సహనానికి నిలువెత్తు రూపం స్ర్తీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది మహిళలు ఎన్ని సంకట పరిస్థితులు ఎదురైనా వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇదే కోవకే చెందుతుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన శిప్రా దీక్షిత్ అనే మహిళ. ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ఐదు నెలల పసికందుతోనే విధులకు హాజరవుతోంది. ఎన్ని అవస్థలు ఎదురైనా అమ్మ ప్రయాణం ఆగదు కదా అంటూ కదులుతున్న బస్సులో బిడ్డను చంకనెత్తుకుని మరీ టికెట్లు ఇస్తోంది.

చంటి బిడ్డను చంకనెత్తుకుని!
బస్ కండక్టర్ ఉద్యోగాలు ఎంతో కష్టంతో కూడుకున్నవి. విధి నిర్వహణలో విశ్రాంతి కాదు కదా.. కనీసం కూర్చొనే సమయం కూడా ఉండదు. నిత్యం కదులుతున్న బస్సులో నిలబడి డ్యూటీ చేయాల్సిందే. ఈ క్రమంలోనే ఐదు నెలల పసిబిడ్డను చంకనేసుకుని కండక్టర్ విధులు నిర్వర్తిస్తోంది శిప్రా దీక్షిత్. తను పని చేసే సంస్థలో పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడంతో తన బిడ్డను ఎత్తుకునే టికెట్లు ఇస్తూ రోజూ 165 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తోంది.

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ టాపర్ అయినా!
గోరఖ్‌పూర్‌లోని మాల్వియా నగర్లో నివాసముంటోన్న శిప్రా దీక్షిత్ 2016 నుంచి కండక్టర్‌గా పనిచేస్తోంది. అంతకుముందు ఇదే గోరఖ్‌పూర్ బస్ డిపోలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న తన తండ్రి చనిపోవడంతో ఈ ఉద్యోగానికి అర్హత సాధించింది శిప్రా. ఇక ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో టాపర్‌గా నిలిచిన ఆమె నీరజ్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంది. కానీ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అతను ఇంటి దగ్గరే ఉండిపోవడంతో కుటుంబ పోషణ కోసం తప్పక ఈ ఉద్యోగం చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఇక గతేడాది ప్రారంభంలో గర్భం దాల్చిన శిప్రా జూలై 25 నుంచి ఆరునెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఈ క్రమంలోనే 2020 ఆగస్టు 21న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తిరిగి ఈ ఏడాది జనవరి 19న విధుల్లోకి చేరిన ఆమె తన చంటి బిడ్డ ఆలనాపాలన చూసుకునేందుకు వీలుగా కండక్టర్‌గా కాకుండా కార్యాలయానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. అయితే అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఏదేమైనా విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.
పాపకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నా!
‘ఈ క్రమంలో ఉద్యోగం పోతుందన్న భయంతో చంటి బిడ్డను చంకనెత్తుకుని కండక్టర్ విధులు నిర్వర్తిస్తోంది శిప్రా. ‘నా తండ్రి గోరఖ్‌పూర్ బస్ డిపోలో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేశారు. నేనూ ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో టాపర్‌గా నిలిచాను. అయినా నా అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగంలో పదోన్నతి రావడం లేదు. పైగా హాజరు సరిగా లేదన్న కారణంతో జీతంలో కోత పడుతోంది. నా కన్నా తక్కువ అర్హతలు, అనుభవం ఉన్న వారికి కార్యాలయ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కానీ నా విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ఎందుకో అలక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెలవులు లేవంటున్నారు. అందుకే ఉద్యోగం పోతుందన్న భయంతో ఇలా పసిబిడ్డతో విధులకు హాజరవుతున్నాను. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇలా ఐదు నెలల పసిపాపతో కండక్టర్ విధులు నిర్వర్తించాలంటే ఎంతో కష్టంగా ఉంది. ప్రయాణికుల టికెట్లు, డబ్బులు సరిచూసుకునే క్రమంలో నా చిన్నారికి కనీసం పాలు కూడా ఇవ్వలేకపోతున్నాను. రవాణా శాఖలో నా తండ్రి అందించిన సేవలు, నా విద్యార్హతలు, నా పసిబిడ్డ పరిస్థితి గురించి ఉన్నతాధికారులు మరోసారి ఆలోచించాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శిప్రా.
గర్భంతోనే పోటీ చేసింది.. గెలిచింది!

