పూర్వం ఒక వూఊళ్లో ఒక మాస్టారు పాఠాలు చెప్తుండగా ఒక పిల్లి అక్కడికి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ పిల్లల దృష్టిని మళ్లిస్తోంది. ఇలా రెండు మూడుసార్లు జరిగే సరికి అక్కడున్న పనివాడిని పిలిచి పాఠం ముగిసేవరకు ఆ పిల్లిని అక్కడున్న చెట్టుకు కట్టేయమన్నాడు మాస్టారు. ఇలా రెండు మూడురోజులు జరిగింది. మరుసటిరోజు నుండి పాఠం మొదలయ్యేముందు పిల్లిని కట్టేయడం పనివాడికి ఒక ఆనవాయితీగా మారింది.
కొంతకాలానికి మాస్టారు కాలం చేశారు. పిల్లి కూడా అక్కడినుండి వెళ్లిపోయింది. అదే పాఠశాలలో చదువుకున్న ఓ విద్యార్ధే కొత్త మాస్టారిగా బాధ్యతలు తీసుకున్నాడు. మొదటిరోజు తన గురువుగారికి నమస్కరించుకొని పాఠం ప్రారంభించబోయాడు. ఇంతలో బయట చెట్టుకి పిల్లి కట్టేసి లేకపోవడం గమనించాడు. తృటిలో ఎంత ప్రమాదం తప్పిపోయిందంటూ అక్కడున్న పనివాడిని పిలిచాడు. 'మాస్టారిక్కడ పాఠం మొదలుపెట్టేముందు అక్కడ చెట్టుకు పిల్లిని కట్టేసుంచాలని తెలియదా..!' అంటూ కేకలేశాడు. ఊవూళ్లోకి వెళ్లి మరో పిల్లిని తెచ్చి కట్టేసేవరకు ఆయన పాఠం ప్రారంభించలేదు.

ఈ కథ విని మనమంతా ఆ కొత్త మాస్టారి అమాయకత్వం, చాదస్తం చూసి నవ్వుకుంటాం. కానీ మనలో చాలామంది అతని స్థానంలోనే ఉన్నామంటే నమ్ముతారా...! పైకథలో పెద్దమాస్టారు పెట్టిన పద్ధతిని తు.చ తప్పకుండా పాటించాలనే ఆత్రం తప్ప...అలా ఎందుకు పెట్టాల్సొచ్చిందో, దాని వెనకున్న కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు చిన్న మాస్టారు.
మనం కూడా మన పూర్వీకులు, పెద్దవారు చెప్పిన ఎన్నో ఆచారాలను క్రమం తప్పకుండా పాటిస్తుంటాం. కానీ వాటి వెనకున్న కారణాలు, ప్రయోజనాలు తెలుసుకోవడం మానేస్తున్నాం. దీనివల్ల ప్రతి పనిలో కారణాలు, లాజిక్కులు వెతికే ఈ తరానికి అవి స్పష్టంగా అందించలేకపోతున్నాం. దానితో వాళ్లు ముఖ్యమైన వాటిని కూడా కాలం చెల్లిన వాటితో కలిపి మూఢనమ్మకాల జాబితాలో కలిపేస్తున్నారు.

పైకథలో పెద్దమాస్టారు- మన పూర్వీకులు
పిల్లిని కట్టేయడం - ఒక ఆచారం
కొత్త మాస్టారు - సరైన కారణాలు తెలుసుకోకుండా ఆచారాలు పాటించేవారు.
మన ఆచారాల్లో కొన్ని అప్పటి కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాటించినవి ఉన్నాయి. అలానే అప్పటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఇప్పటికీ పాటించదగినవి ఉన్నాయి. అంతెందుకు.? ఇంత సాంకేతిక పరిజ్ఞానముండీ కూడా ఎన్నో సమస్యలకు మనం కనిపెట్టలేని పరిష్కారాలు మనవాళ్లు అప్పట్లోనే కనుగొన్నారు. వాటిని ఆచారాలుగా, సంప్రదాయాలుగా మనకు పరిచయం చేశారు. అలాంటి కొన్ని ఆచారాలు/సంప్రదాయాలు, వాటి వెనకున్న శాస్త్రీయ పరమైన కారణాలు...వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!

పసుపు రాయటం:
ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంటి గడపలకి నిత్యం పసుపు రాయాలంటారు. అలానే ఆడవారి పాదాలకు కూడా రాసుకోమంటుంటారు. కానీ ఇప్పుడా పద్ధతి కేవలం పండగలు, పబ్బాలు, శుభకార్యాలకే పరిమితమైంది.
మనవారి కారణాలు: పసుపు శుభాన్ని సూచిస్తుంది. పసుపు రాసుకోవడం వల్ల ఇంటికి లక్ష్మీకళ వస్తుంది.
సాంకేతిక కారణాలు: పసుపును యాంటీబయాటిక్‌గా పిలుస్తారు. కంటికి కనపడని ఎన్నో క్రిమికీటకాలు దరి చేరకుండా రక్షణనిస్తుంది. ఇప్పటికీ దెబ్బ తగిలినప్పుడు ముందుగా పసుపు రాసేవారిని మనం చూస్తూనేవుంటాం.

తులసి:
ఇంటి పెరట్లో గానీ, ఆవరణలోగానీ ఒక తులసి మొక్కైనా ఉండాలంటారు. దాని వెనకున్న కారణాలు చూద్దామా...
మనవారి కారణాలు: తులసి మొక్కను సంజీవనిగా, అమ్మవారి స్వరూపంగా భావిస్తారు.
సాంకేతిక కారణాలు: వారంలో మూడుసార్త్లెనా తులసి ఆకులు తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఎన్నో రకాలైన క్యాన్సర్ కణాల నుంచి రక్షణ పొందవచ్చు.

