సాధారణంగా ఇల్లంటే లివింగ్ రూమ్, పడక గది, కిచెన్.. ఇవే ఉంటాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే విల్లాలు, డూప్లెక్స్ మోడల్స్‌లో తమ ఇంటిని నిర్మించుకుంటారు. వాటిలో తమ అభిరుచికి తగినట్లుగా అలంకరణ వస్తువులతో తీర్చిదిద్దుకుంటారు. మరి, రాజ భవనాన్ని మించిపోయేలా, ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఇంటిని మీరెప్పుడైనా చూశారా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇల్లు అందుకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. రాజసం ఉట్టిపడే హంగులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు.. అబ్బో ఇలా ఆ ఇంటి గురించి, అందులో అలంకరించిన వస్తువుల గురించి ఎంత చెప్పినా తక్కువే!
ఇంతకీ ‘మన్నత్’గా పిలిచే ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ ఎవరో తెలుసా? ఇంకెవరు.. షారుఖ్ సతీమణి, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లకు తన ఇంటీరియర్ నైపుణ్యాలతో హంగులద్దిన గౌరీ.. తన ఇంటిని ఇంకెంత అందంగా అలంకరించుకొని ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసినప్పుడల్లా నెటిజన్లు దాని అందానికి మంత్రముగ్ధులవుతుంటారు.. మరి, ప్రపంచంలోనే అత్యుత్తమ భవనాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ‘మన్నత్’ గురించి గౌరీ ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..
గౌరీ ఖాన్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ సతీమణిగానే కాదు.. ఇంటీరియర్ డిజైనర్‌గా తనకు సాటి మరెవరూ లేరు అన్నట్లుగా ఎదిగారామె. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ విలాసవంతమైన టెర్రస్, ఆయన పిల్లల నర్సరీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇల్లు, అలియా భట్ వ్యానిటీ వ్యాన్.. ఇలాంటివెన్నో ఆమె అలంకరణకు ప్రతిరూపాలే! ఇలా ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా ఇతరుల ఇళ్లనే ఇంత అందంగా తీర్చిదిద్దిన ఆమె.. తన ఇంటిని, అదీ షారుఖ్ ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన ‘మన్నత్’ ప్యాలస్‌ని ఇంకెంత అందంగా తీర్చిదిద్దారో మనం ఊహించుకోవచ్చు. అయితే మన ఊహలకు అందనంత అద్భుతమైన అలంకరణ వస్తువులు, హంగులు, ఆర్భాటాలతో ఆమె తన ఇంటిని తీర్చిదిద్దారు. అంతేకాదు.. అప్పుడప్పుడూ తన ఇంటికి సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు గౌరీ. ఇవి చూసిన నెటిజన్లు మన్నత్ సొగసులకు కళ్లప్పగించేస్తుంటారు.
అమ్మ నుంచే నేర్చుకున్నా!
ఇంటిని విలాసవంతంగా అలంకరించుకోవడమే కాదు.. దాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడమూ ఓ కళే! ఆ పనిని తన తల్లి నిర్వర్తిస్తారని చెబుతున్నారు గౌరి. ప్రస్తుతం దిల్లీలో నివసిస్తోన్న తన తల్లి సవితా చిబ్బా అక్కడి నుంచే ఇంటిపై అనుక్షణం నిఘా వేసి ఉంచుతున్నారని, ఇంటిని పరిశుభ్రంగా ఎలా ఉంచాలో అమ్మ నుంచే నేర్చుకున్నానంటున్నారీ మిసెస్ బాద్షా.
‘ప్రస్తుతం అమ్మ దిల్లీలో ఉంటోంది. అక్కడి నుంచే ముంబయిలోని మన్నత్‌ను పర్యవేక్షిస్తోంది. ప్యాలస్ సిబ్బందికి తరచూ ఫోన్ చేస్తూ, వాట్సప్‌లో సందేశాలు పంపుతూ అనుక్షణం ఇంటిని అద్దంలా ఉంచేందుకు కావాల్సిన అన్ని సలహాలు అందిస్తోందామె. ఈ భవనంలో ఉండే వస్తువులు ఉండాల్సిన చోటు కంటే కాస్త ముందుకు - వెనక్కి జరిగినా వాటిని సెట్ చేయించడం, అక్కడ చెత్త ఉంది.. ఆ ప్రదేశాన్ని బాగా శుభ్రం చేయాలని ఆదేశించడం.. ఇలా సిబ్బందికి సలహాలిస్తూ వారితో ఆ పనులన్నీ నీట్‌గా పూర్తిచేయిస్తూ నాకు బోలెడంత పని భారం తగ్గిస్తోంది అమ్మ. అంతేకాదు.. ఈ పని అటు ఆమెను బిజీగా ఉంచడంలోనూ, ఇటు సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేలా.. ఇలా రెండు రకాలుగా ఉపయోగపడుతోంది. ఇంటిని శుభ్రం చేసే విషయంలో ఇలా అమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా..’ అంటున్నారు గౌరి.
ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఈ మిసెస్ షారుఖ్.. తన డిజైనింగ్ జర్నీలోని కీలక మలుపుల్ని రంగరించి కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాశారు. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి సూచనలు చేస్తూ ప్రత్యేకమైన ఫొటోల్ని సైతం ఈ పుస్తకంలో పొందుపరిచారు గౌరి. ‘మై లైఫ్ ఇన్ డిజైన్’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారీ సెలబ్రిటీ డిజైనర్.
మాటలకందని విశేషాలెన్నో!
ముంబయిలోని బాంద్రాలో అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న విలాసవంతమైన భవనం ‘మన్నత్’. షారుఖ్ ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన ఈ ఇల్లు ప్రపంచంలోనే అత్యుత్తమ భవనాల్లో పదో స్థానాన్ని (టాప్-10) ఆక్రమించడం విశేషం. ఇక ఇండియాలో అత్యంత ఖరీదైన భవనాల్లో మూడో స్థానంలో నిలిచిందీ ప్యాలస్. అంతేకాదు.. ఇంద్ర భవనానికి ఏమాత్రం తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్న మన్నత్‌లో మాటలకందని విశేషాలెన్నో దాగున్నాయి. * తను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఈ ప్యాలస్ తన ఆస్తుల్లో అత్యంత ఖరీదైందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు షారుఖ్. ఈ క్రమంలోనే ‘మీ మన్నత్‌లో ఓ గది అద్దెకు కావాలి, ఎంత ఖర్చవుతుంది?’ అని ఇటీవల ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘30 ఏళ్ల శ్రమ ఖర్చువుతుందని’ బదులిచ్చాడు. అంటే ఈ ఇల్లంటే తనకెంత ప్రాణమో ఒక్కమాటలో చెప్పకనే చెప్పాడీ హ్యాండ్సమ్. మరి, ఇంతకీ ఈ ప్యాలస్ విలువ ఎంతో తెలుసా? రూ. 200 కోట్లకు పైమాటేనట! *నిజానికి ముందు ఈ ఇంటి పేరు ‘మన్నత్’ కాదట! షారుఖ్ కొనుగోలు చేసే క్రమంలో ‘విల్లా వియానా’, ‘జన్నత్’గా దీనికి పేరు పెడదామనుకున్నాడట! కానీ ఈ ఇల్లు తనకు కలిసొచ్చిన అదృష్టమని.. అందుకే తాను మనసు మార్చుకొని దీనికి ‘మన్నత్’గా పేరు పెట్టానని చెబుతాడు షారుఖ్.
*ఇటాలియన్ ఆర్కిటెక్చర్, లాటిన్-గ్రీక్ సంస్కృతులకు అద్దం పట్టే వస్తువులు, రెండు విశాలమైన లివింగ్ రూమ్స్.. అందులో సుప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ విశాలమైన ఆటస్థలం, గ్రంథాలయం, ప్రైవేట్ బార్, ఎంటర్టైన్మెంట్ సెంటర్, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు, షారుఖ్-గౌరి కోసం ప్రత్యేకమైన ఆటస్థలం.. ఇలా ఈ బహుళ అంతస్థుల భవనంలో లేని సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. *ఇలా ఇన్ని హంగులద్దుకున్న ఈ ఇంటిని డిజైన్ చేయడానికి గౌరికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టిందట!
ఇలా ఆమె డిజైన్ చేసుకున్న మన్నత్ అందాలు చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇంట్లోని అణువణువూ గౌరీ ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్స్‌కి, ఆమె అభిరుచులకు అద్దం పడతాయి. మరి, ఈ విలాసవంతమైన భవనానికి సంబంధించిన కొన్ని ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
|