చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. ట్వంటీ-20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా ఎంతో వేగంగా, ఉత్కంఠగా సాగింది. కంటికి కనిపించని శత్రువులా కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. యావత్ ప్రపంచానికే సంక్షోభంగా మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఇలా మనల్ని ఆనందానికి, ఆహ్లాదానికి దూరం చేసిన 2020 లాగా కాకుండా 2021 హ్యాపీగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని కొత్త సంవత్సరంలో పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. అలాగని ఇవేవీ శ్రమతో, ఖర్చుతో కూడుకున్నవి కావు. మనం మనసు పెట్టి చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. మరి అవేంటో చూద్దామా?

* మీరు ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఏం చేస్తారు? మొబైల్లో కానీ గడియారంలో కానీ అలారం పెట్టుకుంటారా? అయితే కొత్త సంవత్సరం నుంచి అలారం లేకుండా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. వినడానికి ఇది మీకు కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ ఒకసారి దీనిని పాటించి చూడండి. రోజూ ఒకే టైంలో నిద్ర పోవడం, నిద్ర లేవడం మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఈ అలవాటు మనపై మనకు నమ్మకాన్ని పెంచడంతో పాటు మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.
* రోజులో రాత్రి, పగలు అనేవి ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలనేవి కూడా అంతే కామన్. వైఫల్యాల గురించి అతిగా ఆలోచించకుండా ప్రతిరోజును సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. రోజంతా ఆనందంగా, హ్యాపీగా ఉండాలని మీకు మీరే మనసులో కోరుకోండి.

* ప్రస్తుతమున్న పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. ఇందుకోసం ఉదయం నిద్ర లేవగానే ఓ 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. డ్యాన్సింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్... ఇలా మీకిష్టమైన వర్కవుట్‌ను సాధన చేయండి. ఇవి కష్టమనిపిస్తే ఇయర్ ఫోన్స్‌లో మీకిష్టమైన మ్యూజిక్ వింటూ అలా ఓ ఖాళీ స్థలంలో కానీ, పార్క్‌లో కానీ నడవడం అలవాటు చేసుకోండి.
* ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. జిమ్‌కెళ్లి వ్యాయామాలు చేసే సమయం కూడా దొరకడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాల్సిందే. రోజూ ఇంట్లో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మన మెదడులో ‘గామా అమినో బ్యుటిరిక్ యాసిడ్’ అనే యాంటీ-యాంక్సైటీ రసాయనం విడుదలవుతుందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలను దూరం చేస్తుందట.

* ఆఫీసుకు లేటవుతుందన్న కారణంతో గానీ, మరే కారణంతో గానీ మనలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. ఆకలి వేస్తున్నప్పటికీ టీ, కాఫీలతోనే సరిపెడుతుంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తుంటే కొత్త సంవత్సరంలో సాధ్యమైనంత త్వరగా ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజును సానుకూలంగా ప్రారంభించాలంటే మీకిష్టమైన, ఆరోగ్యకరమైన పదార్థాలతో ఆల్పాహారం చేయండి. ఇది మీకు రోజంతా ఉత్సాహంగా పని చేయడానికి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది.
* ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలోకి దూరిపోతుంటారు. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఓ మంచి పుస్తకం చదవండి. బుక్ రీడింగ్ మిమ్మల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అంతేకాదు.. ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

* ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ అన్ని పనులు ఒకేసారి పూర్తి చేయాలని ప్రయత్నించకండి. దీని వల్ల పని ఒత్తిడి పెరుగుతుందే తప్ప పనులు పూర్తి కావు. కాబట్టి ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఒక నిర్ణీత గడువు విధించుకుని ఆ పనులు పూర్తి చేయండి. దీని ద్వారా పని ఒత్తిడి లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
* కొంతమందికి మధ్యాహ్న సమయంలో నిద్రపోయే అలవాటు ఉంటుంది. కాస్త సమయం దొరికితే చాలు నిద్రలోకి జారుకుంటుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనంటున్నాయి అధ్యయనాలు. మధ్యాహ్న సమయంలో కాసేపు పడుకుని లేవడం వల్ల శరీరానికి అలసట తీరుతుంది. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది రాత్రి నిద్రపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* కరోనా కారణంగా 2020లో స్నేహితులు, సన్నిహితులను ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్నేహితులు, సన్నిహితులను కలిసేందుకు ప్రణాళికలు రచించుకోండి. ఇష్టమైన చోటుకు వెళ్లి వారితో సరదాగా గడపండి. ఇక కలుసుకోలేనంత దూరంలో ఉన్న స్నేహితులతో ఫోన్లో మాట్లాడండి. వాట్సప్, వీడియో కాల్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వారితో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నించండి.
* మీకు స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, దుస్తులపై ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటుందా? అయితే కొత్త సంవత్సరంలో ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. ఇలా అనవరసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఈ సొమ్ముతో మీ స్నేహితులకు సరదాగా ఓ ట్రీట్ ఇవ్వండి. లేకపోతే అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు ఆ డబ్బును విరాళంగా ఇవ్వండి. ఓ మంచి పని చేశామన్న సంతృప్తి కలుగుతుంది.
* ‘జంతర్ మంతర్ చూ మంతర్ కాలీ... అందర్ దర్ద్ దెబ్బకు ఖాళీ’ అని ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో చిరంజీవి చెప్పినట్లు ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటే... దెబ్బకు వాళ్ల బాధంతా పరార్!! ప్రేమతో ఇచ్చే ఆత్మీయ ఆలింగనానికి మనుషులను మరింత దగ్గర చేసే లక్షణంతో పాటు ఒత్తిడిని దూరం చేసే శక్తి ఉంది. మరి మెగాస్టార్ చెప్పినట్లు మన స్నేహితులు, సన్నిహితులెవరైనా తీవ్ర సమస్యల్లో ఉంటే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోండి. వారి గుండెలోని బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని ద్వారా ఎదుటివారికి భరోసానిచ్చినట్లు అవుతుంది.
* ఇక ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆ విషయాన్ని ఇంటి దాకా తీసుకెళ్లద్దు. ఆఫీసు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయించండి. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో అందరితో కలిసి సరదాగా డిన్నర్ చేయండి. ఇది మీతో పాటు మీ కుటుంబానికి ఎంతో మంచి అనుభూతినిస్తుంది.
* మీకు బాగా ఆనందాన్ని అందించిన క్షణాలు, జ్ఞాపకాలను ఓ పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోండి. జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో అది మీకు ఎంతగానో సహకరిస్తుంది.

* రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవడం అలవాటు చేసుకోండి. లేకపోతే మెదడు సరిగ్గా పని చేయదు. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.
* ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఓ గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది. అదేవిధంగా రోజులో క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండండి. శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోతే అలసట, మానసిక ఆందోళన, తలనొప్పి లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
* వృత్తిగతంగా మన నైపుణ్యాలను పెంచుకోవడానికి, మరింత సృజనాత్మకంగా ఆలోచించడానికి 2020 మనకెన్నో అవకాశాలను ఇచ్చింది. అది కూడా కాలు బయటపెట్టకుండానే.. పెద్దగా ఖర్చు చేయకుండానే! మీ అభిరుచులకు తగ్గట్టుగా వివిధ ఆన్లైన్ కోర్సులను నేర్చుకోండి. మీ కెరీర్‌ను మరింత ఉన్నతంగా మలుచుకోండి.
* వారాంతాల్లో కానీ, ఖాళీ సమయం దొరికినప్పుడు కానీ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లండి. వారికి తోచినంత సహాయం చేసి కాసేపు వారితో సరదాగా గడపండి. కుదిరితే ఓ అనాథ బాలిక లేదా బాలుడి చదువుకయ్యే ఖర్చును భరించండి.

* ప్రస్తుతం చాలామంది ఇంటి మిద్దెల పైనే వివిధ రకాల పంటలు, కూరగాయలు పండిస్తున్నారు. మట్టిలో ఉండే మైక్రో బ్యాక్టీరియం మనిషి మెదడులోని సెరటోనిన్ ఉత్పత్తిని బాగా ప్రభావితం చేస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. తద్వారా మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుందని వారు సూచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ చేతులను మురికి చేసుకోండి. కుదిరితే ఓ మొక్క నాటి దాన్ని పెంచండి.
* పని ఒత్తిడి, ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు డ్యాన్సింగ్, పెయింటింగ్ లాంటి కళలను మీ జీవితంలో భాగం చేసుకోండి. వివిధ భాషలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించండి.
మరి పైన చెప్పిన సూచనలు, సలహాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. 2020లో కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని 2021లో సొంతం చేసుకోండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!