రాకేశ్, రాధిక ఒకే కంపెనీలో పని చేస్తున్నారు.. వీరిద్దరిలో రాధిక పనితనమే బాగున్నప్పటికీ మహిళ అన్న నెపంతో ఈ కరోనా కాలంలో ఆమె ఉద్యోగం పైనే వేటు పడింది..!
ఈ ఏడాది వినీత్ ఉద్యోగం పోయింది. అందుకు కారణం తన భార్య విద్య కాకపోయినా రోజూ ఆమె మీదే చిర్రుబుర్రులాడేవాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు స్టార్ట్!
నిజానికి శ్రీజ-శ్రీకాంత్ మరో రెండేళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నారు. కానీ ఈ కరోనా కాలంలో శ్రీజ అవాంఛిత గర్భం దాల్చింది. అబార్షన్ కోసం బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో అసురక్షిత గర్భస్రావం కారణంగా లేనిపోని అనారోగ్యాల బారిన పడిందామె.
ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థికం, అనుబంధాలు.. ఇలా ఎటు చూసినా ఈ కరోనా నామ సంవత్సరం మహిళలపై, వారి ఉనికిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. మరి, ఇవే ప్రతికూలతల్ని ఇకపైనా కొనసాగిస్తే మానసిక ఆందోళనలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే నెగెటివిటీని ఇక్కడే వదిలేసి పాజిటివిటీతో కొత్త ఏడాదిలోకి పరుగులు పెట్టమంటున్నారు ఆయా రంగాలకు చెందిన నిపుణులు. ఈ ఏడాది ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. వాటిని కొత్త ఏడాదిలో జీవిత సోపానాలుగా మార్చుకుంటే అతివే అందరికీ మార్గదర్శిగా మారుతుందంటున్నారు. మరి, కొత్త ఏడాదికి కొత్త ఉత్సాహంతో, పాజిటివిటీతో వెల్కమ్ చెప్పాలంటే ఏం చేయాలో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం రండి..
సవాళ్లను అవకాశంగా మలచుకోవాలి!

ఏడాది కాలంగా కొనసాగుతోన్న కరోనా ప్రభావం ఉద్యోగ రంగంపై తీవ్రంగానే పడింది. ఈ క్రమంలో ఇటు ఆఫీసుల్లో, అటు ఇంటి నుంచి పనిచేసే క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పచ్చు. ఉద్యోగాలు కోల్పోవడం దగ్గర్నుంచి వారి పనికి తగిన ప్రాధాన్యం లభించకపోవడం దాకా.. ఇలా ప్రతి విషయంలో వారు వివక్షనే ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు మహిళలు ఎక్కువ రిస్క్ చేయలేరన్న చాలామంది ఆలోచనలు వారికి పలు అవకాశాల్ని సైతం దూరం చేశాయి. అయితే ఈ సమస్య ఇప్పటిది కాకపోయినా.. కరోనా కారణంగా ఈ గ్యాప్ మరింతగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. దీంతో ‘మనం చేసే పనిని కంపెనీ సమర్థంగా ఉపయోగించుకోవట్లేదు.. మనకే ఎందుకిలా జరుగుతోంది’ అన్న నెగెటివిటీ కూడా ఉద్యోగినుల్లో పెరిగిపోయింది.
ఇలాంటప్పుడే కుంగిపోకుండా మనలో ఉన్న పాజిటివిటీని తట్టి లేపాలి. ఎదురయ్యే ప్రతి సవాలునూ ఒక అవకాశంగా మార్చుకోవాలి. చేసే పనిలో ఇంకా ఎలాంటి నైపుణ్యాల్ని సంపాదిస్తే మెరుగ్గా రాణించగలననే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.
ప్రస్తుత పరిస్థితులు కొవిడ్‌కి ముందు, తర్వాత అన్నంతలా మారిపోయాయి. టెక్నాలజీ విషయంలో అప్డేటెడ్గా ఉంటేనే మనం చేసే ఉద్యోగంలో రాణించగలిగే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయం కేటాయించి మీ ఉద్యోగానికి తగ్గట్లుగా ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉండే కోర్సుల్ని నేర్చుకోండి. అలాగే నెట్‌వర్కింగ్‌ని పెంచుకోవడం కూడా చాలా అవసరం. అంటే.. మన కంపెనీలో ఉన్న వారితో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం, ఇది వరకు మనం ఉద్యోగం చేసిన కంపెనీ ఉద్యోగులతో టచ్‌లో ఉండడం, మన సంస్థను వదిలేసి బయటికి వెళ్లిన వారితో స్నేహం కొనసాగించడం.. వంటివి చేయడం తప్పనిసరి. నిజానికి ఈ విషయాల్లో ఆడవాళ్లు చాలా వెనకబడి ఉంటారు. కానీ అటు నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూ, ఇటు సరైన నెట్‌వర్కింగ్‌ని కొనసాగించగలిగితే వచ్చే ఏడాదంతా అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా కూడా రాణించచ్చు.. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
లోపాలు వెతకడం కాదు.. ఆలోచనల్ని గౌరవించుకోవాలి!

