Image for Representation
సాధారణంగా పెంపుడు జంతువులు ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే కలిసిపోతుంటాయి. ఎక్కడి కెళ్లినా మనతో పాటే వచ్చేస్తుంటాయి. మనల్ని వీడి ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి పెంపుడు జంతువులంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది కుక్క, పిల్లి, చిలుక, పావురం వంటి సాధు జంతువులే. కానీ ఇజ్రాయెల్‌కు చెందిన ఓ 8 ఏళ్ల అమ్మాయి మాత్రం ఏకంగా కొండచిలువతో స్నేహం చేస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుతం పాఠశాలలు లేకపోవడంతో నిత్యం ఈ పెట్ పైథాన్‌తోనే ఆటలాడుతూ కాలక్షేపం చేస్తోంది.
11 అడుగుల కొండచిలువతో స్నేహం!
సహజంగా చిన్న పామును చూస్తేనే మనం జడుసుకుంటాం. ఆ పాము ఎలాంటి హానీ చేయదని తెలిసినా దూరంగా పరిగెడతాం. అలాంటిది 11 అడుగుల కొండచిలువతో స్నేహం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇన్బర్ రెగెవ్. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ యానిమల్ శాంక్చువరీలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఈ డేరింగ్ గర్ల్ చిన్నప్పటి నుంచీ జంతువుల మధ్యే పెరిగిందట. ఇక్కడి అభయారణ్యంలో ఉంటున్న పలు జంతువులను మచ్చిక చేసుకుందట. అందులో భాగంగా ప్రస్తుతం కొండచిలువతో స్నేహం చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు కూడా మూతపడడంతో రోజంతా ఆ పెట్ ఫైథాన్‌తోనే గడిపేస్తోందట!
ఆ క్యారక్టర్ స్ఫూర్తితో!
మూడేళ్ల క్రితం హాలీవుడ్లో విడుదలైన ‘బ్యూటీ అండ్ ద బీస్ట్’ సినిమా గుర్తుందా? అందులో ఎమ్మా వాట్సన్ ‘బెల్లె’ అని ఓ ఫిక్షనల్ క్యారక్టర్లో నటించింది. ఈ సినిమాలోని ఓ సీన్లో యెల్లో కలర్ గౌన్ ధరించి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది బెల్లె. ఈ నేపథ్యంలో యెల్లో కలర్లో నున్న తన పెట్ పైథాన్‌కు ఇదే పేరు పెట్టుకుంది ఇన్బర్. ‘చిన్నప్పటి నుంచి నాకు పాములంటే ఇష్టం. వాటితో గడుపుతుంటే అసలు టైం తెలియదు. షెడ్డింగ్ ప్రక్రియ (పాములు పాత చర్మాన్ని వదిలించుకునే ప్రక్రియ)లో నేను వాటికి సహాయపడతాను. అదేవిధంగా ప్రస్తుత కరోనా సమయంలో వాటికెలాంటి ఆపద రాకుండా చూసుకున్నాను’ అని అంటోందీ డేరింగ్ గర్ల్.
ఈ నేపథ్యంలో ఇన్బర్ తన ఇంటి ఆవరణలోని స్విమ్మింగ్‌పూల్‌లో కొండచిలువతో కలిసి సేద తీరుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చాలామంది ఇన్బర్ తెగువను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం ‘క్రూర జంతువులతో ఆటలొద్దు. దయచేసి ఇలాంటివి ప్రోత్సహించవద్దు’ అని తన తల్లిదండ్రులకు సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అప్పుడే తోటి వారిని ప్రేమిస్తారు!
ఈ కామెంట్లపై స్పందించిన ఇన్బర్ తల్లి కొండచిలువతో తన కూతురు స్నేహం ఈనాటిది కాదంటూ, ఇలా స్విమ్ చేయడం వారికి మామూలేనంటూ చెప్పుకొచ్చింది. ‘ఈ వీడియోను చూస్తుంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ మాకిది మామూలే. ఎందుకంటే ఇన్బర్ చిన్నప్పటి నుంచీ ఎన్నో రకాల జంతువుల మధ్య పెరిగింది. పాములతో స్నేహం చేసింది. తనకు చిన్నప్పటి నుంచీ పాములతో కలిసి స్విమ్ చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు ఆ పాము, మా పాప ఇద్దరూ పెద్దయ్యారు. కాబట్టి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈత కొడుతున్నారు. ఇది మాకు సహజమే. ఈ వీడియోను చూసిన కొంతమంది మా కూతురిపై మాకు ప్రేమ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏంటంటే... పిల్లలు జంతువులతో కలిసి పెరగాలి. వాటితో స్నేహం చేయాలి. అప్పుడే తోటి వారిని ప్రేమించే గుణం పిల్లలలో అలవడుతుంది. తన గురించి కాకుండా ఇతరుల బాగు కోసం పాటుపడతారు’ అని చెప్పుకొచ్చిందీ సూపర్ మామ్.