శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్, అటు ఆన్లైన్ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా బాడీ షేమింగ్ ప్రస్తుతం మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇలాంటి భావోద్వేగాల వల్ల మనకే నష్టం. అందుకే బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. మరి, కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!
కొంతమందికి తమ కంటికి ఏది నచ్చకపోయినా ఏదో ఒకటి కామెంట్ చేయడం అలవాటు. ఆ అమ్మాయి బాగా లావుగా ఉందనో, రంగు తక్కువగా ఉన్నావు.. ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారనో.. ఇలా ఎదుటివారి శరీరాకృతి, అందం గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. ఇక ఇలాంటి విమర్శలకు గురైన మహిళలు తమ శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడుతుంటారు. ఆ ధోరణే వద్దంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసుకోవాలంటే ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం కంటే మంచి మందు లేదంటున్నారు.

వ్యాయామంతో ‘ప్రేమ’ పెరుగుతుందట!
బాడీ షేమింగ్ వల్ల సుమారు 91 శాతం మంది మహిళలు తమ శరీరం పట్ల సంతృప్తిగా లేరని చెబుతోంది ఓ అధ్యయనం. అంతేకాదు.. ఇతరుల మాటలు పట్టుకొని కాస్మెటిక్ సర్జరీ ద్వారా తమ అందానికి మెరుగులు దిద్దుకునే వారూ రోజురోజుకీ పెరిగిపోయే అవకాశం ఉందని అంటోంది. నిజానికి ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టపోయేది మనమే! అందుకే వీటి నుంచి బయటపడి సానుకూల దృక్పథం వైపు అడుగులేయాలంటే, మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలంటే అందుకు వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అసలు వ్యాయామానికి, బాడీ పాజిటివిటీకి సంబంధం ఏంటి.. అనుకుంటున్నారా? చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎలాగంటే.. వ్యాయామం చేసే క్రమంలో మన శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇవి మనలోని ప్రతికూల ఆలోచనల్ని తరిమికొట్టి మనసును సంతోషం వైపు నడిపిస్తాయి. తద్వారా హ్యాపీగా ఉండచ్చు.. చక్కటి శరీరాకృతీ సొంతమవుతుంది. అయితే ఇందుకోసం ఏదో వర్కవుట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అనుకోకుండా.. మీరు చేసే వ్యాయామాలను పూర్తిగా ఆస్వాదించాలి.. అందుకోసం మీకు నచ్చిన, మీరు సులభంగా చేస్తాం అనుకున్న ఎక్సర్‌సైజ్‌ని ఎంచుకుంటే సరి!

వార్డ్రోబ్ మార్చేయండి!
‘మొన్నటిదాకా పట్టిన టీషర్ట్ ఇప్పుడు పట్టట్లేదంటే అంత లావయ్యానన్నమాట! అందుకే ఈ మధ్య నా ఫ్రెండ్సంతా నన్ను బోండాం అని పిలుస్తున్నారు.. ఈ లావేమో గానీ నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది..’ బాడీ షేమింగ్‌కి గురైన వారికి ఇలాంటి ప్రతికూల ఆలోచనలే నెమ్మదిగా వారి మదిలో బయల్దేరతాయి. ఇక పదే పదే అవే ఆలోచనలు మనసును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టుతాయి. అందుకే ఆ దుస్తులు పట్టట్లేదు.. అనుకునే బదులు ‘నా శరీరాకృతికి తగ్గట్లుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ఎంచుకుంటే సరిపోతుంది కదా’ అన్న ఆలోచనలు మనసులోకి రావాలంటున్నారు నిపుణులు. ఇక చాలామంది ‘నా తొడలు చాలా లావున్నాయి.. ఇలాంటప్పుడు జీన్స్ వేసుకుంటే బాగోదేమో!’ అనుకుంటూ ఉంటారు. కానీ అలా రాజీపడే బదులు నడుం సైజు మార్చితే సరిపోతుంది. తద్వారా ఇటు మీకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు.. అటు హ్యాపీగా ఉండచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో మీ శరీరాకృతికి తగ్గ దుస్తుల్ని, సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా కనిపించే అవుట్‌ఫిట్స్‌ని ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.

