ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

భార్య కోసం చంద్రుడిపై స్థలం!
‘చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి... అక్కడొక నీకొక ఇల్లు కడతా’... అంటూ హీరో ప్రశాంత్ ‘జీన్స్’ సినిమాలో ఐశ్వర్యారాయ్ వెంట పడతాడు. ఇలా నెచ్చెలి కోసం ప్రియులు పడే ఆరాటం, వాగ్దానాలు రీల్ లైఫ్‌లోనే కాదు.. అప్పుడప్పుడు రియల్ లైఫ్‌లోనూ వింటుంటాం. చాలామంది భూమి పైనే సొంత స్థలం కొనలేక అష్టకష్టాలు పడుతుంటే రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా మాత్రం చంద్రుడి మీద ఏకంగా మూడెకరాలు కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు. తమ పెళ్లి రోజును పురస్కరించుకుని చంద్రమండలం లోని ఆ స్థలం తాలూకు రిజిస్ట్రేషన్ కాగితాలు బహుమానంగా ఇవ్వగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయిందా భార్యామణి!

రాజస్థాన్ నుంచి మొదటి వ్యక్తి!
ధర్మేంద్రకు తన భార్య సప్నా అనిజా అంటే చెప్పలేనంత ప్రేమ. ఈ క్రమంలో తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ధర్మేంద్ర. ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్త బహుమతి ఇద్దామనుకున్న అతడు ఏకంగా చంద్రుడి పైనే స్థలం కొనేశాడు. ఇందుకోసం చంద్రుడిపై స్థలం రిజిస్టర్ చేసే ‘ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ’ని ముందుగానే సంప్రదించి అక్కడ మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కాగితాలు పెళ్లి రోజు నాటికి అందుకుని వాటిని తన భార్యకు కానుకగా అందించాడు.

‘నా ఎనిమిదవ పెళ్లి రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్నాను. కార్లు, బంగారు ఆభరణాలు కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్‌ను నా భార్యకు అందించాలనుకున్నాను. అలా సప్న కోసం చంద్రమండలంపై మూడెకరాల స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చాను. రాజస్థాన్ నుంచి చంద్రుడి మీద భూమి కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర.
చందమామ పైనే ఉన్నట్లు ఉంది!
ఇన తన కోసం చంద్రుడిపై మూడెకరాల స్థలాన్ని కొన్న విషయం తెలుసుకుని మొదట ఆశ్చర్యానికి లోనైంది సప్న. ఆ తర్వాత తేరుకుని తనపై భర్తకున్న ప్రేమకు సంతోషంతో పొంగిపోయింది. ‘మా పెళ్లి రోజున చందమామ థీమ్ సెట్టింగ్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు మా ఆయన. అనంతరం చంద్రుని పైన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను ఓ ఫ్రేముగా కట్టి నాకు కానుకగా ఇచ్చాడు. ఈ ప్రపంచానికి అవతల ఉన్న ఈ అందమైన బహుమతి అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ పేపర్లను చూస్తుంటే నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది. నేనెప్పుడూ కలలో కూడా ఊహించని అందమైన బహుమతి ఇది’ అని హర్షం వ్యక్తం చేసింది సప్న.

చంద్రుడి మీద స్థలం కొనడం సాధ్యమేనా?
ఇలా చంద్రుడి మీద భూములు కొన్నామనే వార్తలు రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనూ బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్, దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ చంద్రుడి మీద స్థలాలు కొన్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత వీరి స్ఫూర్తితో పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అహ్మద్-మేదిహ దంపతులు, బిహార్‌కు చెందిన నీరజ్ కుమార్ తదితరులు చంద్రమండలం మీద భూములు కొన్నారు. అయితే వాస్తవంగా చంద్రుడి మీద స్థలం కొనడం సాధ్యమేనా? అంటే కాదనే చెబుతున్నారు నిపుణులు.
ఆశలన్నీ జాబిల్లి పైనే!
‘విశ్వంలో భూగ్రహం మాదిరిగా మానవుల నివాసానికి అనుకూలమైన గ్రహాలేమైనా ఉన్నాయా?’ అని గత కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాస్త్రవేత్తల ఆశలన్నీ జాబిల్లి మీదనే ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్‌లో చంద్రమండలం మీద నివాసం ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక సాధ్యమయితే చంద్రుడి మీద వలసవాద పోటీ తత్వాన్ని కట్టడి చేయడానికి అగ్ర దేశాలైన రష్యా, అమెరికా, బ్రిటన్ 1967లో ఓ అంతర్జాతీయ ఒప్పందంతో ముందుకు వచ్చాయి. అదే ఔటర్ స్పేస్ ట్రీటీ. ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తూ భారత్‌తో సహా 109 దేశాలు సంతకం చేశాయి.

ఈ ఒప్పందం ఏం చెబుతోందంటే!
చంద్రుడు, ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువుల మీద విచ్చలవిడి అన్వేషణలు, వాటి వల్ల సంభవించే నష్టాన్ని అరికట్టడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఇక ఒప్పందంలోని రెండో ఆర్టికల్ ప్రకారం చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువులతో సహా అంతరిక్షంలోని స్థలం... ఏ దేశ స్వాధీనానికి లోబడి ఉండదు. అంటే ఎవరూ కూడా దీనిని తమ సొంతం అని ప్రకటించుకోలేరని అర్థం. అంతే కాదు.. అంతరిక్షంలో ఎక్కడైనా జరిపే అన్వేషణలు, ఉపయోగాలు, ఫలితాలు అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తాయని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.
ఆ మొత్తాన్ని అలా వినియోగిస్తారు!
ఇదిలా ఉంటే లూనార్ రిజిస్ట్రీ అనే ఓ సంస్థ మాత్రం చంద్రుడి మీద స్థలాలను విక్రయిస్తామని చెబుతోంది. ‘బే ఆఫ్ రెయిన్బోస్’, ‘సీ ఆఫ్ రెయిన్స్’ ‘లేక్ ఆఫ్ డ్రీమ్స్’, ‘సీ ఆఫ్ సెరెనిటీ’... తదితర పేర్లతో చంద్రుడి మీద భూములను అమ్ముతోంది. ఇలా ఎవరైనా లూనార్ రిజిస్ట్రీ ద్వారా చంద్రుడి మీద స్థలం కొన్నామని చెబితే వారు లూనార్ సెటిల్మెంట్ ఇనీషియేటివ్‌కు అనుగుణంగా క్లెయిమ్ చేస్తున్నారని అర్థం.
దీని ప్రకారం ‘చంద్రమండలంలో భూమి కొన్నాను’ అంటే ఆ మొత్తాన్ని ‘చంద్రుడు, దాని మీద వనరుల అన్వేషణ, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించినట్లు’. లూనార్ సెటిల్మెంట్ ఇనీషియేటివ్ ప్రకారం చంద్రుడి మీద ఎకరా స్థలం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 95 శాతం ఎస్ర్కో ఖాతాలో జమ అవుతుంది. ఇది స్వతంత్రంగా ఎన్నికైన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చేతుల్లో ఉంటుంది. అంటే మొత్తమ్మీద ఈ విక్రయాల ద్వారా లభించే మొత్తం లూనా సొసైటీ ఇంటర్నేషనల్, దాని భాగస్వామ్య, అనుబంధ సంస్థల ద్వారా చంద్రుని మీద అన్వేషణ, అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. అంతేతప్ప, అందరూ అనుకున్నట్లుగా అక్కడ వ్యక్తుల పేరు మీద ఎలాంటి భూముల రిజిస్ట్రేషన్ జరగదు.