Image for Representation
నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.
పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!
ఇప్పుడంటే అధునాతన కెమెరాలు, ఎంతో సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఫొటోగ్రాఫర్లు ఉన్నారు కాబట్టి ఏ వేడుక జరిగినా సులభంగా ఫొటోలు తీసుకోవచ్చు. ఇవేవీ అందుబాటులో లేకపోయినా కనీసం మన జేబులో ఉండే స్మార్ట్ ఫోన్‌తో అయినా సెల్ఫీలు దిగే సౌలభ్యం ఉంది. కానీ గతంలో ఈ అధునాతన కెమెరాలు, స్మార్ట్ ఫోన్లేవీ లేవు. పెళ్లి లాంటి పెద్ద వేడుకలు జరిగినా సాధారణ కెమెరాలతో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తీయించుకోవాల్సిందే. అందుకే కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన చిన్నమ్మ, కుంజుట్టి దంపతులు పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్ తీయించుకున్నారు. పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందంతో మురిసిపోయారు.
వధూవరులుగా ముస్తాబై!
1962 జనవరి 1న చిన్మమ్మ, కుంజుట్టిలకు వివాహం జరిగింది. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్ అందుబాటులో లేకనో మరే ఇతర కారణంతోనో పెళ్లిలో ఒక్క ఫొటో కూడా తీయించుకోలేదట. అంతేకాదు పెళ్లయి 58 ఏళ్లు దాటినా ఇంతవరకూ ఇద్దరూ కలిసి ఒక్క ఫొటో కూడా దిగలేదట. ఈ దంపతులకు మొత్తం ఆరుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అందులో ఒకరు వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. దీంతో తమ మనవడి సహాయంతో వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకోవాలనుకున్నారీ ఓల్డ్ కపుల్. అందుకే పెళ్లి బట్టల్లో నూతన వధూవరుల్లా ముస్తాబయ్యారు చిన్నమ్మ-కుంజుట్టి దంపతులు. అందుకు ఆ మనవడు, అతని స్నేహితులు సాయం చేశారు. ఈ సందర్భంగా తెల్లటి చీరలో చిన్నమ్మ మెరిసిపోగా, బ్లాక్ కలర్ సూట్ ధరించి కుంజుట్టి కొత్త పెళ్లి కుమారుడిలా తయారయ్యారు. అనంతరం చేతుల్లో పూల బొకేలను పట్టుకుని పలు స్టిల్స్‌లో ఫొటోలు తీయించుకున్నారు.
బ్యూటిఫుల్ ఫొటోషూట్!
ఈ ఓల్డ్ కపుల్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు ఆ ఫొటోగ్రాఫర్. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘సూపర్బ్’, ‘బ్యూటిఫుల్ ఫొటోషూట్’ అని అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.