మేగన్ మార్కల్... సాధారణ కుటుంబంలో పుట్టి... కష్టపడి నటిగా ఎదిగింది. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడి యువరాణిగా మారింది. స్వతంత్రంగా జీవించేందుకు రాచరికపు హోదాను వదులుకోవడంతో పాటు రాణివాసపు కోటను సైతం విడిచిపెట్టింది. ఇలా అపురూప లావణ్యం, ఆత్మాభిమానం, నిండైన ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే మేగన్ కూడా సోషల్ మీడియా కారణంగా తీవ్ర ఆవేదనకు గురైందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ డచెస్ ఆఫ్ ససెక్స్... సామాజిక మాధ్యమాల కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను పంచుకుంది.
అమెరికాకు చెందిన మేగన్ హాలీవుడ్ నటిగా సెలబ్రిటీ హోదాను అనుభవించింది. 2018లో ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకుని బ్రిటిష్ రాజవంశ కోడలిగా ప్యాలస్ లో అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె గతేడాది మేలో ‘ఆర్చి’ అనే బేబీ ప్రిన్స్‌కు జన్మనిచ్చింది. అయితే తనకున్న ప్రత్యేక గుర్తింపు, అస్తిత్వాన్ని కోల్పోవడం ఏ మాత్రం ఇష్టం లేని మేగన్ ఈ ఏడాది ప్రారంభంలో రాజ ప్రాసాదాన్ని వీడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం భర్త ప్రిన్స్ హ్యారీ, కుమారుడు ఆర్చీతో కలిసి అమెరికాలో నివాస ముంటోన్న ఈ అందాల తార ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ జీవితం గడుపుతోంది. ఇలా నిండైన ఆత్మాభిమానానికి నెలవైన మేగన్ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా కాలిఫోర్నియా విద్యార్థులు నిర్వహించిన ‘టీనేజర్ థెరపీ’ అనే ఓ కార్యక్రమానికి హాజరైంది. భర్త ప్రిన్స్ హ్యారీతో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె పాడ్ కాస్ట్ ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వారితో షేర్ చేసుకుంది.
అప్పుడు ఆర్చీ ఇంకా కడుపులోనే ఉన్నాడు!
‘ప్రస్తుతం కరోనా ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలు, విద్యాలయాలన్నీ మూత పడ్డాయి. దీంతో చాలామంది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పట్టుకుంటూ ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి, ప్రపంచంతో మరింత అనుసంధానం కావడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇదే స్థాయిలో దుర్వినియోగమవుతూ మనుషుల మానసిక అనారోగ్యానికి కూడా కారణమవుతోంది. ఈ విషయానికి సంబంధించి నాకెలాంటి అనుభవాలు ఎదురయ్యాయో మీకు చెబుతాను..
2019లో ప్రపంచం మొత్తం మీద విపరీతంగా ట్రోలింగ్ బారిన పడిన వ్యక్తిని నేనే. అప్పుడు ఆర్చీ ఇంకా నా కడుపులోనే ఉన్నాడు. ఎనిమిది నెలల గర్భంతో ఉండి మెటర్నిటీ సెలవులో ఉన్న నన్ను అకారణంగా విమర్శిస్తూ ఆన్లైన్లో విద్వేషపూరిత కథనాలు ప్రచురితమయ్యాయి. ఇలా ఆన్లైన్లో మన గురించి అసత్యాలు ప్రచారమవుతున్నాయని తెలిస్తే ఎంతో ఆవేదనకు గురవుతాం. భావోద్వేగానికి లోనవుతాం. అంతిమంగా ఇది మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది’..
మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి!
ఆన్లైన్ ట్రోలింగ్‌కు సంబంధించి 15 ఏళ్ల టీనేజర్లు అయినా, 25 ఏళ్ల యువత అయినా..ఎవరైనా సరే ఒకే రకమైన ఉద్వేగానికి గురవుతారు. ప్రపంచం తమను దూరం పెట్టిందన్న ఒక రకమైన భావనకు వస్తారు. ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడాలంటే చాలా కష్టం. కానీ నేను వాటిని అధిగమించాను. మీకు కూడా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఉంటే త్వరగా బయటపడండి. మానసిక స్థైర్యంతో ముందుకు సాగండి. మళ్లీ సంతోషమయ జీవితాన్ని ప్రారంభించండి’ అని సూచించారీ అందాల తార.
మంచిని మాత్రమే గ్రహించాలి!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేగన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించి పలు సూచనలు ఇచ్చారు.
‘మన శరీర తత్వాన్ని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనకు ముందే తెలుస్తుంది. ఎలాంటి డైట్ తీసుకుంటే బలంగా తయారవుతామో మనకు సులభంగానే అర్థమవుతుంది. సోషల్ మీడియా వినియోగం, ఆన్లైన్ సమాచారానికి సంబంధించి మన కళ్లు, మనసుకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయాలి. మంచేదో, చెడేదో గ్రహించి మనకు నష్టం కలిగించే విషయాలను దూరంగా ఉంచాలి. నా విషయానికొస్తే ఏది చదవాలో, ఏది చూడాలో నేను ముందే నిర్ణయించుకుంటాను. ప్రతికూల ఆలోచనలు కలిగించే విషయాలను సాధ్యమైనంతవరకు దూరం పెడతాను. సానుకూల దృక్పథం నింపే విషయాల పైనే పూర్తిగా దృష్టి సారిస్తాను’ అని చెప్పుకొచ్చాడు ప్రిన్స్ హ్యారీ.