Image for Representation
ఈ ఏడాది ప్రారంభంలో మన దేశంలోకి అడుగుపెట్టిన కరోనా ఇంకా శాంతించడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వైపు నుంచి ప్రతి ఒక్కరినీ వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు బీపీ, షుగర్, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి కరోనా వస్తే ఇక అంతే సంగతులు అనే ప్రతికూల ఆలోచనలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి షుగర్ ఉన్న వాళ్లు, ఊబకాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందీ వైరస్. ఇలాంటి పరిస్థితుల్లో 172 కిలోల బరువుండి మధుమేహంతో బాధపడుతోన్న ఓ మహిళ కరోనాను జయించింది. తద్వారా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనవచ్చని తన లాంటి బాధితుల్లో మనో ధైర్యం నింపింది.
34 రోజుల పాటు కరోనాతో పోరాడి!
ముంబైకి చెందిన మెహ్నాజ్ లోఖండ్వాలా ఆగస్టు చివరి వారంలో కరోనాతో ఆస్పత్రిలో చేరింది. 62 ఏళ్ల వయసున్న ఆమెకు ఊబకాయంతో పాటు మధుమేహం, ఆస్తమా, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన మెహ్నాజ్కు వైద్యులు తమ చికిత్సతో మళ్లీ పునర్జన్మ అందించారు. దీనికి తోడు ఆమె దృఢ సంకల్పం ముందు కరోనా కూడా ఓడిపోయింది. మొత్తం 34 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి కొవిడ్‌తో పోరాటం చేసిన ఆమె ఇటీవల ఇంటికి చేరుకుంది.

క్యాన్సర్ సర్జరీకి ముందు కొవిడ్!
బాంద్రాలో నివాసముంటున్న మెహ్నాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆగస్టు చివరి వారంలో ఆమెకు ఓ సర్జరీ కూడా చేయాల్సి ఉంది. అయితే శస్ర్తచికిత్సకు ముందు కొవిడ్ టెస్ట్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆగస్టు 26న జరిపిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది. అప్పటికి ఆమెకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో హోం ఐసోలేషన్ ట్రీట్మెంట్ అందించారు. అయితే రెండు రోజుల తర్వాత ఉన్నట్లుండి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
రోజుకు 15 లీటర్ల ఆక్సిజన్..
‘ఆ రోజు తెల్లవారుజామున 2 గంటలకు మెహ్నాజ్ లోఖండ్వాలా ఆస్పత్రిలో చేరింది. అప్పటికే ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 83-84కు పడిపోవడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీనికి తోడు క్యాన్సర్, డయాబెటిస్, ఆస్తమా, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలున్నాయి. 172 కేజీల బరువుండి ఊబకాయంతో బాధపడుతున్న ఆమె మెడ చాలా చిన్నదిగా ఉండడంతో వెంటిలేటర్‌ను అమర్చడం ఏ మాత్రం సాధ్యపడలేదు. దీంతో నాలుగు రోజుల పాటు ఆక్సిజన్‌ను అమర్చి కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం వైద్యం అందించాం. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో BiPap మెషీన్ అమర్చాం. అలా పది రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత మెహ్నాజ్ ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైంది. అలా ఆస్పత్రిలో చేరిన 16 రోజుల తర్వాత ఆమెలో కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. కరోనా పరీక్షల్లో కూడా నెగెటివ్ అని రావడంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించాం. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఇంటికి పంపించకుండా మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స అందించాం. ఇలా సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న ఆమె అక్టోబర్ 2న ఇంటికి చేరుకుంది. ఆస్పత్రిలో రోజుకు 15 లీటర్ల ఆక్సిజన్ తీసుకున్న మెహ్నాజ్ ప్రస్తుతం ఒక లీటర్ ఆక్సిజన్ మద్దతు తీసుకుంటూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటోంది. దీనిని మేం ఓ ఛాలెంజింగ్ కేసులా తీసుకున్నాం. ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు మాకెంతో సంతోషాన్ని అందించింది’ అని ఆమెకు వైద్యం చేసిన ఓ జనరల్ ఫిజీషియన్ చెప్పుకొచ్చారు.
మీరు ఆ తప్పు చేయొద్దు!
మొత్తం 34 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికి చేరుకుంది మెహ్నాజ్. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, భగవంతుడి దయ కారణంగానే తాను కరోనా నుంచి కోలుకున్నానంటూ తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పటికీ ఆక్సిజన్ మద్దతుతోనే శ్వాస తీసుకుంటున్నాను. కరోనా నుంచి కోలుకున్నానంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. నేను ఆలస్యంగా ఆస్పత్రిలో చేరాను. అందుకే నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఒకవేళ నేను త్వరగా ఆస్పత్రిలో చేరి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. త్వరగా కోలుకునేదాన్ని. కాబట్టి మీరు ఆ తప్పు చేయొద్దు. ఎవరూ కొవిడ్‌ను తేలికగా తీసుకోకండి. అలా అని అనవసరంగా భయపడొద్దు. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. అవసరమైతే సొంత వైద్యం కాకుండా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోండి’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది మెహ్నాజ్.