Photos: Screengrab
శునకాలను విశ్వాసానికి మారుపేరంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా... కొట్టినా అవి చూపించే ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకుని మరీ ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటారు. ఒక్క క్షణం అవి కనిపించకపోయినా, వాటికేమైనా ప్రమాదం జరిగినా విలవిల్లాడిపోయే పెట్ లవర్స్ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తన శునకాన్ని తెచ్చుకునేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. ఇంతకీ ఎవరా మహిళ? తను చేసిన సాహసమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
‘కింగ్’ కనిపించకుండా పోయాడు!
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉంటున్న డెబీ వాజ్క్వెజ్, ఆమె కూతురు డానేలకు కుక్కలంటే చాలా ఇష్టం. వారు ఎన్నో ఏళ్ల నుంచి మూడు పెంపుడు కుక్కలను ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్నారు. అయితే 2014 జూన్‌లో యార్డ్ నుంచి ఆ మూడు పెట్‌డాగ్స్‌ను బయటకు వదిలారు. మళ్లీ వెనక్కు పిలిచినప్పుడు రెండు కుక్కలు మాత్రమే తిరిగివచ్చాయి. 8 ఏళ్ల వయసున్న చివావా మిక్స్ కింగ్ అనే పేరున్న పెట్ డాగ్ మాత్రం తిరిగా రాలేదు. దీంతో కంగారుపడ్డ ఆ తల్లీకూతుళ్లు వెంటనే ఆ ప్రాంతమంతా గాలించారు. పక్క వీధులతో పాటు రోడ్లన్నీ వెతికారు. అయినా కింగ్ దొరకలేదు. మరుసటి రోజు ఆ పెట్ డాగ్ ఫొటోలు, వివరాలతో కరపత్రాలను ముద్రించి అందరికీ పంపిణీ చేశారు.

ఆరేళ్ల తర్వాత!
రోజులు వారాలయ్యాయి... వారాలు నెలలయ్యాయి... నెలలు సంవత్సరాలయ్యాయి. అయినా ఆ పెట్‌డాగ్ కనిపించలేదు. దీంతో ఆ తల్లీకూతుళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మెల్లిమెల్లిగా ఆ పెంపుడు కుక్కపై ఆశలు వదులుకున్నారు. ఆ పెట్‌డాగ్ ధరించిన దుస్తులు, ఆడుకున్న బొమ్మల్లోనే తనను చూసుకుంటూ ఆరేళ్లు కాలం గడిపారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 25న ఫోర్ట్ లాడర్డేల్లోని బ్రోవార్డ్ కౌంటీ హ్యూమన్ సొసైటీ నుంచి వాజ్క్వెజ్కు ఒక వాయిస్ మెయిల్ వచ్చింది. తప్పిపోయిన కింగ్ దొరికాడు అని ఆ మెసేజ్ సారాంశం. అయితే ఆరోజు తన పుట్టిన రోజు కావడంతో ఎవరో తనను ఆటపట్టించేందుకు ఈ మెసేజ్ చేశారని మొదట భావించింది. ఆ తర్వాత అనుమానమొచ్చి ఆ నంబర్‌కు తిరిగి కాల్ చేసింది. స్కాన్ చేసిన మైక్రోచిప్ ఆధారంగా కింగ్‌ను గుర్తించామని హ్యూమన్ సొసైటీ ప్రతినిధులు చెప్పడంతో తను విన్నది నిజమేనని నిర్ధారించుకుంది. వెంటనే దుస్తులు, అవసరమైన వస్తువులు సర్దుకుని తన కూతురు డానేతో కలిసి కారులో బయలుదేరింది డెబీ. అలా సుమారు 22 గంటల పాటు 2200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫ్లోరిడాకు చేరుకున్నారు. మధ్యలో అక్కడక్కడా విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం సాగించి ఎట్టకేలకు హ్యూమన్ సొసైటీకి చేరుకున్నారు. ప్రాణంతో సమానంగా పెంచుకున్న తమ పెట్‌డాగ్ ఆరేళ్ల తర్వాత అక్కడ కనిపించడంతో ఆ తల్లీకూతుళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అలా మా దగ్గరకు!
ఈ సందర్భంగా ఆ పెట్‌డాగ్ ఎలా తమ దగ్గరకు వచ్చిందో సొసైటీ సభ్యులు వారిద్దరికీ వివరించారు. ‘ఫోర్ట్ లాడర్డేల్కు చెందిన ఓ మహిళ ఈ పెట్‌డాగ్‌ను మా దగ్గరకు తీసుకొచ్చింది. మంచాలు తయారుచేసుకునే మరొక వ్యక్తి నుంచి ఆమె ఈ కుక్కను తీసుకుంది. తీవ్ర అనారోగ్యం పాలైన అతడు ఆ కుక్కను పోషించలేనని ఆ మహిళకు ఇచ్చాడట. దీంతో ఆమె ఆరునెలల పాటు ఈ పెట్‌డాగ్‌ను పోషించింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ కుక్కను మాకు అప్పగించింది. మైక్రోచిప్‌ను స్కాన్ చేసి...అది తప్పిపోయిన కింగ్ అని నిర్ధారించుకున్నాం. ఆ తర్వాతే మీకు సమాచారం అందించాం’ అని వారు చెప్పుకొచ్చారు.

‘కింగ్ ఈజ్ బ్యాక్’!
ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆ తల్లీకూతుళ్లు కింగ్‌ను చేతుల్లోకి తీసుకుని ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. ‘కొద్ది రోజుల క్రితం మా పెంపుడు కుక్క ఒకటి చనిపోయింది. దీంతో మేం తీవ్రంగా బాధపడ్డాం. అలాంటి సమయంలో హ్యూమన్ సొసైటీ మాకో శుభవార్త వినిపించింది. అందుకే ఫోన్ వచ్చిన వెంటనే ఇక్కడకు బయలుదేరాం. ఆరేళ్ల క్రితం తప్పిపోయినప్పుడు మా కింగ్ వయసు 8 ఏళ్లు. తనను మళ్లీ చూస్తామనుకోలేదు. మా అదృష్టం కొద్దీ మళ్లీ కింగ్ మా దగ్గరకు వచ్చాడు. అక్కడ చుట్టూ కెమెరాలు, మా ముఖాలకు మాస్కులు ఉండడంతో మొదట మమ్మల్ని గుర్తుపట్టలేదు. కానీ అక్కడి నుంచి బయటికొచ్చిన తర్వాత మాతో పాటు మా రాకీ (మరో పెట్‌డాగ్) ని బాగానే గుర్తుపట్టాడు. అయితే అక్కడి నుంచి మేం తిరిగి ఇంటికి రావడానికి సుమారు 30 గంటలు పట్టింది. తుపాను ప్రభావం కారణంగా మా ప్రయాణానికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే మా కింగ్ దొరికాడన్న సంతోషంలో ఆ సమస్యలన్నింటినీ మరిచిపోయాం. అదేవిధంగా మా యార్డ్‌లోకి ఎవరూ రాకుండా గేట్‌కు తాళం కూడా వేశాం’ అని చెబుతోంది డానే.