చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలనే సందేశాన్నిచ్చే పండగే దీపావళి. దీపాల వరుసలు, మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. అమావాస్యకే అరుదైన అందాన్ని తీసుకొస్తాయి. చిన్నాపెద్దా అంతా ఒకచోట చేరి దీపాల వెలుగుల మధ్య బాణసంచా కాలుస్తూ.. ఉత్సాహంగా ఈ పండగ జరుపుకొంటారు. ఆత్మీయులకు బహుమతులు అందిస్తూ.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలా మనదేశంలో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో కూడా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. మరి, వెలుగుల పండగ దీపావళిని ఏయే దేశాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందామా..

మన దేశంలో మాదిరిగానే..
మనదేశంలో పాటించే మత సంప్రదాయాలే కాస్త ఇంచుమించుగా శ్రీలంకలోనూ దర్శనమిస్తాయి. ఇక్కడి మాదిరిగానే అక్కడ కూడా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. రామాయణ కాలం నాటి ఎన్నో చిహ్నాలు సైతం శ్రీలంకలో మనం చూడచ్చు. ఇక్కడ దీపావళి ఎంతో ముఖ్యమైన పండగ. ఈ పర్వదినాన మనదేశంలో మాదిరిగానే శ్రీలంకలో సైతం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. నూనెతో దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. అలాగే పంచదారతో బొమ్మల రూపంలో స్వీట్స్ తయారుచేస్తారు. వీటిని మిసిరి అని పిలుస్తారు. ఇలా తయారుచేసిన తీపి పదార్థాలను ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే అందరూ కలసి సామూహిక భోజనాలు చేయడం ఇక్కడి సంప్రదాయం.
