Photo: Instagram
కనికరం లేని కరోనా ఇప్పట్లో ప్రపంచాన్ని వీడేలా కనిపించడం లేదు. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ లేకుండా అందరినీ కబళిస్తోందీ మహమ్మారి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా దివంగత నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘన, ఆమె తల్లిదండ్రులతో పాటు తన నెలల కుమారుడికి కూడా కొవిడ్ సోకింది. వీరితో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సైతం ఈ వైరస్ బాధితుల జాబితాలో చేరిపోయింది.
ప్రముఖ యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటికే మూడు నెలల గర్భవతి అయిన చిరు భార్య మేఘనతో పాటు అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే తన భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో శాశ్వతంగా నిలిచి ఉంటారంటూ భర్త కటౌట్ పక్కన పెట్టుకుని సీమంతం చేసుకుందీ అందాల తార. అక్టోబర్ 22 న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన ఆమె.. తన భర్త జ్ఞాపకార్థం ఆ చిన్నారికి ‘జూనియర్ సి (చిరు)’ అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. ప్రస్తుతం తన కుమారుడే సర్వస్వంగా భావిస్తోన్న మేఘన త్వరలోనే ఆ చిన్నారికి వేడుకగా బారసాల చేసి నామకరణం చేయాలనుకుంది. ఇంతలోనే తల్లీకొడుకులిద్దరూ కరోనా బారిన పడ్డారు. వారితో పాటు మేఘన తల్లిదండ్రులు ప్రమీల, సుందర్రాజ్కు కూడా ఈ వైరస్ సోకింది.
‘జూనియర్ సి’ బాగానే ఉన్నాడు!
ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ఇన్స్టాగ్రామ్ నోట్ ద్వారా స్వయంగా ప్రకటించింది మేఘన. ‘హలో.. నాకు, మా అబ్బాయికి, మా పేరెంట్స్ కి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల మమ్మల్ని కలిసిన వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. చిరు, నా అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రస్తుతం మేమందరం బాగానే ఉన్నాం. చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ సి (చిరు) బాగానే ఉన్నాడు. నేనెప్పుడూ తనతోనే ఉంటున్నాను. ఓ కుటుంబంగా ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తాం. విజయం సాధిస్తాం’ అని రాసుకొచ్చింది మేఘన. ఈ నేపథ్యంలో కరోనా నుంచి మేఘన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆమె సహ నటీనటులు, అభిమానులు, చిరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారికి కొవిడ్‌తో పోరాడే శక్తినివ్వాలంటూ ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
కృతి సనన్ కి కూడా!
బాలీవుడ్లో కరోనా బాధితుల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యారాయ్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, తమన్నా, జెనీలియా, నీతూ కపూర్, సన్నీ డియోల్, వరుణ్‌ధావన్.. తదితరులకు ఈ వైరస్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా కొవిడ్ బారిన పడింది. గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల చండీగఢ్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన కృతి వారం క్రితం ముంబయి చేరుకుంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
కరోనా ఇంకా మన మధ్యనే ఉంది!
ప్రస్తుతం ముంబయిలోని తన స్వగృహంలో స్వీయ నిర్బంధం పాటిస్తూ చికిత్స తీసుకుంటోంది కృతి. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ నోట్‌ను షేర్ చేసింది. ‘ఇటీవల చేయించుకున్న కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. బీఎంసీ (ముంబయి మున్సిపల్ కార్పొరేషన్), వైద్యుల సలహాలు పాటిస్తూ నా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. కాబట్టి నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందద్దు. ఈ కరోనాను తొక్కేసి త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్‌కు హాజరవుతాను. అప్పటివరకు మీరు పంపించిన సందేశాలను చదువుతూ కాలం గడుపుతాను. ఈ మహమ్మారి ఇంకా మన మధ్యనే ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె సోదరి నుపుర్ సనన్, సోఫీ చౌదరి, ఏక్తా కపూర్, ప్రీతిజింటా, భూమి పెడ్నేకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆయుష్మాన్ ఖురానా, బాబీ డియోల్ తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కృతి ‘మిమి’ అనే చిత్రంలో నటిస్తోంది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అక్షయ్‌కుమార్ సరసన ‘బచ్చన్ పాండే’ సినిమాలోనూ నటిస్తోంది.