Photo: Instagram
మన దేశ సంప్రదాయంలో చీరకట్టు, పంచెకట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సంస్కృతికి చిహ్నంగా భావించే చీరకట్టు అతివల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా పంచెకట్టు ధరించిన అబ్బాయిలు అయితే ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తుంటారు. అయితే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో ఈ సంప్రదాయ దుస్తులు ధరించేవారు చాలా తక్కువే అని చెప్పాలి. అందమైన ఈ అవుట్‌ఫిట్స్ ధరించినప్పుడు వారు కాస్త అసౌకర్యానికి గురవ్వడమే అందుకు కారణం. అయితే అమెరికాకు చెందిన ఓ ప్రవాస భారతీయ జంట మాత్రం సంప్రదాయ చీరకట్టు, పంచెకట్టులో మంచుపై స్కీయింగ్ చేశారు. ఈ ట్రెడిషినల్ అవుట్ఫిట్స్లోనే ఓవైపు ఆటను, మరోవైపు ప్రకృతి అందాలను మనసారా అస్వాదించారు. ఈక్రమంలో దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంప్రదాయ దుస్తుల్లో ఐస్ స్కీయింగ్!
పాములు పట్టడం, జిమ్నాస్టిక్స్ చేయడం, కఠినమైన వ్యాయామాలు చేయడం, మారథాన్లలో పాల్గొనడం, స్కై డైవింగ్ చేయడం...ఇలా ఒకటా రెండా ఏ సాహసమైనా చీరకట్టులో అలవోకగా చేసేయచ్చని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. ఈక్రమంలో అమెరికాకు చెందిన దివ్య మైయా అనే ప్రవాస భారతీయ మహిళ చీరకట్టుతో మంచుపై స్కీయింగ్ చేసింది. ఆమె భర్త మధు కూడా ధోతీ ధరించి ఈ సాహసకృత్యంలో భాగమయ్యాడు. ప్రస్తుతం ఈ అందాల జంట ఐస్ స్కీయింగ్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఆటను ఆస్వాదిస్తూ..!
సాహసోపేతమైన ఐస్ స్కీయింగ్‌లో పాల్గొనాలంటే తలకు ధరించే హెల్మెట్ నుంచి కాళ్లకు ధరించే సేఫ్టీ షూస్ వరకు పలు జాగ్రత్తలు పాటించాలి.. లేకపోతే గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే మంచుపై స్కీయింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు చాలావరకు వదులైన దుస్తులు కాకుండా కాస్త బిగుతుగా ఉండే దుస్తులు లేదంటే స్పోర్ట్స్ వేర్ ధరిస్తుంటారు. అయితే ఏం చేసినా నలుగురిలోనూ ప్రత్యేకంగా ఉండాలనుకునే దివ్య, మధు దంపతులు మాత్రం సంప్రదాయ చీరకట్టు, ధోతీ ధరించి ఐస్ స్కీయింగ్ చేశారు. ఈ సందర్భంగా దివ్య తన స్కీయింగ్ గేర్‌తో పాటు బ్లూ కలర్ శారీ ధరించి ఇటు తన చీరను ప్రదర్శిస్తూనే అటు అలవోకగా స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇక మరోవైపు గ్రీన్ షర్ట్, ధోతీతో ఆమె భర్త మధు ఈ సాహసకృత్యంలో పాల్గొన్నారు. మిన్నెసోటా నగరంలోని ప్రఖ్యాత స్కీయింగ్ స్పాట్‌గా పేరొందిన ‘వెల్చ్’ ఈ సాహస క్రీడకు వేదికగా మారింది.
అప్పుడప్పుడూ ఇలా చేయాల్సిందే!
ఇలా సంప్రదాయ దుస్తుల్ని ధరించి స్కీయింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దివ్య. ‘మనల్ని మనం మార్చుకోవడానికి అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేయాల్సిందే’ అని మొదటి పోస్ట్‌లో చెప్పుకొచ్చిందామె. ఈ క్రమంలో తన ఫొటోలు, వీడియోలకు ఊహించని స్పందన రావడంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొక పోస్ట్ పెట్టింది. ‘నేను చేసే ప్రతి పనిలోనూ నా భర్త తోడుగా నిలస్తున్నారు. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ జంట స్కీయింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దివ్య పోస్ట్ చేసిన మొదటి వీడియోకు ఇప్పటివరకు సుమారు 3.3లక్షల వ్యూస్ రాగా, దాదాపు 16వేలకు పైగా లైకులు రావడం విశేషం. వీటిని చూసిన ఓ నెటిజన్ ‘బ్యూటిఫుల్ కపుల్... మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ దివ్య-మధు జంటను ప్రశంసించగా, మరొకరు ‘మేం కూడా ఇలా సంప్రదాయ దుస్తుల్ని ధరించి స్కీయింగ్ చేయాలనుకుంటున్నాం’ అంటూ కామెంట్ పెట్టారు.