తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి అమ్మాయిల ఆలోచనలన్నీ ఒకేరకంగా ఉండవ్.. కాబోయేవాడు ఆరడుగులుండి.. ఆరు పలకల దేహదారుఢ్యమైతే తనకు పర్ఫెక్ట్ జోడీ అని కొంతమంది అనుకుంటే; మనసుకు నచ్చాలే కానీ ప్రాణమిచ్చేంత ప్రేమ కురిపిస్తా.. అనుకుంటారు మరికొందరు. ఇలా మొత్తానికి కాబోయే వాడు ఓ సినిమా హీరోలా ఉండాలని కలలు కనడం సహజం. అందరూ ఇలాగే ఆలోచిస్తారని కాకపోయినా ఎంతో కొంత ఇలా ఆలోచించే వాళ్ళూ ఉండకపోరు..
కానీ అలాంటి సినిమా హీరో మనకు వద్దే వద్దని ఈ తరం అమ్మాయిలందరికీ సలహా ఇస్తున్నాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అలాంటి వాడి కంటే మనసును అర్థం చేసుకొని మసలుకునే వాడైతేనే బెటర్ అంటున్నాడు.. అది కూడా పెళ్లి గురించి జీవితంలో సెటిలయ్యాకే ఆలోచించాలని సలహా ఇస్తున్నాడు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరిట వివిధ అంశాలపై తన మనసులోని భావాలను బోల్డ్‌గా పంచుకుంటోన్న ఈ మాస్ డైరెక్టర్.. తాజాగా అమ్మాయిల ఆలోచనా విధానం గురించి స్పందించారు. తన సినిమాల్లో మహిళా పాత్రలను ప్రత్యేకంగా, బలంగా చూపించే పూరీ.. ఈ వీడియోలోనూ అమ్మాయిల గురించి తన అభిప్రాయాలను బోల్డ్‌గా పంచుకున్నారు.

అన్నీ మంచి లక్షణాలే ఉన్నా..
‘అమ్మాయిలు ఎప్పుడూ కలల్లోనే బతుకుతారు. వాస్తవానికి దూరంగా డ్రీమ్స్‌లో ఉంటారు. తల్లిదండ్రులు రాకుమారిలా పెంచుతారు. నిజంగానే తను ‘క్లియోపాత్రా’ అనుకుంటుంది. ఆ తర్వాత ఎవరో ఒక మగాడు తగులుతాడు.. ‘నువ్వు నా దేవతవి’ అంటాడు. అదే నిజమనుకుంటుంది. సాధారణంగా అమ్మాయిలకు మంచి లాజికల్ బ్రెయిన్ ఉంటుంది. భద్రత చూసుకుంటారు.. రిస్క్‌లు చేయరు.. ఎక్కువగా ప్రేమిస్తారు.. ఎక్కువగా ఫీల్ అవుతారు.. ఫేస్ రీడింగ్ బాగా వచ్చుంటుంది. ఇలా అమ్మాయిల్లో అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ పొగడ్తలకు పడిపోతారు. అనుక్షణం పొగడ్తల కోసం ఎదురు చూస్తుంటారు.
హీరోలే కావాలంటారు!
పాపం అబ్బాయిలు పక్కింటి అమ్మాయిలతో సర్దుకుపోతారు. కానీ వీళ్లకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడూ సినిమా హీరోలే కావాలి. సిక్స్ ప్యాక్ ఉండాలి.. ఆరడుగులు ఉండాలి.. ప్రపంచమంతా వాడిని చూసి భయపడాలి. అలాంటి వాడు రాత్రి వీళ్ల కాళ్లు పట్టాలి. మరి, అదే ఓవర్ యాక్షన్ అంటే..! మీరు సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నా.. సంసారం అనే బండి చక్రంలో పడి ఆరునెలలు తిరగకుండానే వాడికి ఇంత పెద్ద పొట్ట వస్తుంది. దానికి తోడు తిండంటే ఇష్టమున్న వాడైతే మూడొంతుల మంచం ఆక్రమించేస్తాడు. ఈ రోజు ఏంజెల్లా ఫీల్ అయ్యే అమ్మాయిలందరూ ఒకరోజు అలాంటి వాడితో జీవించాల్సిందే..! రాత్రిళ్లు వాళ్ల గురక తట్టుకోలేక అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది. కానీ వెళ్లలేరు, ఇది నిజం.

మాహిష్మతి వద్దు.. బాహుబలి అసలే వద్దు!
కాబట్టి ఈ కాలం అమ్మాయిలకు నేను చెబుతున్నది ఒక్కటే! సిక్స్ ప్యాక్ కోసం వెతకొద్దు.. ధనవంతుడి కోసం ఎదురుచూడొద్దు. స్టైల్ కంటే సౌకర్యంగా ఉండే దుస్తులు ఎంచుకోండి. హీల్స్, లిప్స్టిక్స్ తగ్గించండి. మిమ్మల్ని మీరు మరోలా ప్రపంచానికి చూపించుకోవద్దు. జీవితంలో మీ శత్రువు ఒక మగాడు అవ్వాలే కానీ.. మరో ఆడది కాకూడదు. ఎందుకంటే ఆడదైతే.. సగం జీవితం వారితో శత్రుత్వానికే సరిపోతుంది. ఈ మగాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. వాళ్లతో పోటీ పడండి. బాగా చదివి ఉద్యోగమో, వ్యాపారమో మొదలు పెట్టండి. స్వేచ్ఛగా ఎదగండి. ఇవన్నీ ఉంటే మగతోడు అవసరం ఉండదు. మీ కాళ్లపై మీరు నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. మీరు చెప్పే ప్రతి మాట వినే భర్త వద్దు, అసలు మాట వినని వాడు కూడా మనకొద్దు. కొంచెం విని, కొంచెం వినని వ్యక్తిని పెళ్లి చేసుకోండి. మీ మూడ్ బాగోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు సూచనలు ఇచ్చే వాడై ఉండాలి. కొంచెం మంచోడు, నిజాయతీగా పనిచేసుకునే వాడైతే సరిపోతుంది. నువ్వు (అమ్మాయిల్ని ఉద్దేశిస్తూ) రాకుమారివి కాదు, మనకు మాహిష్మతి సామ్రాజ్యం వద్దు, బాహుబలి అసలే వద్దు.. ఈ మాట గుర్తుపెట్టుకోండి..’ అంటూ అమ్మాయిల ఆలోచనల గురించి సూటిగా, సుత్తి లేకుండా తన మనసులోని మాటల్ని పంచుకున్నాడీ డైనమిక్ డైరెక్టర్. యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.
మరి, ఇంతకీ పూరీ చెప్పిన మాటలపై మీ స్పందనేంటి? అందరు అమ్మాయిలూ పూరీ చెప్పినట్లు అలాగే ఆలోచిస్తారనుకుంటున్నారా?? పెంపకం విషయంలో, ప్రేమ-పెళ్లి విషయాల్లో అమ్మాయిల ఆలోచనా దృక్పథం గురించి ఆయనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి..