పెళ్లి ఫిక్సయిందంటే అమ్మాయిల కలలు కోటలు దాటుతాయి. అందరి కంటే అందంగా మెరిసిపోవాలి.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలి.. సరికొత్త బ్రైడల్ ఫ్యాషన్స్ ఫాలో అవ్వాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటుంది నవ వధువు. ఇలాంటి అపురూప లావణ్యాన్ని, నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి ముందు నుంచే చక్కటి ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలనుకుంటారు కాబోయే పెళ్లికూతుళ్లు. అయితే అలాంటి వారందరికీ దీపిక పాటించిన ఈ ప్రి-వెడ్డింగ్ డైట్ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా. ఆరోగ్యం, ఫిట్నెస్, అందం.. ఈ మూడింటినీ బ్యాలన్స్ చేసేలా తాను రూపొందించిన హెల్దీ ప్రి-వెడ్డింగ్ డైట్ ప్లాన్‌తో అప్పుడు దీపిక వెలిగిపోతే.. ఇప్పుడు అదే డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతూ నవ వధువులందరూ మెరిసిపోవచ్చంటున్నారామె. అందుకే ఆ విశేషాలను ఇటీవలే పంచుకున్నారు శ్వేత.
రెండేళ్ల క్రితం ఇటలీ సాక్షిగా తన ఇష్టసఖుడు రణ్వీర్ సింగ్‌తో ఏడడుగులు నడిచింది అందాల తార దీపికా పదుకొణె. పెళ్లిలో తన బ్రైడల్ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ చక్కనమ్మ అపురూప లావణ్యానికి, నాజూకైన శరీరాకృతికి కారణమేంటా అని చాలామంది అమ్మాయిలు అంతర్జాలాన్ని గాలించే ఉంటారు. దానికి ఇటీవలే సమాధానం దొరికినట్లయింది. దీప్స్ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఈ ముద్దుగుమ్మ బ్రైడల్ బ్యూటీకి, చక్కటి శరీరాకృతికి కారణమైన ఆ ప్రి-వెడ్డింగ్ డైట్ మెనూను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సోంపుతో రోజు మొదలయ్యేది!
కొత్త పెళ్లి కూతురు అంటే కేవలం అందంగా ఉంటే సరిపోదు.. ఆరోగ్యంగా, అంతకుమించిన చక్కటి శరీర సౌష్టవాన్ని కలిగి ఉండాలంటారు న్యూట్రిషనిస్ట్ శ్వేత. అప్పుడే పెళ్లిలో వధువు సౌందర్యం మరింతగా ఇనుమడిస్తుందంటున్నారామె. దీపిక కూడా ఇదే చేసిందని, తన పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే చక్కటి డైట్ మెనూను పాటించిందంటూ ఆమె ప్రి-వెడ్డింగ్ డైట్ ప్లాన్‌ను రివీల్ చేశారీ న్యూట్రిషనిస్ట్.
‘దీపిక పెళ్లికి కొన్ని రోజుల ముందు నన్ను కలిసింది. తనని చూడగానే తనది పిత్త స్వభావం గల శరీరం (ఆమ్ల, వేడి శరీర తత్త్వం) అని నాకు అర్థమైంది. ఇక తన బిజీ కెరీర్లో భాగంగా విపరీతమైన ప్రయాణాలు, వేళకు భోజనం చేయకపోవడం, షూటింగ్స్‌లో భాగంగా అధిక సమయం బయటే గడపడంతోనే సరిపోతుంది. ఇలాంటి హెవీ షెడ్యూల్స్ శరీరాకృతి, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఆమె ప్రాధాన్యతలు, షెడ్యూల్స్‌ని దృష్టిలో ఉంచుకొని.. ప్రత్యేకమైన మీల్ ప్లాన్‌ను రూపొందించా. ఇక ఈ క్రమంలో తన వేడి శరీరాన్ని కంట్రోల్ చేయడం మాకు పెద్ద సవాలుగానే మారింది. ఇందుకోసం రాత్రంతా నీటిలో నానబెట్టిన టేబుల్‌స్పూన్ సోంపును రోజూ పరగడుపునే తీసుకునేది దీపిక. ఇక శరీరానికి చలువనిచ్చే ఓట్స్-గ్రీన్ డీటాక్స్ స్మూతీస్‌ని రోజంతా నిర్ణీత వ్యవధుల్లో సిప్ చేస్తుండేది.
బ్రేక్‌ఫాస్ట్ ఇదే!
అల్పాహారం విషయానికొస్తే.. దీపికకు కొబ్బరి, నట్స్, రైస్, కాయధాన్యాలు.. వంటి పదార్థాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో పొంగల్, ఉప్మా, సెరల్స్‌తో చేసిన బ్రేక్‌ఫాస్ట్ (పారిడ్జ్), ఉడికించిన కాయధాన్యాలు-పుదీనా-కొత్తిమీర-సోంపు-క్యాబేజీ, చిరుధాన్యాలు.. వీటన్నింటితో పాటు గ్రీన్ సలాడ్.. వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేది. నిజానికి దీపికలా పిత్త శరీరతత్వం గల వారు అల్పాహారం మానడం, కడుపు మాడ్చుకోవడం అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వారిలో కోపం, అసూయా ద్వేషాలు పెరిగిపోతాయి.
ఆ రుచులంటే చెవి కోసుకుంటుంది!
*ఇక అల్పాహారం, భోజనానికి మధ్యలో (మిడ్ మార్నింగ్ స్నాక్) ఏదైనా ఒక పండు, వెజిటబుల్ జ్యూస్ తీసుకునేది.
*దీపికకు ఇటాలియన్, మెక్సికన్ వంటకాలంటే మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో ఆమె కోసం క్వినోవా-రైస్ కలగలిపి పలు హెల్దీ రెసిపీలను తయారుచేసి వారానికి రెండు లేదా మూడుసార్లు చొప్పున ఆమెకు అందించేవాళ్లం.
*లంచ్‌లో భాగంగా రోటీ, బౌల్ ఉడికించిన కాయగూరలు తీసుకునేది.
*బీట్రూట్ టిక్కీ, జుచినీ (కీరాదోసను పోలి ఉండే కాయగూర) కెబాబ్, హెర్బ్డ్ మూలికలతో కూడిన) హమ్మస్, బూడిద గుమ్మడి కాయ రసం, చట్నీ.. వంటి వాటిని స్నాక్స్, రాత్రి భోజనంలో భాగంగా తీసుకునేది.
ఇలా చక్కటి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతో నవ వధువుగా మెరిసిపోయింది దీపిక. కాబట్టి అందానికైనా, ఆరోగ్యానికైనా, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికైనా.. ఇలా ఏదైనా మనం తీసుకునే హెల్దీ డైట్ వల్లే సాధ్యమవుతుంది.. అంతేకానీ.. తక్షణ ఉపశమనం కలిగించే మందుల వల్ల కాదు!’ అంటూ చెప్పుకొచ్చారు శ్వేత.
చూశారుగా.. దీపిక బ్రైడల్ బ్యూటీ, అందమైన శరీర సౌష్టవం వెనకున్న ఆ ప్రి-వెడ్డింగ్ డైట్ సీక్రెట్స్ ఏంటో? మరి, మీరూ మీ పెళ్లిలో లవ్లీ బ్రైడ్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే మీ శరీర తత్వాన్ని బట్టి ఈ హెల్దీ మెనూను మీరూ ఫాలో అవ్వచ్చు.. లేదంటే ఈ విషయంలో మీకు తెలిసిన న్యూట్రిషనిస్ట్ ని సంప్రదించి మీ శరీర తత్వానికి అనుగుణంగా ఉండే డైట్ ప్లాన్ ని ఫాలో కావచ్చు.. అయితే ఆలస్యమెందుకు.. ప్రొసీడ్!