తోరణాలు:
ఇంట్లో పండగలు, శుభకార్యాలప్పుడు ముందుగా మనం చేసే పని ఇల్లంతా తోరణాలతో అందంగా అలంకరించడం. అవి లేని శుభకార్యాలను ఊహించలేం కూడా. వాటి వెనకున్న ప్రయోజనాలు తెలుసుకుందాం.
మన కారణాలు: తోరణాలు కట్టడం ఇంటికి శుభకరం. వాటిలాగే ఇల్లు కూడా కలకాలం పచ్చగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు.
సాంకేతిక కారణాలు: పండగలు, శుభకార్యాలప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువమంది కలుస్తుంటారు. దానివల్ల అక్కడి వాతావరణంలో అధికంగా కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలయ్యే అవకాశముంది. ఇంటికి తోరణాలు కట్టడం మూలాన అక్కడ ఏర్పడే కార్బన్-డై-ఆక్సైడ్‌ని అంతా అవి గ్రహించి ప్రాణవాయువుని తిరిగిస్తాయి. అందులోనూ మామిడి, వేపలకు అధిక మొత్తంలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసే గుణముంటుంది.

నమస్కారం:
పూర్వం ఎవరైనా ఎదురైనపుడు ముందుగా వారికి నమస్కరించడం మన ఆనవాయితీ. ఇప్పుడు వాటి స్థానంలోకి షేక్హ్యాండ్లు, హైఫైలు వచ్చాయనుకోండి. ఈ ఆచారం వెనుకగల కారణాలు చూద్దాం.
మన కారణాలు: ఇది మన సంప్రదాయం. ఎదుటివారిని గౌరవిస్తే ఆ గౌరవం తిరిగి మనకు లభిస్తుందని మనవారి నమ్మకం.
సాంకేతిక కారణాలు: మనం నమస్కారం చేసినప్పుడు రెండు చేతుల మునివేళ్లు ఒకదానికొకటి తాకడం వల్ల ఆ నాడుల మధ్య ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. తద్వారా మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పూర్తి శ్రద్ధతో మాట్లాడతాం. మాట్లాడిన విషయాలు కూడా ఎక్కువ కాలం గుర్తుంటాయి.

కుంకుమ/సింధూరం:
హిందూ సంప్రదాయాల్లో కుంకుమకు ప్రత్యేకమైన స్థానముంది.
మన కారణాలు: కుంకుమ శుభాన్ని సూచిస్తుంది.
సాంకేతిక కారణాలు: కనుబొమ్మల మధ్య ఉండే నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అక్కడ కుంకుమను పెట్టుకునే క్రమంలో ఆ ప్రాంతాన్ని ఎక్కువసార్లు మర్దన చేసే అవకాశముంటుంది. దీనివల్ల వారికి ఏకాగ్రత పెరిగి చేసే పనులపై పూర్తి దృష్టి ఉంటుంది.

రాగి నాణాలు:
ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు లేదా నదీ ప్రవాహం చూసినప్పుడు వెంటనే పెద్దవారు మన చేతికి నాణాలిచ్చి నీటిలో వేయమంటుంటారు. అలా ఎందుకంటారో తెలుసుకుందాం.
మన కారణాలు: నీటిలో వేసిన నాణాలు గంగాదేవికి చేరతాయని, అలా చేస్తే పుణ్యం లభిస్తుందని మనవారి నమ్మకం.
సాంకేతిక కారణాలు: ఈ ఆచారం మొదలుపెట్టినప్పుడు రాగి నాణాలు వాడుకలో ఉండేవి. రాగిలో క్రిములను చంపే గుణాలుంటాయి కనుక ఆ రాగి కలిసిన నీరు అందరికీ చేరాలని తాగునీటికి ఆధారమైన నదుల్లో, దేవాలయ కొలనుల్లో వాటిని వేసేవారు. కానీ కాలక్రమేణా ఇప్పుడా ఆచారం స్టెయిన్ లెస్ స్టీల్ నాణాలు, పేపర్ నోట్ల రూపాల్లో కూడా చలామణీ అవుతోంది. లేనిపోని కాలుష్యానికి కారణమవుతోంది.

గోరింటాకు:
పూర్వం గోరింటాకు ఇంట్లోనే నూరి పెట్టుకునేవారు. ఇప్పుడు వాటి స్థానంలోకి మెహందీలు వచ్చాయి.
మన కారణాలు: గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెద్దవారు సరదాగా ఆటపట్టిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి సమయాల్లో చేతులు ఆకర్షణీయంగా కనపడడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
సాంకేతిక కారణాలు: గోరింటాకులో మానసిక ఒత్తిడిని, అలసటను దూరంచేసే గుణాలుంటాయి. అందుకే తరచూ గోరింటాకు పెట్టుకోమని పెద్దవారు చెప్తుంటారు. ఎక్కువగా పెళ్లి సమయాల్లో వధూవరులకు దీనిని వాడమని వారు సూచిస్తారు.
ఇలా మనకు మేలు చేసే ఆచారాలు, సంప్రదాయాలు ఎన్నో మనకున్నప్పటికీ వాటి వెనకున్న ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని మూఢ నమ్మకాలుగా కొట్టిపడేస్తుంటారు. అలా అని పూర్వీకులు పాటించిన ప్రతీ ఆచారం పాటించాలని నియమేమీ లేదు.. వాటి వెనకున్న ప్రయోజనాల్ని గుర్తించి ఇప్పటి పరిస్థితులకు ఉపయోగపడే ఆచారాలను పాటిస్తే మంచిది..!