అమృత స్వరం మూగబోయింది...
గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...
బాలసుబ్రహ్మణ్యం మంచి వ్యక్తి, ప్రతిభ గల గాయకుడు, మృదుభాషి.. ఆయన మరణవార్త నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మేమిద్దరం కలిసి చాలా పాటలు పాడాం.. చాలా కార్యక్రమాలు చేశాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
- లతా మంగేష్కర్
ఒక శకం ముగిసిపోయింది. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రపంచమూ ఒకేలా ఉండదు. నేను మంచి గాయనిగా ఎదగడంలో ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలకు మాటల్లో కృతజ్ఞతను చెప్పలేను. మీరు లేని సంగీత కార్యక్రమాన్ని ఊహించుకోలేకపోతున్నాను. సావిత్రమ్మ, చరణ్, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
– కె.యస్. చిత్ర
లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మేమందరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నాం..
- శ్రేయా ఘోషల్
బాలూ గారి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం శూన్యమైంది.. తన ప్రతిభ, తపనతో సంగీతాభిమానులకు వీనుల విందు చేశారు.. మీ అద్భుతమైన పాటలు సంగీత అభిమానుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటాయి..
- కౌసల్య
నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ.. జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి.. నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే.
- సునీత
మిమ్మల్ని మిస్సవుతున్నాం సర్..!
- మధుప్రియ
మాకెన్నో జ్ఞాపకాల్ని మిగిల్చినందుకు ధన్యవాదాలు. ఓ సింగర్ నటించగలడు, కంపోజ్ చేయగలడు.. మరెన్నో అంశాల్లోనూ రాణించగలడని నిరూపించినందుకు కృతజ్ఞతలు. మీరెప్పుడూ మా హృదయాల్లో ఉంటారు సర్..
- చిన్మయి శ్రీపాద
న భూతో న భవిష్యతి.. మిమ్మల్ని ఎంతో మిస్సవుతున్నాం సర్.. మీరొక గొప్ప ఫైటర్. మాకు ఎన్నో సంగీత పాఠాలు నేర్పి మాలో స్ఫూర్తి నింపిన మీకు ధన్యవాదాలు. హార్డ్ వర్క్, క్రమశిక్షణ, నిజాయతీలకు మీరే ఒక ఉదాహరణ..
- గీతా మాధురి
ఇదేమీ బాలేదు బాలు గారు.. చెన్నై వెళ్లగానే పాట పాడి పంపిస్తా.. ట్యూన్ చాలా బాగుంది అన్నారు.. ఇది అస్సలు బాలేదు. మిమ్మల్ని ఎవరూ భర్తీ చేయలేరు..
- ఎం.ఎం. శ్రీలేఖ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నా హృదయంలోని ఓ భాగాన్ని మీతో తీసుకెళ్లారు. మనమంతా ఈ బాధను తట్టుకోవడం అంత సులభం కాదు. ఓ గాయకుడిగా, వ్యక్తిగా మీకు సాటిలేరు. ఈ రోజు మనకు దుఖాఃన్ని మిగిల్చింది..
- మంచు లక్ష్మి
మీ ఆత్మకు శాంతి కలగాలి.
- త్రిష
మనం ఒక లెజెండ్ని కోల్పోయాం. మీ ఆత్మకు శాంతి కలగాలి..
- కామ్నా జెఠ్మలానీ
ఒక శకం ముగిసింది. మీ గాత్రాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మీ పాటలు ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచి ఉంటాయి. మీ ఆత్మకు శాంతి కలగాలి..
- కీర్తీ సురేష్
ఈ పాటలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలి బాలు సర్..
- అనుపమా పరమేశ్వరన్
బాలు సర్.. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే నిలిచి ఉంటారు..
- లావణ్యా త్రిపాఠి
మరో బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ ఉండరు.. సంగీత ప్రపంచానికి ఇది తీరని లోటు.. మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా..
- సమంత
హృదయం బద్దలైంది.. బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ధైర్యం నింపాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.
- అనుష్క
గుండె పగిలింది బాలు గారు.. మీరు లేని ప్రపంచాన్ని ఊహించలేకపోతున్నా..
- సుహాసిని
గంధర్వా.. నా ధైర్యాన్ని మెచ్చుకొన్నారు కానీ మీ మరణ వార్తని తట్టుకునే ధైర్యం నాకు లేదు..
- యాంకర్ ఝాన్సీ
మీరు మాకు దూరమైనా.. మీ స్వరం ఎప్పటికీ మాతోనే ఉంటుంది.
- శ్రీముఖి
మనకు ఎంతో ప్రత్యేకమైన బాలు సర్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.
- రమ్యకృష్ణ
మీ మరణం నన్నెంతో బాధించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్.
- సౌందర్య రజనీకాంత్
‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. కోట్ల మందికి గానామృతాన్ని పంచిన ఆయన త్వరగా కోలుకుని.. మళ్లీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది..
- విజయశాంతి