే పరిమితమైపోతున్నారు చాలామంది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థికపరమైన అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదకొండు మంది పిల్లలకు తల్లయినా.. ఇంకా చిన్నారులు కావాలని కోరుకుంటోంది ఓ మహిళ. ఒకరో.. ఇద్దరో కాదు ఏకంగా వందమందికి పైగా పిల్లలకు అమ్మగా మారాలని ఆకాంక్షిస్తోంది. ‘వామ్మో..! వందమంది పిల్లలా?’ అనుకుంటున్నారు కదా..!
మరి... వినడానికే ఎంతో వింతగా అనిపిస్తోన్న ఆ కథేంటో తెలుసుకుందాం రండి.
11 మంది పిల్లలకు తల్లిగా మారినా...!
పవన్‌కల్యాణ్, భూమిక జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. ఆ సినిమా ఆఖరులో హీరో హీరోయిన్లకు పదిహేడు మంది పిల్లలు పుడితేనే.. అమ్మో ఇంతమంది పిల్లలా..? అని నోరెళ్లబెట్టాం. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు జరగవని అనుకున్నాం. కానీ ఆ తర్వాత చాలామంది జంటలు ఇంతకంటే ఎక్కువ మంది పిల్లల్నే కని వార్తల్లో నిలిచారు. ఈ కోవకే చెందుతుంది రష్యాకు చెందిన క్రిస్టియానా ఓజ్టర్క్. జార్జియాలో నివసిస్తోన్న 23 ఏళ్ల ఈ మహిళకు ఇప్పటికే 11 మంది పిల్లలున్నారు. అయితే పిల్లలంటే అమితమైన ప్రేమ చూపించే ఆమె వందకు మించి చిన్నారులు కావాలని కోరుకుంటోంది.
సరోగసీ విధానంలో..
రష్యా రాజధాని మాస్కోలో పుట్టి పెరిగిన క్రిస్టియానా గతంలో ఒకసారి హాలిడేస్ కోసం జార్జియాకు వెళ్లిందట. అక్కడే భర్త గాలిప్ ఓజ్టర్క్ను మొదటిసారిగా చూసింది. గాలిప్ టర్కీలో పుట్టి పెరిగినా జార్జియాలోనే స్థిరపడ్డాడు. అక్కడ అతనికి ఖరీదైన హోటల్, రెస్టరంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి పరిచయంలోనే ఒకరికొకరు ప్రేమలో పడిపోయారు క్రిస్టియానా-గాలిప్. ఆ తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తమ బంధాన్ని శాశ్వతంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం ‘విక’ అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది క్రిస్టియానా. అలా మొదటిసారి నేరుగా బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆ తర్వాత నుంచి సరోగసీ విధానంలో తల్లి కావడం మొదలుపెట్టింది.
ఒక్కో బిడ్డ కోసం రూ.7 లక్షలు!
1997 నుంచి జార్జియాలో సరోగసీ విధానాన్ని చట్టబద్ధంగా మార్చారు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్రిస్టియానా దంపతులు ఇప్పటివరకు పదిమంది చిన్నారులకు తల్లిదండ్రులుగా మారారు. ఈ క్రమంలో ఒక్కో బిడ్డ కోసం 8 వేల యూరోలు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.7 లక్షలు) ఖర్చు చేస్తున్నారట. అదేవిధంగా సరోగసీ విధానంలో పుట్టిన పిల్లలకు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఈ రష్యన్ కపుల్.
ఇక్కడితో పిల్లల్ని కనే ప్రయత్నం ఆపను!
‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగా ఆరేళ్ల క్రితం నా మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. ఆ తర్వాత సరోగసీ విధానంలో మరో 10 మంది పిల్లలకు తల్లిగా మారాను. గత నెలలోనే ‘ఓలివియా’ అనే పాపాయి మా జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఇక్కడితో మాత్రం పిల్లలను కనే ప్రయత్నం ఆపను. అదేవిధంగా ఎంతమంది పిల్లల్ని కంటానో ఇప్పుడు చెప్పలేను. అయితే కనీసం వందకు మించి చిన్నారులకు తల్లిదండ్రులుగా మారాలని మేమిద్దరం అనుకుంటున్నాం. ఇక సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం, సరోగేట్ తల్లులను ఎంచుకోవడం... తదితర బాధ్యతలన్నింటినీ మాకు తెలిసిన క్లినిక్‌కు అప్పగించాం. మా పాలసీలో భాగంగా సరోగేట్ తల్లులతో మేం అసలు మాట్లాడం. ఒకరికొకరు కనిపించం కూడా. భవిష్యత్‌లో మా పిల్లల విషయంలో ఎలాంటి సమస్యలు, న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాం’ అంటోంది క్రిస్టినా.
నా భార్య కోరికను నెరవేర్చాలనే!
ఈ సందర్భంగా తన భార్య కోరిక మేరకే సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిస్తున్నామంటున్నాడు గాలిప్. ‘నా భార్య క్రిస్టినాతో ఎవరైనా ఇట్టే కలిసిపోతారు. ఎందుకంటే తన పెదాలపై నిత్యం చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంటుంది. అదే నన్ను తన ప్రేమలో పడేలా చేసింది. ఇక నా భార్యకు పిల్లలంటే ఎంతో ఇష్టం. క్రిస్టినా కోరిక మేరకే సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నాం. ఎంతమంది పిల్లలున్నా విసుగు చెందకుండా వారి ఆలనాపాలన చూసుకునే సామర్థ్య తనకుంది’ అని తన భార్య గురించి చెప్పుకొచ్చాడు గాలిప్.
100 మంది పిల్లలకు తల్లిగా మారాలన్న క్రిస్టినా కోరికపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల కోసం ఆమె పడుతున్న తపన అభినందనీయమంటూ కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే... డబ్బులిచ్చి సరోగసీ విధానంలో పిల్లల్ని కనే బదులు ఎవరైనా అనాథ పిల్లలను పెంచుకుంటే బాగుంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో వసుంధర.నెట్ వేదికగా మీ అభిప్రాయాలను పంచుకోండి.