వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..
నిజానికి మనకు ఇష్టమైన దాన్ని త్యజించడం అంటే చాలా కష్టమైన విషయం. ఆహారపుటలవాట్ల విషయంలో ఇది మరింత కష్టమని చెప్పుకోవచ్చు. తాను కూడా శాకాహారిగా మారే క్రమంలో తన ఆహారపుటలవాట్లను మార్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేశానంటోంది బాలీవుడ్ బ్యూటీ భూమీ పెడ్నేకర్. ఎట్టకేలకు గత ఆరు నెలలుగా శాకాహారం మాత్రమే తీసుకుంటూ పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయానంటూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టిందీ చక్కనమ్మ. దీంతో ఇప్పటికే శాకాహారులుగా మారిన కొందరు ముద్దుగుమ్మలు ‘వెజిటేరియన్ క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ భూమిని ఆహ్వానిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టం!
బబ్లీ గర్ల్గానే సినిమాల్లోకి ఎంటరైన భూమి.. తన పాత్రలకు అనుగుణంగా బరువు పెరుగుతూ, తగ్గుతూ వృత్తి పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకుంటుంది. ఈ క్రమంలోనే తాను వెజిటేరియన్‌గా మారే క్రమంలోనూ తన ఆహారపుటలవాట్లను మార్చుకోవడానికీ వెనకాడలేదీ బ్యూటీ. ‘చాలా ఏళ్ల నుంచి నేను శాకాహారిగా మారాలనుకుంటున్నా. కానీ మన అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టం. ఒక పర్యావరణ ప్రేమికురాలిగా కొనసాగుతోన్న నేను ఈ క్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా. మూగ జీవాలపై ప్రేమతో ఇక మాంసాహారం తినడం ఎంతమాత్రం మంచిది కాదని నిర్ణయించుకున్నా. గత కొన్ని నెలల నుంచి శాకాహారమే తీసుకుంటున్నా. దీంతో చక్కటి ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని సొంతం చేసుకున్నా. అంతేకాదు.. మూగ జీవాల్ని హింసిస్తున్నాన్న అపరాధ భావం కూడా నాలో కలగట్లేదు..’ అంటోంది భూమి. ఇలా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్టుకు స్పందించిన అనుష్కా శర్మ, శ్రద్ధా కపూర్.. ‘వెజిటేరియన్ క్లబ్‌లోకి భూమికి స్వాగతం’ అంటూ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో కామెంట్లు పెట్టారు.
|
అసాధ్యమనుకున్నా.. కానీ సాధ్యమైంది!
ఆరోగ్యం, ఫిట్నెస్.. వంటి విషయాల్లో ఎంతో శ్రద్ధ వహించే బాలీవుడ్ యమ్మీ మమ్మీ శిల్పా శెట్టి కూడా ఈ మధ్యే శాకాహారిగా మారిపోయింది. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి మరీ తానేంటో మరోసారి నిరూపించుకుందీ ముద్దుగుమ్మ. ఎప్పట్నుంచో వ్యవసాయం చేస్తూ.. తన కుటుంబానికి అవసరమైన కాయగూరల్ని తానే పండిస్తూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతోన్న శిల్ప.. తాను శాకాహారిగా మారి ఆరోగ్యం విషయంలో మరో అడుగు ముందుకేసింది.
‘మంగళూరు వాసిగా మా ఇంట్లోనూ ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు పాటించేవాళ్లం. ముఖ్యంగా రోజూ చేపలు/చికెన్.. వంటివి లేనిదే మా భోజనం పూర్తయ్యేది కాదు. అలా మాంసాహారం తీసుకునే నా అలవాటు కొన్నాళ్లకు వ్యసనంగా మారిపోయింది. కానీ యోగా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే నా జీవన విధానంలో యోగాను భాగం చేసుకున్నప్పటికీ.. ఇంకా ఏదో అసంపూర్ణంగా ఉన్న ఫీలింగ్ నాకు కలిగేది. ఆ భావనకు ముఖ్య కారణమేంటో ఇప్పుడు అర్థం చేసుకున్నా. నా 45 ఏళ్ల జీవితంలో ఆ లోటును ఇప్పుడు పూడ్చుకున్నా.. శాకాహారిగా మారి నా జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నా. అయితే ఒక దశలో ఇది అసాధ్యమనుకున్నాను.. అభద్రతా భావానికి లోనయ్యాను. కానీ నాలో క్రమంగా మార్పొచ్చింది.
