Photo: Instagram
కొత్తగా పెళ్లైన జంటలు ఏకాంతంగా గడపడానికే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో వారికి నచ్చిన హనీమూన్ స్పాట్స్‌కి చెక్కేస్తుంటారు. ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎనలేని మధుర జ్ఞాపకాలను మూటగట్టుకొని మరీ తిరిగొస్తారు. కానీ కర్ణాటకకు చెందిన ఓ కొత్త జంట మాత్రం తమ ఆనందం కంటే పర్యావరణ పరిరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. అందులోనే సంతోషం, సంతృప్తి ఉన్నాయంటోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ సంరక్షణ, నలుగురి మేలు కోరి ఈ క్యూట్ కపుల్ చేసిన మంచి పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి, ‘గ్రేట్ జాబ్’ అంటూ వేనోళ్లా ప్రశంసలందుకుంటున్న ఆ జంట ఎవరు? ఇంతకీ వారేం చేశారు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
కొత్తగా పెళ్లైన జంటలు అలా ఏదైనా పార్క్కో లేదంటే దగ్గర్లోని బీచ్‌కో వెళ్లడం పరిపాటే! ఈ క్రమంలో వెళ్లిన చోట పరిశుభ్రత లేకపోయినా, చెత్తా-చెదారం పేరుకుపోయినా మనమైతే ఏం చేస్తాం.. ఇలా చూసి అలా వదిలేస్తాం..! కానీ కర్ణాటకలోని బెయిందుర్కు చెందిన అనుదీప్ హెగ్డే - మినూషా కంచన్ అనే యువ జంట ఇందుకు భిన్నం. ఇటీవలే వివాహంతో ఒక్కటైన ఈ క్యూట్ కపుల్.. అలా ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఓ రోజు అక్కడికి దగ్గర్లోని సోమేశ్వర బీచ్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లీ వెళ్లగానే బీచ్ తీరంలోని ఇసుకలో చెత్తా-చెదారం, వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు, పాత చెప్పులు, మందు బాటిళ్లు.. ఇవే వారికి దర్శనమిచ్చాయి. దీంతో పర్యావరణానికి, జలచరాలకు ఎంతటి నష్టం జరుగుతుందోనని ఒక్కసారిగా ఈ జంట మనసు చలించిపోయింది.
తను వెంటనే ‘యస్’ చెప్పేసింది!
ఏకాంతంగా నాలుగు మాటలు మాట్లాడుకుందామని వెళ్లిన ఈ కొత్త జంట.. బీచ్‌లో పేరుకున్న చెత్తను చూడగానే అసలు విషయం మర్చిపోయారు. దీన్నిలాగే వదిలేస్తే అందరికీ నష్టమే అని ఆలోచించిన అనుదీప్.. బీచ్‌ని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన భార్య మినూషతో పంచుకోగా ఆమె కూడా అందుకు వెంటనే ఓకే చెప్పింది. నిజానికి ఈ సమయంలో హనీమూన్‌కి వెళ్లాల్సిన ఈ కొత్త జంట.. ఆ టూర్‌ని మానుకొని మరీ బీచ్‌ని శుభ్రం చేయడానికి సిద్ధపడింది. ఇలా సుమారు పది రోజుల పాటు శ్రమించి బీచ్‌లో పేరుకున్న 600 కిలోలకు పైగా చెత్తా-చెదారాన్ని శుభ్రం చేశారు. ఇలా వీళ్లు చేస్తోన్న మంచి పని ఆ బీచ్‌కి వచ్చే వారికీ నచ్చడంతో వాళ్లూ తమ వంతు బాధ్యతగా తలా ఓ చేయి వేశారు. దీంతో మొత్తానికి దాదాపు 80 శాతం దాకా ఆ బీచ్ పరిశుభ్రంగా మారిపోయింది. ఇక మరికొన్ని రోజుల్లోనే మిగతా పని పూర్తిచేస్తామంటున్నారీ క్యూట్ కపుల్.
ఆ రిస్క్‌లో పడకుండా..!
అసలే బయట కరోనా పొంచి ఉంది.. ఇలాంటి సమయంలో చెత్తా చెదారం శుభ్రం చేయడమంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే..! అయితే అందుకోసం తగిన జాగ్రత్తలు సైతం తీసుకున్నారు అనుదీప్-మినూష జంట. ఈ క్రమంలో చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి మరీ బీచ్ క్లీనింగ్‌లో పాల్గొన్నారు. ఇక పోగేసిన చెత్తా చెదారం వేయడానికి గార్బేజ్ బ్యాగ్స్‌ని కూడా సిద్ధం చేసుకున్నారీ కపుల్. ఈ క్రమంలో పొడి చెత్తను అక్కడే తగలబెట్టగా, తడి చెత్తను, ఇతర అనవసర వస్తువుల్ని గార్బేజ్ బ్యాగ్స్‌లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. ఇలా పర్యావరణ పరిరక్షణ, సముద్ర జలాల సంరక్షణ, జలచరాల్ని కాపాడే గొప్ప బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారీ కర్ణాటక కపుల్.
ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది!
పర్యావరణాన్ని కాపాడడం మనందరి కనీస బాధ్యత. ఈ క్రమంలో మా వంతుగా ఈ బీచ్‌ని శుభ్రపరచడంలో భాగమయ్యాం. ఇలా నలుగురి కోసం చేసే పనిలో ఎంతో ఆనందం, సంతృప్తి దాగున్నాయి అంటోందీ యువ జంట. ‘ఒక రోజు మా హనీమూన్ టూర్ గురించి మాట్లాడుకోవడానికి సోమేశ్వర బీచ్‌కి వెళ్లాం. లక్షద్వీప్ లేదా హిమాచల్ ప్రదేశ్.. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనుకున్నాం. తీరా బీచ్‌కి వెళ్లేసరికి అక్కడంతా చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపించింది. దీంతో హనీమూన్‌కి వెళ్లాలనుకున్న మా నిర్ణయాన్ని వాయిదా వేసుకొని బీచ్ శుభ్రం చేయాలనుకున్నాం. మొదట మా ఇద్దరితో మొదలైన ఈ మంచి పని.. అక్కడికొచ్చే చాలామందిలో స్ఫూర్తి నింపింది. దీంతో రోజులు గడిచేకొద్దీ మాతో చేయి కలిపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలా సుమారు పది రోజుల్లోనే 80 శాతం దాకా బీచ్‌ని శుభ్రం చేయగలిగాం. మిగతా పని కూడా త్వరలోనే పూర్తి చేసి ఆపై హనీమూన్ టూర్ గురించి ఆలోచిస్తాం.. ఇలా నలుగురి కోసం మేం చేస్తోన్న ఈ పని మాకెంతో సంతృప్తినిస్తోంది..’ అంటున్నారీ లవ్లీ కపుల్.
పర్యావరణ పరిరక్షణ, నలుగురి క్షేమాన్ని కాంక్షించి ఈ కొత్త జంట చేస్తోన్న పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘మీరిద్దరూ చాలా గొప్ప పని చేస్తున్నారు.. గాడ్ బ్లెస్ యూ!’ అంటూ వీరిని ఆశీర్వదిస్తున్నారు కూడా!
గ్రేట్ జాబ్ కపుల్.. హ్యాట్సాఫ్!!