Image for Representation
‘ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. కడుపులో పడ్డ నలుసు ఆడపిల్ల అని తెలియగానే తనను భూమ్మీదకు రాకుండా ఆపేసే వారూ ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ యజమాని తెగ సంబరపడిపోయాడు. మా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను అందరితో షేర్ చేసుకుంటూ తనకున్న మూడు సెలూన్లలో ఒక రోజంతా కస్టమర్లకు ఉచితంగా సెలూన్ సేవలందించాడు.
కూతురు పుట్టిందని ఉచితంగా సెలూన్ సేవలు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన సల్మాన్‌కు నగరంలో మూడు హెయిర్ సెలూన్లు ఉన్నాయి. ఇతనికి తాజాగా ఓ పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈక్రమంలో తన సంతోషాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు సల్మాన్. ఇందులో భాగంగా నగరంలో తనకున్న మూడు హెయిర్ సెలూన్లలో ఉచితంగా సెలూన్ సేవలు పొందచ్చంటూ తన కస్టమర్లందరికీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ మేరకు తన మూడు షాపుల వద్ద బ్యానర్లు కూడా ఏర్పాటుచేశాడు. అనంతరం తాను అనుకున్నట్లే ఒక రోజంతా సుమారు 80 మంది కస్టమర్లకు ఉచితంగా హెయిర్ సెలూన్ సేవలు అందించాడు.
ఆ సందేశం అందరికీ చేరవేయాలనే!
ఈ సందర్భంగా ఆడపిల్లల పుట్టుక ప్రతి ఇంట్లో ఆనందం నింపుతుందనే సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ను ప్రకటించానంటున్నాడు సల్మాన్. ‘ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. అలాంటి లక్ష్మి ఇంట్లో అడుగుపెడుతుంటే సంతోషంతో స్వాగతం పలకాలి. అంతేకానీ కూతురు పుట్టిందని బాధపడకూడదు. అలా బాధపడే వారిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. వారికి నిజంగా ఆడపిల్లల విలువ తెలియదు. అందుకే అలా ప్రవర్తిస్తుంటారేమో..! ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా.. ఒక్క ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుంది. అందుకే నాకు కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. కోరుకున్నట్లుగానే దేవదూత రూపంలో ఓ చిన్నారి మా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. అదే సందర్భంలో ఆడపిల్ల పుడితే బాధపడకూడదు.. సంతోషపడాలనే సందేశాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే నగరంలో నాకున్న మూడు సెలూన్లలో ఒకరోజంతా ఉచితంగా సేవలు అందించాను. సుమారు 80మందికి పైగా కస్టమర్లు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకున్నారు’ అని సంతోషంతో చెప్పుకొచ్చాడు సల్మాన్.
సమాజానికి మంచి సందేశమిచ్చావు!
ఈ సందర్భంగా ఆడపిల్ల జన్మించిందని సంతోషంతో ఉచిత సెలూన్ సేవలు అందించిన సల్మాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక నెటిజన్లు అయితే ‘నీ సెలబ్రేషన్స్‌తో సమాజానికి ఓ మంచి సందేశమిచ్చావు... నీకు సెల్యూట్’, ‘గ్రేట్ ఫాదర్’ ‘అందరూ సల్మాన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
ఆడపిల్లను కన్న కోడలిపై పూల వర్షం!
ఇటీవల తెలంగాణ రాష్ర్టంలోని మహబూబాబాద్‌లో ఆడపిల్లను కన్న కోడలిపై అత్తింటివారు పూల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన నవీన్, రమ్యలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా రమ్య మూడు నెలల క్రితం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత సంప్రదాయ ప్రకారం పుట్టింటికి వెళ్లింది. మరోవైపు తమ మనవరాలు తమ ఇంటికి ఎప్పుడు వస్తుందా? అని నవీన్ తల్లి, కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఆ శుభ సందర్భం రానే వచ్చింది. రమ్య తన బిడ్డను తీసుకుని అత్తారింటికి రాగా.. ఎవరూ ఊహించని విధంగా ఆ తల్లీబిడ్డలపై పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు అత్తింటి వారు. మహాలక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిందన్న ఆనందంతో ఇంటి బయట నుంచి లోపలి గది వరకు వారిని పూల బాటపై నడిపించారు. అనంతరం మంచంపై పూలను అందంగా పేర్చి మధ్యలో బిడ్డను పడుకోబెట్టి మురిసిపోయారు.
ఆడపిల్ల భారం అనుకునే వారందరికీ ఇలాంటి సంఘటనలు చెంపపెట్టు లాంటివని చెప్పడంలో సందేహం లేదు.