జీవితంలో ఎప్పుడు ఏ నిమిషంలో ఎలాంటి మార్పులొస్తాయనేది మనకు తెలియదు. మనం ఎంత కంట్రోల్లో ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులు మన చేయి దాటి పోయే అవకాశం ఉంది. అయితే ఇలా పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా చేతలు మాత్రం మన అధీనంలోనే ఉంటాయి కదా..! అయితే ఈ అవగాహన లేకపోవడం వల్లే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో సంబంధబాంధవ్యాల్లో కలతలు రేగాయి.
ఇక ఈ కరోనా కాలంలో ఇటు ఇంటి పని, అటు ఆఫీస్ పని (వర్క్ ఫ్రమ్ హోమ్/వర్క్ ఎట్ ఆఫీస్)కి తోడు అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల మహిళలపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ఎవరి నుంచీ సహాయం అందక, బయటి నుంచి సహాయం పొందడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక వారిలో అసహనం పెరిగిపోతోంది.. ఓపిక నశించిపోతోంది.. దీంతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ చదువు చదువు అంటూ పేరెంట్స్ తమ వెంట పడుతున్నారని పిల్లలు, మేం మా భార్యలకు అన్ని పనుల్లో సహాయపడుతున్నామని పురుషులు.. ఇలా ఎవరి ధోరణిలో వాళ్లుండిపోవడం, ఈ క్రమంలో అభిప్రాయభేదాలు తలెత్తడం వల్ల సంబంధాల మధ్య గొడవలకు దారితీస్తోంది.
ఇక ఈ గొడవలకు కారణమయ్యే మరో విషయం ఏంటంటే.. ఒకప్పుడు సమయం లేక తాము అనుకున్నది చేయలేకపోయిన వారు.. ఇప్పుడు చేతి నిండా సమయం ఉండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మిగతా వాళ్ల పనుల్లో, మాటల్లో, ప్రవర్తనలో లోపాలు వెతకడం.. చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం, కోపాలు, పట్టింపులు, పట్టుదలలు.. వంటివి ఎక్కువయ్యేసరికి మనసుల మధ్య, మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి.
అలాగని ఈ సమస్యను ఇలాగే వదిలేయకుండా దాన్ని పరిష్కరించుకునే మార్గం అన్వేషించాలి. ఇందుకోసం మనకోసం మనం కాస్త సమయం కేటాయించుకోవాలి. ఈ క్రమంలో మనకు మనమే సరికొత్తగా ఆలోచిస్తూ, పనుల్లో సృజనాత్మకత చూపుతూ ఆనందాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒకరి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటూ అవతలి వాళ్ల కోణంలో నుంచి చూడగలిగినప్పుడు, అవతలి వాళ్లు కూడా ఎదుటివారి సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ కోపతాపాలు, గొడవలకు తావే ఉండదు.
సంతాన సమస్యలు సవాలు విసరకుండా..!

అవాంఛిత గర్భధారణలు, వాటిని తొలగించుకునే పరిస్థితులు లేక అసురక్షిత గర్భస్రావాలు, మానసిక ఒత్తిడి-ఆందోళనల వల్ల తలెత్తిన పీసీఓఎస్-ఇర్రెగ్యులర్ పిరియడ్స్-ఇతర సంతానలేమి సమస్యలు, గర్భిణుల్లో తమకెక్కడ వైరస్ సోకుతుందోనన్న భయం, గర్భం ధరించిన తొలి నాళ్లలో వైరస్ ప్రభావం.. వెరసి స్త్రీ సంతానోత్పత్తిపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంపై ఈ ఏడాదంతా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పాలి. దీంతో చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం, ఇతర ప్రత్యుత్పత్తి సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణులను సంప్రదించడం.. వంటి విషయాలను కూడా వాయిదా వేస్తున్నారు.