శాకాహారం తీసుకోవడం వల్ల మూగ జీవాలను సంరక్షించడమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా జాగ్రత్తపడచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. శాకాహారిగా మారడమంటే ఆరోగ్యం విషయంలో మనం మన జీవన విధానంలో చేసుకునే మంచి మార్పే కాదు.. దీనివల్ల ప్రకృతినీ కాపాడినవారమవుతాం. సంపూర్ణ శాకాహారిగా మారి ప్రకృతి పరిరక్షణకు నాకు చేతనైంది నేను చేశాను. నాకోసం నేనుగా తీసుకున్న నిర్ణయమిది..’ అంటూ శాకాహారిగా మారే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుందీ అందాల అమ్మ.
|
శాకాహారం.. నాకు శక్తినిస్తోంది!
నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసింది అందాల అనుష్కా శర్మ. ప్రస్తుతం గర్భిణి అయిన ఆమె.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, పుట్టబోయే తన పాపాయి కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. 2015 నుంచే శాకాహారిగా కొనసాగుతూ ఆరోగ్యం విషయంలో మరో అడుగు ముందుకేసిన ఈ క్యూటీ.. శాకాహారంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ‘నేను 2015 నుంచే శాకాహారిగా కొనసాగుతున్నా. నేను నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ ఆహారాన్ని అలవాటు చేసుకున్న దగ్గర్నుంచి నా శరీరం మరింత శక్తిమంతంగా తయారైంది.. ప్రతి క్షణం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననిపిస్తోంది. ముఖ్యంగా నా ఆహారం కోసం ఏ మూగ జీవాన్నీ హింసించట్లేదన్న సంతృప్తి కలుగుతోంది..’ అంటూ శాకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ. అంతేకాదు.. విరాట్ కూడా అనుష్కతో పెళ్లి తర్వాత మాంసాహారాన్ని దూరం పెట్టి పూర్తి శాకాహారిగా మారిపోయాడు.
|
వేడి వల్లే దానికి దూరమయ్యా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా గత కొన్నేళ్లుగా శాకాహారానికే పరిమితమైంది. ఆరోగ్యం కోసమే తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నాననంటూ చెబుతోందీ చిన్నది. ‘నేను శాకాహారిగా మారడానికి రెండు కారణాలున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చుకోవడం ఒక కారణమైతే.. మాంసాహారం వల్ల శరీరానికి వేడి చేస్తుందన్నది మరో కారణం. ఏదేమైనా ప్రస్తుతం శాకాహారాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఎప్పటికైనా ఇదే లైఫ్‌స్టైల్‌ని కొనసాగిస్తా..’ అంటోంది అలియా.
|
గట్టిగా అనుకుంటే అది సాధ్యమే!
మనకు నచ్చిన ఒక అలవాటును మార్చుకోవడమంటే అంత సులభమైన విషయం కాదు.. కానీ మార్చుకోవాలన్న గట్టి పట్టుదల ఉంటే అది సాధ్యమేనంటోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా. నటనతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జెన్నీ.. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే తాను మాంసాహారాన్ని మానేద్దామని ఎన్నో ఏళ్లుగా అనుకున్నప్పటికీ.. తన అలవాటును మార్చుకోవడానికి చాలా రోజులే ప్రయత్నించానని చెబుతోందీ అందాల అమ్మ. ఎట్టకేలకు 2017లో తాను పూర్తి శాకాహారిగా మారినట్లు వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చింది.
‘గత కొన్నేళ్ల నుంచి శాకాహారిగా మారాలని నిర్ణయించుకున్నా.. అయితే ఇది మనం అనుకున్నంత సులభమైన విషయం కాదు.. ఒక అలవాటును మార్చుకోవడమంటే ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైంది. కానీ అంకితభావంతో, గట్టి పట్టుదలతో ప్రయత్నించా. శాకాహారిగా మారిపోయా. ఈ క్రమంలో మొక్కల్లో దాగున్న సుగుణాలు, పోషకాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు.. నా ఆహారం కోసం మూగ జీవాల్ని హింసించకూడదన్న భావన నేను శాకాహారం వైపు అడుగులు వేయడానికి మరో కారణమని చెప్పచ్చు..’ అంటూ తన వెజిటేరియనిజం జర్నీని పంచుకుందీ హ..హ..హాసిని.
|
అలా శాకాహారిగా మారిపోవచ్చు!
‘మనం బతుకుదాం.. మూగ జీవాల్ని బతకనిద్దాం!’ అంటోంది బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. 2014 నుంచే శాకాహారాన్ని ఫాలో అవుతోన్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో ఆరోగ్య రహస్యాలు నిండి ఉన్న ఈ ఆహారపుటలవాట్లను అందరూ పాటించాల్సిందిగా తన ఫ్యాన్స్‌ని కోరుతోంది.