పోలికలొద్దు!
ఒకరకంగా పోలికలు మనలో ఉన్న అభద్రతా భావాన్ని బహిర్గతం చేస్తాయంటారు నిపుణులు. ఈ క్రమంలో చాలామంది ‘అబ్బ.. ఆ అమ్మాయి ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉంది.. మరి, నేను తనకు పూర్తి అపోజిట్ కలర్లో ఉన్నా.. కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్!’ అని బాధపడిపోతూ ఉంటారు. నిజానికి చర్మ ఛాయ కాదు ముఖ్యం.. ముఖవళికలు ఎంత కళగా ఉన్నాయనేదే ప్రధానం! మీరు గమనించారో లేదు.. ఛాయ నలుపు ఉన్న వాళ్లలో చాలామంది ముఖం కళగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. అంతేకాదు.. తెల్లగా ఉన్న వాళ్ల చర్మం త్వరగా ముడతలు పడుతుందని, తద్వారా చిన్న వయసులోనే వయసు పైబడిన ఛాయలు కనిపిస్తాయంటుంటారు కొంతమంది. మరి, ఈ లెక్కన చూస్తే కాస్త రంగు తక్కువగా ఉండడమే మంచిది కదా! అందుకే ఛాయ నలుపున్నాం కదా అని బాధపడిపోకుండా ముఖం కళగా ఉందా, లేదా అన్నదే పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇదీ ఓ రకంగా తమ శరీరాన్ని తాము ప్రేమించుకోవడమే అవుతుందట!

మీకోసం మీరు కాక ఇంకెవరు?!
చాలామంది మహిళలు ఇంట్లో ఉన్న వారందరి గురించి పట్టించుకుంటూ, వారి పనులన్నీ చేసిపెడుతుంటారు కానీ వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోరు. ఇలా తమ గురించి తాము సమయం కేటాయించుకోకపోవడం వల్ల కొన్నాళ్లకు ‘నా గురించి నేను పట్టించుకునే సమయమే దొరకట్లేదు.. ఛీ.. నా జీవితం ఎప్పుడూ ఇంతే..!’ అన్న ప్రతికూలతల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఎంత బిజీగా ఉన్నా కాసేపు మీతో మీరు సమయం గడిపేలా ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో రిలాక్సవడానికి స్పాలకు వెళ్లడం, మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లోనే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను పాటించడం, నచ్చిన పనులు చేసుకోవడం, మనసుకు నచ్చిన వారితో సమయం గడపడం.. వంటివి ఇందులో కొన్ని! ఇలాంటి పనుల వల్ల మీపై మీకు ప్రేమ క్రమంగా పెరుగుతుంది.. మనసుకూ ఆహ్లాదకరంగా ఉంటుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి!

‘సోషల్’కు దూరమవడమెందుకు?
బాడీ షేమింగ్ అంటే అన్నింటికంటే ముందుగా గుర్తొచ్చేది సోషల్ మీడియానే! ఎందుకంటే ఆ వేదికగానే చాలామంది తమ శరీరాకృతి గురించి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఫొటోలు పోస్ట్ చేయడం, అవి నచ్చని వారు ఏవేవో కామెంట్లు పెట్టడం.. ఇలా బాడీ షేమింగ్ బాధితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో దానికి పూర్తిగా దూరమయ్యే వారూ లేకపోలేదు. అయితే ఎవరో ఏదో అన్నారని మనమెందుకు మన ఇష్టాన్ని, మనం చేసే పనిని వదులుకోవాలి? మన శరీరాన్ని నిందించుకోవాలి? నిజానికి ఎవరో ఏదో అన్నారని మన సోషల్ మీడియా అకౌంట్లను మనమే తొలగించుకుంటే.. ఒక రకంగా వాళ్లు అన్న మాటల్ని మనం అంగీకరించినట్లే లెక్క! అందుకే అలాంటి వారి మాటల్ని పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగమంటున్నారు నిపుణులు. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. తమకెదురైన బాడీ షేమింగ్ అనుభవాలను పంచుకుంటూ ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోమని తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతుంటారు.
బాడీ షేమింగ్ నుంచి బయటపడి మనల్ని మనం ప్రేమించుకుంటూ పాజిటివిటీ వైపు అడుగులేయాంటే ఏం చేయాలో తెలుసుకున్నారుగా..! మరి, ఇదంతా చదువుతుంటే మీరు ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అనుభవాలు, వాటి నుంచి బయటపడే క్రమంలో మీరు పాటించిన చిట్కాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆలస్యం ఎందుకు.. వాటిని కింది కామెంట్ బాక్స్ ద్వారా పంచుకుంటే ఎంతోమందిని సెల్ఫ్ లవ్ దిశగా నడిపించిన వారవుతారు.