ప్రసవానికి కొన్ని గంటల ముందు వరకు కూడా అధికారిక బాధ్యతలు నిర్వర్తించి ఇటీవల అందరి ప్రశంసలు అందుకుంది జైపూర్ నగర్ నిగమ్ మేయర్ సౌమ్యా గుర్జర్. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన లీలా కనకదుర్గ. 9 నెలల నిండు గర్భంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నాకే పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. అమ్మాయి పుట్టిన వేళావిశేషమో ఏమో కానీ అదే రోజు అర్ధరాత్రి వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆ తల్లి ఘన విజయం సాధించడం విశేషం.
నిండు గర్భంతోనే నామినేషన్! మహిళలకు మాతృత్వం ఓ వరం. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మతనం కోసం ఆరాటపడుతుంటారు. గర్భం దాల్చాక కడుపులో పడిన నలుసుకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటారు. అలాంటిది తొమ్మిది నెలల నిండు గర్భంతోనే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసింది లీల. ఇంటింటికీ తిరుగుతూ పట్టుదలతో ప్రచారం చేసింది. తన కష్టాన్ని చూసిన ఆ దేవుడు కూడా అన్ని రకాలుగా తనను ఆశీర్వదించాడు. పండంటి బిడ్డను ప్రసాదించడంతో పాటు ప్రజాసేవ చేసేందుకు సర్పంచి పదవిని కూడా కట్టబెట్టాడు. ఇంటింటికీ తిరుగుతూ! లీల భర్త మహేశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వారికి రెండేళ్ల పాప ఉంది. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం సర్పంచి అభ్యర్థిగా పోటీలో నిలబడింది లీల. అయితే ఇంతలో కరోనా కమ్ముకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఏడాది తర్వాత మళ్లీ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కానీ ఈసారి ఆమెను పోటీలో నిలిపే విషయంలో అందరూ ఆలోచనలో పడ్డారు. లీల తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడమే దీనికి కారణం. కానీ లీల మాత్రం ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. తన పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని చూసి అందరూ సరేనన్నారు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. పైగా బరిలో బలమైన ప్రత్యర్థి. అయినా మొక్కవోని ధైర్యంతో నిండు గర్భంతోనే నామినేషన్ వేసింది లీల. ఇంటిపట్టున ఉండకుండా ఎన్నికల గుర్తు ‘బుట్ట’ చేత్తో పట్టుకుని ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టింది. గర్భిణీ అన్న సానుభూతిని ఆశించకుండా తన అభివృద్ధి ప్రణాళికలను అందరికీ చేరేలా చేసింది.
 నొప్పిని భరిస్తూ! నెలలు నిండే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది లీల. నడిచి నడిచి కాళ్లు వాచి నొప్పులు పెట్టినా పంటి బిగువున దాచుకుని... పెదవులపై చిరునవ్వుతో ఓట్లను అభ్యర్థించింది. ఇక పోలింగ్ రోజు ఉదయం 6.30కే ఓటు వేసింది. అయితే కాసేపటికే పురిటి నొప్పులు మొదలవ్వడంతో కైకలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక అదే రోజు అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో సమీప ప్రత్యర్థిపై 689 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది కనకదుర్గ. ఈ సందర్భంగా సర్పంచి పదవి తన కూతురు తెచ్చిన అదృష్టమేనంటూ తెగ సంబరపడిపోతోంది. ‘నేను ఓటు హక్కు వినియోగించుకున్నది ఒక్కసారే. అయితే రెండోసారి నా ఓటు నాకే వేసుకునే అవకాశం వస్తుందని ఊహించలేదు. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది సర్పంచి పదవి రావడం నా బిడ్డ తెచ్చిన అదృష్టమే’ అంటోంది లీల.
|