‘శాకాహారం గురించి మీ అందరితో ఒక విషయం చెబుదామనుకుంటున్నా. ఈ ఆహారపుటలవాటు వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాదు.. మూగ జీవాల్ని హింసించాల్సిన పని కూడా ఉండదు. అలాగని మీరు శాకాహారులుగా మారాలని ఒత్తిడి చేయడం నా ఉద్దేశం కాదు. ఆహారమనేది సంస్కృతీ సంప్రదాయాలు, ఇష్టాయిష్టాలతో కూడుకున్న వ్యవహారం! నిజంగా శాకాహారులుగా మారాలనుకుంటే నెమ్మదిగా మాంసాహారానికి దూరం కావచ్చు.. ఈ క్రమంలో వారంలో కొన్ని రోజులు పూర్తిగా శాకాహారమే తీసుకోవడానికి ప్రయత్నించండి.. దాన్ని అలాగే కొనసాగిస్తూ రోజుల్ని పెంచుకుంటూ పోతే శాకాహారిగా మారిపోవచ్చు..’ అంటూ శాకాహారులుగా మారాలనుకున్న వారి కోసం కొన్ని చిట్కాల్ని సైతం అందించిందీ బాలీవుడ్ బేబ్.
|
ఆహారం విషయంలో అస్సలు రాజీ పడను!
కేవలం మాంసాహారానికే కాదు.. జంతువుల నుంచి వచ్చే పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉంటూ వీగన్‌గా మారిపోయింది బాలీవుడ్ అందం శ్రద్ధా కపూర్. అలాగని తీసుకునే ఆహారం విషయంలో అస్సలు రాజీ పడనంటోందీ ముద్దుగుమ్మ.
‘నేను గత కొన్నేళ్ల నుంచి వీగన్‌గా మారిపోయా. ఆహారమంటే నాకు చాలా ఇష్టం. ఏ పదార్థాన్నైనా చక్కగా ఆస్వాదిస్తూ లాగించడం నాకు అలవాటు. అలాగని అది తినకూడదు.. ఇది తినకూడదు అన్న నియమమేమీ పెట్టుకోను. ఉదాహరణకు నాకు వడాపావ్ అంటే ఇష్టం.. అది తింటాను.. ఆపై దాని ద్వారా నా శరీరంలో చేరిన క్యాలరీలను కరిగించుకోవడానికి వర్కవుట్ చేస్తా.. లేదంటే ఆ రోజు రాత్రి భోజనంలో కేవలం సూప్ మాత్రమే తీసుకుంటా. ఇలా ఆహారం విషయంలో అస్సలు రాజీ పడను. వీగన్‌గా మారిన తర్వాత నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నానన్న సందేహం చాలామందిలో ఉంది. పాలకు బదులుగా బాదం పాలతో చేసిన టీ తాగుతున్నా. అలాగే ఏవైనా స్వీట్స్లోకైనా బాదం పాలనే ఉపయోగిస్తున్నా. పండ్లు, అన్ని రకాల కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకుంటున్నా..’ అంటూ తన డైట్ సీక్రెట్స్‌ని బయటపెట్టింది శ్రద్ధ.
|
అమ్మ స్ఫూర్తితోనే..!
ముందు శాకాహారిగా, ఆ తర్వాత వీగన్‌గా మారిపోయానంటోంది బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్. ఆరోగ్యం, ఫిట్నెస్ వంటి విషయాల్లో అస్సలు రాజీ పడని ఈ ముద్దుగుమ్మ.. శాకాహారం తనకు పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తోందని చెబుతోంది. ‘నేను చాలా ఏళ్లుగా శాకాహారమే తీసుకుంటున్నా. ఈ మధ్యే వీగన్‌గా మారిపోయా. జీవ కారుణ్యమే నన్ను ఈ ఆహారం అలవాటు చేసుకునేలా చేసిందన్నది నా భావన. ఇక పాలకు బదులుగా సోయా పాలు తీసుకుంటున్నా.. మా అమ్మ ముందు నుంచీ వెజిటేరియనే. ఆమె స్ఫూర్తితో నేనూ శాకాహారిగా మారిపోయా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఫిట్టెస్ట్ బ్యూటీ.
|
వీరితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షీ సిన్హా, యామీ గౌతమ్.. వంటి పలువురు బాలీవుడ్ తారలు సైతం శాకాహారాన్ని తమ ఆహారపుటలవాట్లుగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు. మరి, వీరిలాగే మీరు కూడా ఆరోగ్య స్పృహతో, మూగ జీవాల్ని హింసించకూడదన్న ఉద్దేశంతో శాకాహారులుగా, వీగన్లుగా మారిపోయారా? అయితే మీ శాకాహార ప్రస్థానాన్ని ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి.