Image for Representation
‘ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు... చందమామ లేని ఆకాశం ఒక్కటే’ అని పెద్దలంటుంటారు. అందుకే ఎంతమంది మగ పిల్లలు పుట్టినా, ఆనందాలు కురిపించే ఒక ఆడపిల్లైనా ఇంట్లో ఉండాలని భార్యాభర్తలు కోరుకుంటారు. ఈమేరకు అమెరికాలోని ఓ జంట వరసగా 14 మంది మగ పిల్లల తర్వాత ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తమ కుటుంబంలోకి తమ కలల రాకుమారి అడుగుపెట్టిందంటూ తెగ సంతోషపడిపోతున్నారీ లవ్లీ కపుల్.
15వ కాన్పులో ఆడబిడ్డ!
అమెరికాలోని మిషిగన్‌కి చెందిన క్యాటరీ, జాయ్ దంపతులిద్దరికీ ఆడపిల్లలంటే చాలా ఇష్టం. 1993లో పెళ్లి చేసుకున్న వారికి మొదటిసారి పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో మహాలక్ష్మి కోసం మరోసారి ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అబ్బాయే పుట్టాడు. అలా ప్రయత్నిస్తూ ఇప్పటివరకు వరసగా 14 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో మొదటి బిడ్డను ప్రసవించాక సుమారు రెండున్నర దశాబ్దాలకు కానీ తమ రాకుమారిని చూసే భాగ్యం దక్కలేదీ దంపతులకి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో 15వ సారి గర్భం దాల్చిన క్యాటరీ ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. దీంతో 45 ఏళ్ల ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తమ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన తమ చిట్టి చెల్లిని చూసి 14 మంది సోదరులు కూడా సంబరాల్లో మునిగిపోయారు.
మహాలక్ష్మి కోసం ఎదురుచూస్తూ!
కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే ఒకరికొకరు పరిచయమయ్యారు క్యాటరీ, జాయ్. ఆ తర్వాత ప్రేమికులుగా మారి 1993లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయ్యాక కూడా తమ చదువులు కొనసాగించిన ఈ క్యూట్ కపుల్ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాక డిగ్రీ పట్టాలు అందుకోవడం విశేషం. ఇదే క్రమంలో గ్రాండ్వ్యాలీ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకుంది క్యాటరీ. మిషిగన్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్ర్తంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు ఆమె భర్త జాయ్. మొదటిసారి టేలర్ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ లవ్లీకపుల్ తమకు ఓ ఆడబిడ్డ కూడా పుడితే బాగుంటుందని భావించారు. అయితే వారి కోరిక నెరవేరలేదు. ఆడబిడ్డ కోసం ప్రయత్నిస్తూ మరో 13 మంది మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి గర్భం దాల్చింది క్యాటరీ. ఇటీవల ప్రసవం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ‘మ్యాగీ’ అనే ఓ పండంటి ఆడబిడ్డను ప్రసవించింది.
‘మ్యాగీ’ దేవుడిచ్చిన గొప్ప బహుమతి!
ఈ సందర్భంగా మ్యాగీ రాకతో తమ కుటుంబానికి పరిపూర్ణత వచ్చిందంటున్నారు క్యాటరీ -జాయ్ దంపతులు. ‘ఈ ఏడాది మాకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం మా పెద్ద కుమారుడు టేలర్ (28)కు నిశ్చితార్థం జరిగింది. అయితే ఎన్నో ఏళ్లుగా మేం ఎదురుచూస్తున్న కల కూడా ఈ ఏడాది నెరవేరింది. ‘మ్యాగీ’ రూపంలో దేవుడు మాకో గొప్ప బహుమతి ఇచ్చాడు. తనను కంటికి రెప్పలా చూసుకునేందుకు మాతో పాటు 14 మంది అన్నలు ఉన్నారు’ అంటూ మురిసిపోతున్నారీ లవ్లీ కపుల్.