అయితే ఇలాంటి నిర్ణయాలు కొంతమందిలో వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తిని తగ్గించడంతో పాటు, ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశాలూ లేకపోలేదు. అందుకే కొత్త ఏడాదిలో సంతానలేమి, ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలంతా ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో ఎలాంటి సమస్య ఎదురైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులను సంప్రదించాలి. అలాగే గర్భం ధరించాలా, వద్దా అనేది ముందే ప్లాన్ చేసుకుంటే అవాంఛిత గర్భం రాకుండా, తద్వారా అసురక్షిత గర్భస్రావాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఇక పిల్లలు వద్దనుకునే వారు ముందుగానే డాక్టర్ని సంప్రదించి సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులు పాటించచ్చు.
ఇక ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు, కంప్యూటర్-మొబైల్స్‌తో గడుపుతూ ఎక్కువ సమయం కూర్చొనే ఉండడం వల్ల టీనేజ్ అమ్మాయిల్లో అధిక బరువు సమస్యలు తలెత్తుతున్నాయి. దీని ప్రభావం శారీరకంగానే కాదు.. మానసికంగానూ వారిపై పడుతోంది. ఫలితంగా పీసీఓఎస్, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు ఊడిపోవడం.. వంటివి ఎదురవుతున్నాయి. ఇక వీటి నుంచి బయటపడాలంటే అమ్మాయిల విషయంలో తల్లులు ప్రత్యేక చొరవ చూపాలి. వారితో వ్యాయామం చేయించడం.. బరువు పెరగకుండా, వారి ఎదుగుదల దెబ్బతినకుండా ఉండేలా చక్కటి ఆహారం అందించడం.. అందులో ముఖ్యమైనవి.
ఆన్లైన్ వారికి వరం!
- డా|| పద్మజ, సైకాలజిస్ట్

ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుబంధాల్లో.. చిచ్చు పెట్టిన కరోనా మహమ్మారి పిల్లల బంగారు భవిష్యత్తు పైనా ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి తోడు టీచర్ల సృజనాత్మక బోధనా పద్ధతుల వల్ల వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగేలా చేస్తున్నాయి. అయితే ఈ ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో తమనెవరూ గమనించట్లేదని చదువు విషయంలో అలసత్వం ప్రదర్శించే చిన్నారులూ లేకపోలేదు. ఇదిలాగే కొనసాగితే కొత్త ఏడాదిలోనూ వారు చదువు విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి వారు తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. పై తరగతుల్లో సమర్థంగా నెగ్గుకు రావాలంటే, బంగారు భవిష్యత్తుకు బాటలు పరచుకోవాలంటే ఇప్పటి నుంచే పునాది బలంగా ఉండాలన్న విషయం తల్లులు పిల్లలకు అర్థం చేయించాలి. తరగతి గదిలో పిల్లలు ఎలా చదువుకుంటారో అలా చదువుకునేందుకు తల్లిదండ్రులు దోహదం చేయాలి. ఆన్లైన్ క్లాసులు బోధించే క్రమంలో టీచర్లు ఎలాగైతే కొత్త కొత్త బోధనా పద్ధతులు పాటిస్తున్నారో.. పిల్లలూ తమను తాము కొత్తగా ప్రజెంట్ చేసుకునేలా పేరెంట్స్ వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. అంటే నేర్చుకున్న విషయాన్ని ప్రాజెక్ట్స్, బొమ్మలు, ప్రయోగం, అప్లికేషన్.. ఇలా తమలోని సృజనకు అనుగుణంగా వ్యక్తపరిచేలా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
ఇక మరో విషయం ఏంటంటే.. విజ్ఞానాన్ని పంచుకోవడం. అంతర్జాలం ఉపయోగించడం నేటి తరం పిల్లలకు అలవాటైంది. వాటి సహాయంతో గత సంవత్సరానికి సంబంధించిన ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ చేసుకోవడం - వాటిని సాల్వ్ చేయడం, టీచర్లతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవడం, ఫలానా సబ్జెక్ట్ గురించి సీనియర్స్‌తో చర్చించడం - వారి సలహాలు తీసుకోవడం, ఆన్లైన్లోనే విద్యార్థులు ఒక చిన్న గ్రూప్‌లాగా ఏర్పడి పాఠాల గురించి చర్చించుకోవడం.. నేర్చుకున్న పాఠాల నుంచి ఎవరికి వారు ప్రశ్నలు వేసుకోవడం - సమాధానం రాసుకోవడం.. ఇలాంటివన్నీ పిల్లలు చేయడం, తల్లిదండ్రులూ ఇందుకు సహాయపడడం వల్ల వారిలో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.
అత్యవసర నిధి ఎందుకో తెలిసిందిగా..!

కరోనా ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ అందరినీ కుంగదీసింది. అదే సమయంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవాలని, ఉన్నంతలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలని, ప్రకృతి మనకు అందించిన ఔషధాలతోనే తక్కువ ఖర్చుతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని.. ఇలా ఎటు నుంచి చూసినా ఒక రకంగా మనకు మంచే జరిగిందని చెప్పచ్చు. ఆపదలో ఆదుకోవడానికి వీలుగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు.. కానీ ఆచరించరు. అయితే అకస్మాత్తుగా ఎదురయ్యే కరోనా వంటి సంక్షోభ సమయాల్లో ఒకట్రెండు నెలలు ఆదాయం లేకపోయినా అత్యవసర నిధి ఉంటే నెట్టుకు రాగలమన్న అసలు నిజాన్ని అందరికీ తెలియజేసిందీ ప్రతికూల కాలం. జీవిత బీమా ప్రాముఖ్యంపై అవగాహన పెంచింది. నిజానికి ఇప్పుడు ప్రతికూలతలు అనుకుంటోన్న ఇవే మనకు భవిష్యత్తులో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి పాఠాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తే వచ్చే ఏడాదే కాదు.. భవిష్యత్ రోజులని కూడా ఎలాంటి లోటూ లేకుండా గడిపేయచ్చు.
అలాగే ఒక్కరు సంపాదిస్తే, ఒక్కరు పొదుపు చేస్తే ఇల్లు గడిచే రోజులు పోయాయి. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి.. అవసరమైన ఖర్చులే చేయాలి.. మిగతా సొమ్మును పొదుపు చేసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత సాధించాలి. ప్రతి విషయంలో పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ ముందుకు సాగడం అనేది మన కుటుంబ వ్యవస్థలోనే ఉంది. అంటే ఇబ్బందులతో సహజీవనం చేయడం, ప్రతికూలతల్ని ఎదుర్కోవడం.. వంటివి మనకు ముందు నుంచే అలవాటు.. కాబట్టి మాకు కష్టమొచ్చిందని నిరాశ పడకుండా ఈ విషయాన్ని పునశ్చరణ చేసుకోండి.. తద్వారా సానుకూల దృక్పథం నింపుకోండి.. ఆర్థికంగా పైచేయి సాధించండి!
అవసరానికి మించి తెలుసుకోవద్దు!
- డా|| పద్మజ, సైకాలజిస్ట్

వైరస్, దాని విస్తృతి గురించిన భయం చాలామందిలో చాలా కాలంగా ఉంది. అయితే రాన్రానూ దీని గురించిన విషయ అవగాహన కూడా పెరుగుతోంది. దాంతో పాటు అపోహలు కూడా పెరుగుతున్నాయి. తద్వారా ఒత్తిళ్లు, ఆందోళనలు.. వంటి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. మరి, ఇలాంటి నెగెటివిటీ నుంచి బయటపడి సానుకూల దృక్పథం వైపు అడుగులేయాలంటే కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
* కరోనాకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎక్కడో ఒక దగ్గర వైరలవడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక ఇలాంటివి సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువవుతున్నాయి. అయితే అది తెలిసీ తెలియగానే భయపడిపోవడం కాకుండా.. అసలు అందులో ఎంత వరకు నిజముందన్నది ముందుగా తెలుసుకోవాలి. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని, నిపుణుల అభిప్రాయాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
* యాంగ్జైటీ వల్ల కరోనాకు సంబంధించిన వార్తల్ని అతిగా ఫాలో అవడం, దాని గురించే పదే పదే నెట్లో వెతకడం.. వంటి వాటి వల్ల భయం పెరిగిపోతోంది. ఈ భయమే మిగతా వాళ్లకూ వైరస్‌లా పాకుతోంది. కాబట్టి పదే పదే దాని గురించే ఆలోచించడం, వెతకడం కాకుండా ఎంత వరకు అవసరమో అంతే తెలుసుకోవడం మంచిది.
* ఇక ఆందోళనల నుంచి బయటపడడానికి సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి.
* ఏ విషయంలోనైనా పాజిటివ్, నెగెటివ్.. రెండు కోణాలూ ఉంటాయి. కానీ మనం కేవలం నెగెటివ్ మాత్రమే చూడగలిగితే పాజిటివ్ మనకు కనిపించదు. అదే ప్రతి విషయంలో సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటే ప్రతికూలతలు కూడా మనకు పెద్ద సవాలుగా మారవు.
హ్యాపీ న్యూ ఇయర్ !