Photo: Instagram
సాధారణంగా తమకు నచ్చిన వారి గురించి కానీ, వార్తల్లోని వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవడానికి అందరూ మొదట గూగుల్‌నే ఆశ్రయిస్తారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... ఎలాంటి సమాచారం పొందాలనుకున్నా ఈ సెర్చింజన్లోనే శోధిస్తారు. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాను ‘గూగుల్ ఇండియా’ విడుదల చేసింది. ‘మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీస్’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో టాప్-10లో ఐదుగురు మహిళా సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? నెటిజన్లు ఎందుకు వారి గురించే ఎక్కువగా వెతికారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కనికా కపూర్
బాలీవుడ్లో స్టార్ సింగర్‌గా గుర్తింపు పొందిన కనికా కపూర్ కరోనా కారణంగా ఈ ఏడాది అందరి నోళ్లలో నానింది. ఏప్రిల్‌లో లండన్‌కు వెళ్లొచ్చిన ఆమె వరసగా పార్టీలకు హాజరవ్వడం, ఆ తర్వాత కొవిడ్‌కు గురవ్వడం, కరోనా నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై పోలీసు కేసు నమోదు కావడం... తదితర సంఘటనలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. బాలీవుడ్లో కరోనా బారిన పడిన తొలి సెలబ్రిటీగా నిలిచిన ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక దశలో విషమించిందంటూ వార్తలొచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా కోలుకుంది. దీంతో గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాలో టాప్-10లో మూడో స్థానంలో... మహిళల్లో అగ్రస్థానంలో నిలిచింది.
రియా చక్రవర్తి
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ సుశాంత్ ఆత్మహత్య కారణంగా ఈ ఏడాదంతా వార్తల్లో నిలిచింది. గతంలో అతనితో రిలేషన్షిప్లో ఉండడం, అతనికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబయిలోని బైకుల్లా జైలులో నెల రోజులున్న ఆమె అక్టోబర్ 7న బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ కారణాలతో ఆమె గురించి వెతికేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తద్వారా గూగుల్ ‘మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీస్’ జాబితాలో టాప్-10లో ఏడో స్థానంలో నిలవగా, మహిళల విభాగంలో రెండో స్థానం సొంతం చేసుకుంది.
కమలా హ్యారిస్
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తోన్న కమలా హ్యారిస్...ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా ఎన్నెన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె సందర్భం వచ్చినప్పుడల్లా తన భారతీయ మూలాలను నెమరు వేసుకుంటూ మురిసిపోతుంటారు. ఈ క్రమంలో గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాలో టాప్-10లో 8వ స్థానంలో నిలవగా, మహిళల విభాగంలో మూడో స్థానంలో నిలిచారు.
అంకితా లోఖండే
‘పవిత్ర రిష్తా’ సీరియల్‌తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది అంకితా లోఖండే. బాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఒకరైన ఆమె ‘మణి కర్ణిక’, ‘బాఘీ 3’ వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఈమె కూడా అందరి నోళ్లలో నానింది. ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో అంకితతో పాటు సుశాంత్ కూడా నటించాడు. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత విడిపోయారని వార్తలు రావడమే ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. సుశాంత్ బలవన్మరణం తర్వాత ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ పేరుతో సోషల్ మీడియలో కొన్ని పోస్టులు కూడా షేర్ చేసిన ఆమె గూగుల్ ‘మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీస్’ లిస్టులో టాప్-10లో 9 వ స్థానం, మహిళల విభాగంలో 4 వ స్థానం దక్కించుకుంది.
కంగనా రనౌత్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే అన్ని విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది కంగనా రనౌత్. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొందరు పెద్దలే కారణమన్న ఆమె మాటలు బంధుప్రీతిపై పెద్ద ఎత్తున చర్చను లేవదీశాయి. ఇక ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడం, మహారాష్ట్ర ప్రభుత్వంతో వాదోపవాదాలు ‘క్వీన్’ను వార్తల్లో నిలిచేలా చేశాయి. కొద్ది రోజుల క్రితం బాంద్రాలోని ఆమె కార్యాలయాన్ని బీఎంసీ (ముంబయి మున్సిపాలిటీ) అధికారులు కూలగొట్టారు. అయితే కంగనపై కక్షతోనే తన ఆఫీసును కూల్చేశారని ముంబయి హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇలా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఈ ఫైర్‌బ్రాండ్ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలవగా, మహిళల విభాగంలో 5వ స్థానం సొంతం చేసుకుంది.
వీరితో పాటు టీవీ నటి దిశా పర్మార్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్, పాయల్ ఘోష్, సంజనా సంఘి, మేఘనా రాజ్ తదితరుల గురించి ఎక్కువగా శోధించారని గూగుల్ ఇండియా తెలిపింది.