Image for Representation
సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
యురేకా ఆప్తా, జొవాన్నా వాంగ్.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో నివసిస్తోందీ జంట. యురేకా పైలట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా ప్రస్తుతం ఫిల్మ్ మేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక జొవాన్నా డెంటిస్ట్‌గా పనిచేస్తోంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటోన్న ఈ జంట.. ఇటీవలే పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.
హంగు-ఆర్భాటాలను త్యజించి..!
అయితే పెళ్లంటే బంధువులు, అతిథులు, స్నేహితులు.. ఎంతో హడావిడితో కూడుకున్న వ్యవహారం. కానీ ఇలాంటి హడావిడి, ఆర్భాటాలు ఈ యువ జంటకు నచ్చలేదు. దాని బదులు ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనిలో భాగమైతే బాగుంటుంది కదా అనుకున్నారు. ఈ క్రమంలోనే తమ పెళ్లికయ్యే ఖర్చును మూగ జీవాల కడుపు నింపడానికి ఉపయోగించాలనుకున్నారు. ఇదే ఆలోచనతో తమ పెళ్లికి బంధువులెవరినీ ఆహ్వానించకుండా తమ ఇంటికి దగ్గర్లోని ఓ దేవాలయంలో దండలు మార్చుకొని ఏడడుగులు నడిచిందీ జంట. ఇక అదే రోజున అక్కడి ‘యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఎకమ్రా’ అనే జంతు సంరక్షణ కేంద్రం సహకారంతో సిటీలోని దాదాపు 500 మూగ జీవాలకు ఆహారం అందించారీ కపుల్. అంతేకాదు.. వాటికి మందులు, ఇతర ఖర్చుల కోసం మరికొంత మొత్తాన్ని ఆ సంరక్షణ కేంద్రానికి విరాళంగా కూడా ఇచ్చారు.
ఆ స్ఫూర్తితోనే ఇదంతా చేశాం!
‘మరి, పెళ్లంటే ఎంతో ఆర్భాటంగా ఉండాలనుకుంటారు.. మరి, మీరెందుకు ఇలా సింపుల్‌గా ఒక్కటయ్యారు?’ అని అడిగితే ఇలా సమాధానం చెబుతున్నారీ కొత్త జంట.
‘గతంలో మా ఫ్రెండ్ ఒకరు ప్రమాదానికి గురైన ఓ వీధి కుక్కను కాపాడారు. దాన్ని ఆసుపత్రిలో చేర్చడం దగ్గర్నుంచి తిరిగి జంతు సంరక్షణ కేంద్రానికి పంపే వరకూ తను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఈ క్రమంలో మేమిద్దరం కూడా మాకు తోచిన సహాయం చేశాం. తిరిగి ఆ వీధి కుక్కను జంతు సంరక్షణ కేంద్రంలో వదిలి రావడానికి వెళ్లినప్పుడు ఇలాగే ప్రమాదానికి గురై శారీరక లోపాలతో ఉన్న చాలా శునకాల్ని చూశాం. వాటి కోసం మా వంతుగా ఏదైనా చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాం. ఆ స్ఫూర్తితోనే మా పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకొని, దానికయ్యే ఖర్చును మూగ జీవాల సంరక్షణ కేంద్రానికి అందించాం..’ అంటూ తమ ఆలోచన వెనకున్న అసలు కథను పంచుకున్నారీ క్యూట్ కపుల్.
పెళ్లి రోజు అనే కాదు.. ఈ కరోనా కష్ట సమయంలోనూ స్థానికంగా ఉండే వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా వంట చేసి వాటి కడుపు నింపారీ అందాల జంట. ఇలా ఈ కొత్త జంట చూపిన దాతృత్వానికి, మూగ జీవాల ఆకలి తీర్చడానికి వీళ్లు పడే తపనకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘మీ ఆలోచనకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతూ ఈ యువ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.