Image for Representation
వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. మన దేశంలో కొంతమేరకు శాంతించినా అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. వేలాదిమందిని తన బాధితులుగా మార్చుకుంటూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. దీనికి తోడు ‘స్ట్రెయిన్’, ‘వేరియంట్’ అంటూ కొత్త రకం కరోనా వైరస్లు పుట్టుకొస్తుండడంతో ఆయా దేశాల ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే గడుపుతున్నారు. ప్రత్యేకించి వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు కరోనా రక్కసి భయంతో తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 116 ఏళ్ల ఓ వృద్ధురాలు కొవిడ్‌పై విజయం సాధించారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఆమె మూడు వారాల్లోనే ఈ మహమ్మారిని జయించారు. తద్వారా తనలాంటి బాధితులతో పాటు పలువురు వృద్ధుల్లో మానసిక స్థైర్యం నింపారు.
పుట్టిన రోజుకు ఒక రోజు ముందే!
ఆరోగ్యకరమైన జీవన శైలి, నిరంతర అప్రమత్తత, కొద్ది పాటి జాగ్రత్తలు, అన్నిటికీ మించి మానసిక స్థైర్యం మెండుగా ఉంటే కరోనాను జయించవచ్చని ఇప్పటికే ఎందరో వృద్ధులు నిరూపించారు. వందేళ్ల వయసు దాటినా, వివిధ అనారోగ్యాలున్నా ప్రమాదకర వైరస్‌పై విజయం సాధిస్తూ పాజిటివిటీని చాటుతూనే ఉన్నారు.
సరిగ్గా ఈ కోవకే చెందుతారు ఫ్రాన్స్‌కు చెందిన 116 ఏళ్ల సిస్టర్ ఆండ్రే. అక్కడి టౌలాన్ నగరంలోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమె గత నెలలో కొవిడ్ బారిన పడ్డారు. మూడు వారాల పాటు ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం... తాజాగా కొవిడ్ నిర్ధారిత పరీక్షలో నెగెటివ్ వచ్చింది. తన 117వ పుట్టిన రోజుకు సరిగ్గా ఒక రోజు ముందే ఆమె కరోనా నుంచి కోలుకోవడం విశేషం.
స్పానిష్ ఫ్లూ నుంచి కూడా..!
గెరెంటాలజీ రీసెర్చ్ గ్రూప్ (GRG) ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో బతికున్న వారిలో రెండో అతి పెద్ద వృద్ధురాలు సిస్టర్ ఆండ్రే. జపాన్‌కు చెందిన ‘కానే తనక’ ఈ జాబితాలో అందరికంటే ముందున్నారు. ప్రపంచంలో అతి పెద్ద వృద్ధురాలైన ఆమె గత నెలలోనే 118వ వసంతంలోకి అడుగుపెట్టారు. సిస్టర్ ఆండ్రే విషయానికి వస్తే ఆమె అసలు పేరు లూసిల్ రాండన్. 1904 ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లో జన్మించిన ఆమె తన జీవిత కాలంలో మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలను కళ్లారా చూశారు. అదేవిధంగా 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారిని తట్టుకుని నిలబడ్డారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించేందుకు కృషి చేశారు. 1944లో నన్‌గా మారిన లూసిల్ రాండన్... అప్పుడే తన పేరును సిస్టర్ ఆండ్రేగా మార్చుకున్నారు. 2009లో టౌలాన్ నగరానికి వచ్చిన ఆమె అప్పటి నుంచే ఓ నర్సింగ్‌హోంలో నివాసముంటున్నారు. వయసు పైబడడంతో ప్రస్తుతం వీల్‌చైర్‌లోనే గడుపుతున్నారామె. కళ్లు కూడా సరిగా కనిపించడం లేదు.
నాకు చావంటే భయం లేదు!
ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో గత నెలలో ఆండ్రే నివాసముండే ప్రాంతంలో 88 మందికి గాను 81 మందికి కరోనా సోకింది. వారిలో 10 మంది కోలుకోలేక కన్ను మూశారు. ఈ క్రమంలో ఆండ్రేకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేకపోయినా కరోనా నిర్ధారిత పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. జనవరి 16న ఆమెకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలియడంతో నర్సింగ్ హోం అధికారులు వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అలా మూడు వారాల పాటు చికిత్స తీసుకున్న ఈ గ్రాండ్ ఓల్డ్ వుమన్ సరిగ్గా తన 117 వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే కొవిడ్ నుంచి కోలుకున్నారు.
‘నాకు కరోనా సోకిందని తెలియలేదు. నాలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా నేను ఏ మాత్రం భయపడలేదు. ఎందుకంటే నాకు చావంటే భయం లేదు. ఎక్కడో, ఎప్పుడో ఓసారి నా పెద్దన్న, తాత, అమ్మమ్మలను కలుసుకోవాలని నాకూ ఉంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారీ బ్రేవ్ వుమన్.
ఆమె ఎంతో స్ఫూర్తినిచ్చారు!
ఇక నేటితో 117 వ వసంతంలోకి అడుగుపెట్టిన సిస్టర్ ఆండ్రే పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు నర్సింగ్ హోం అన్ని ఏర్పాట్లు చేసింది. ‘ఆండ్రే చాలా అదృష్టవంతురాలు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తనకు వచ్చిన వీడియో సందేశాలకు ప్రశాంతంగా రిప్లై ఇస్తున్నారు. ఆమెను అలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంచడమే మా ప్రాధాన్యం. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో పరిమిత అతిథుల మధ్య ఆండ్రే పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాం.
ఇక ఆమె ఆహారపు అలవాట్ల విషయానికొస్తే... బాతు కాలేయంతో తయారు చేసిన ప్రత్యేకమైన పదార్ధంతో పాటు, బేక్డ్ అలాస్కా, గ్లాస్ రెడ్ వైన్‌ను ఆమె ఆహారంగా తీసుకుంటారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఓ గ్లాస్ వైన్‌ను తాగుతారు. ఆండ్రేకు ఆరోగ్య స్పృహ చాలా ఎక్కువ. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి ఆరోగ్య పరిస్థితుల గురించి నిత్యం తెలుసుకుంటుంటారు. ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటారు’ అని నర్సింగ్ హోం ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.