Photos: Screengrab
నవమాసాలు మోసి అమ్మ మనకు ప్రాణమిస్తుంది. కానీ ఆ ప్రాణాన్ని మురిపెంగా, అపురూపంగా చూసుకుంటూ, అడుగడుగునా అండగా ఉంటూ, కంటికి రెప్పలా కాపాడతాడు నాన్న. మనం ఏ దారిలో వెళ్లినా..ఏ అవరోధం మనల్ని ఆపినా... నీ వెంట నేనున్నానని మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇలా పుట్టినప్పటి నుంచి పెరిగి, పెద్దయి, ప్రయోజకులమయ్యే దాకా మనం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటాడు. ఇక నాన్న కూచీలు అనిపించుకునే అమ్మాయిలు అయితే తమ జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే సమయంలో తండ్రి అందించే ఆశీర్వచనాలే ఆమెకు కొండంత అండనిస్తాయి. అలాంటిది జీవితాంతం అన్నీ తానై పెంచిన నాన్న ప్రాణాలతో లేకపోతే ఆ అమ్మాయి పడే ఆవేదన వర్ణనాతీతం. ఈక్రమంలో అలాంటి బాధ తన చెల్లి పడకూడదని ఓ మహిళ అద్భుతమే చేసింది.
తండ్రి లేని లోటు తీర్చుతూ!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో ఆనందంగా, అట్టహాసంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి జీవితాంతం వేలు పట్టి నడిపించిన నాన్న ఇలాంటి శుభకార్యంలో లేకపోతే...?! తమిళనాడుకు చెందిన ఓ నవ వధువుకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈక్రమంలో తండ్రి తమతో లేడన్న బాధను మరిపించేందుకు అచ్చం ఆయన పోలికలతో ఓ మైనపు విగ్రహాన్ని తయారు చేయించింది వధువు సోదరి. తద్వారా అప్పగింతల సమయంలో తండ్రి లేని లోటు తెలియకుండా చేసింది.

సుమారు రూ.6లక్షల ఖర్చుతో!
తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన భార్య పేరు కళావతి. ఈ దంపతులకు భువనేశ్వరి, దివ్య, లక్ష్మీప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో తన కూతుళ్లకు ఏ లోటూ రానీయకుండా పెంచి ప్రయోజకులను చేశారు సెల్వం. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే కాకుండా ఇద్దరు కూతుళ్లకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడా తండ్రి. అలా ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబాన్ని చూసి కాలానికి కన్ను కుట్టినట్లయింది. 2012లో సెల్వం కన్నుమూయడం ఆ ముగ్గురు కుమార్తెల్ని తీవ్రంగా కలచి వేసింది. తాజాగా సెల్వం మూడో కూతురైన లక్ష్మీ ప్రభ వివాహం కిశోర్ అనే యువకుడితో నిశ్చయమైంది. ఈక్రమంలో ఇద్దరు సోదరీమణుల వివాహాలను ఘనంగా జరిపించిన తన తండ్రి తన పెళ్లిలో కూడా ఉంటే బాగుండేదనిపించింది కాబోయే వధువుకు. ఈ విషయం లండన్‌లో ఉంటోన్న వధువు అక్క భువనేశ్వరికి తెలిసింది. దీంతో చెల్లెలి బాధను కొంతైనా తీర్చాలనుకున్న ఆమె ఈ విషయాన్ని తన భర్త కార్తీక్‌కు చెప్పింది. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం ముందుగానే ఇండియా చేరుకున్న భువనేశ్వరి బెంగళూరుకు వెళ్లి మైనపు విగ్రహాలు తయారుచేయడంలో నిపుణులైన సిధరమూర్తిని కలుసుకుంది. తండ్రి ఫొటో చూపించి..అచ్చం ఆయనలా ఉండే మైనపు విగ్రహం తయారుచేయాలని కోరింది. ఇందుకోసం కొద్ది రోజుల పాటు బెంగళూరులో ఉండిపోయిన భువనేశ్వరి దంపతులు దగ్గరుండి విగ్రహ తయారీని గమనించారు. ఈక్రమంలో సుమారు రూ. 6లక్షల ఖర్చుతో సుమారు 5 అడుగులు 7 అంగుళాల తండ్రి మైనపు విగ్రహాన్ని చేయించింది భువనేశ్వరి.

అక్కా, బావల ఆశీర్వాదం తీసుకుంది!
ఇక లక్ష్మీ ప్రభ పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. పెళ్లికూతురుగా ముస్తాబైన ఆమె వివాహ వేదిక వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఉన్న తన తండ్రి మైనపు విగ్రహాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనయింది. స్వయంగా తన తండ్రే పెళ్లి వేడుకకు వచ్చాడని తెగ సంబరపడిపోయిన ఆమె ఆనందంగా వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంది. ఈక్రమంలో ఆ మైనపు విగ్రహం ముందే కిశోర్‌తో మూడుముళ్లు వేయించుకుంది. అనంతరం తండ్రి లేని లోటును తీర్చిన తన అక్క, బావల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తులు ధరించి అచ్చం వధువు తండ్రిని మరిపించేలా ఉన్న ఈ మైనపు విగ్రహాన్ని అతి దగ్గరగా చూస్తే తప్ప విగ్రహం అని కనిపెట్టలేం. అంతగా ఇందులో జీవ కళ ఉట్టిపడుతుండడం విశేషం.