Image for Representation
ఒకప్పుడు పెళ్లైన అమ్మాయిని ‘గంపెడు మంది పిల్లల్ని కనమ్మా’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికే తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మందికి తల్లైంది అమెరికాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం పదకొండోసారి గర్భం ధరించిన ఈ మహిళ.. దీంతో పాటు మరో పాపాయిని కూడా కంటానంటోంది. ఇలా మొత్తంగా పన్నెండేళ్లలో పన్నెండు మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకుందీ అమెరికన్ మామ్. అయినా కచ్చితంగా ఇంతమందే పిల్లల్ని కనాలని ఎవరైనా అనుకుంటారా? అని సరదాగా అడిగితే.. దీని వెనుక ఒక చిన్న కథ ఉందని చెబుతోంది. మరి, ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చెబుతోన్న కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
కోర్ట్నీ రోజర్స్-క్రిస్ రోజర్స్.. అమెరికాకు చెందిన ఈ కపుల్ 2007లో ఓ చర్చి క్యాంప్‌లో కలుసుకొని మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై ఏడాది పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. 2008లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కోర్ట్నీ తొలిసారి గర్భం ధరించినా అది నిలవలేదు. ఆపై 2010లో మొదటి పాపాయికి జన్మనిచ్చిందీ అమెరికన్ మామ్.
పన్నెండేళ్లలో పన్నెండు మంది!
అలా అప్పట్నుంచి ఇప్పటిదాకా అంటే 2010 నుంచి 2020 దాకా.. ఈ పదేళ్ల కాలంలో పది మంది పిల్లల్ని కన్నారీ క్యూట్ కపుల్. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న కోర్ట్నీ పదకొండోసారి గర్భవతైంది. వచ్చే నెలలో మరో పాపాయికి జన్మనివ్వబోతోన్న ఈ బ్యూటిఫుల్ మామ్.. ఆ తదుపరి ఏడాది కూడా మరో బిడ్డకు జన్మనిస్తానని.. ఇలా మొత్తంగా 12 ఏళ్లలో 12 మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఇలా 14 మందితో (భార్యాభర్తలు, 12 మంది పిల్లలు) తన కుటుంబం సంపూర్ణం కాబోతోందని తెగ సంబరపడిపోతోందీ యూఎస్ మామ్. అంతేకాదు.. ఈ పదేళ్ల కాలంలో కోర్ట్నీ 9 నెలలు మాత్రమే గర్భం ధరించకుండా ఉందన్న విషయం విని మనలాగే చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
అసలు కథేంటంటే..!
ఎవరైనా ఒకరిద్దరు పిల్లల్ని కంటారు.. లేదంటే మరొకరి కోసం ప్లాన్ చేసుకుంటారు.. అలాంటిది మీరు కచ్చితంగా 12 మందినే ఎందుకు కనాలనుకుంటున్నారు? అని అడిగితే ఇలా సరదాగా సమాధానం చెబుతోంది కోర్ట్నీ. ‘పిల్లల విషయంలో పెళ్లికి ముందే నేను, నా భర్త ఓ నిర్ణయానికొచ్చాం. ఆ సమయంలో.. ‘మా అమ్మకు మేము 10 మంది పిల్లలం.. మాది చాలా పెద్ద కుటుంబం. నువ్వు కూడా ఆమెలాగే గంపెడు మంది పిల్లల్ని కంటావా?’ అని నా భర్త నన్ను అడిగాడు.. అది కూడా సరదాగానే! కానీ నేను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నా.. ‘పది మంది కాదు పన్నెండు మందిని కంటాను..’ అని నేను కూడా సరదాగానే సమాధానం ఇచ్చినా.. ఆ మాటను నిజం చేయాలనుకున్నా. అయితే నాకు రెండుసార్లు మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం కావడంతో ముందు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా.. కానీ ఆ తర్వాత్తర్వాత ప్రతిసారీ చాలా సంతోషంగా, సరికొత్త అనుభూతిని పొందుతున్నా. ఇక మా లక్ష్యానికి ‘చీపర్ బై ది డజన్’ అనే సినిమానే స్ఫూర్తి. అందులో తల్లిదండ్రులు తమ కెరీర్స్ విషయంలో రాజీ పడి మరీ తమ 12 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు.. నేను కూడా మరో ఇద్దరు పిల్లల్ని కని నా మాట నిలబెట్టుకుంటా..’ అంటోంది కోర్ట్నీ.
ఈ ‘ఖుషీ’ కుటుంబం ఎంత క్యూట్‌గా ఉందో!
ఇలా తన మాట ప్రకారమే ఇప్పటికే పదేళ్లలో పది మంది చిన్నారులకు తల్లైంది కోర్ట్నీ. వారిలో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు (కవలలతో కలిపి) ఉన్నారు. అంతేకాదు.. ఈ పిల్లలందరి పేర్లు కూడా ‘సి’ అనే ఆంగ్ల అక్షరంతోనే మొదలయ్యేలా నామకరణం చేసిందీ అమెరికన్ జంట. ఇక ఈ నవంబర్‌లో ఒకరు, మరో ఏడాది మరొకరి కోసం ప్లాన్ చేసుకొని 14 మందితో తన కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది కోర్ట్నీ. అయితే ప్రస్తుతం తన పది మంది పిల్లల ఆహారం కోసం నెలకు సుమారు 88 వేలు, ఇతరత్రా ఖర్చుల కోసం 73 వేలకు పైగానే ఖర్చు చేస్తున్నారట ఈ యూఎస్ కపుల్. అంతేకాదు.. సందర్భం ఏదైనా ఇలా తమ క్యూట్ ఫ్యామిలీతో ఖుషీఖుషీగా ఫొటోలు దిగుతూ సోషల్ మీడియా పేజీల్లో సైతం పోస్ట్ చేస్తుంటారీ రోజర్స్ కపుల్. దీంతో అవి కాస్తా ట్రెండ్ అవుతుంటాయి. మరి, ఈ కుటుంబాన్ని చూస్తుంటే అచ్చం ‘ఖుషీ’ సినిమా క్లైమ్యాక్స్‌లో పవన్-భూమిక గంపెడు మంది పిల్లలతో ఉన్న సీనే కళ్ల ముందు కదులుతోంది కదూ!! మరి ఈ ‘ఖుషీ’ ఫ్యామిలీని చూస్తుంటే మీకేమనిపిస్తోంది.. మీ మనసులో కలిగే భావాలకు ‘వసుంధర.నెట్’ వేదికగా అక్షర రూపమివ్వండి!