Image for Representation
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విలయం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియక అనుక్షణం భయం గుప్పిట్లోనే గడపాల్సి వస్తోంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలున్న వారికి కరోనా వస్తే ఇక అంతే సంగతులు అనే ప్రతికూల ఆలోచనలు మన మనసుల్ని చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే ప్రతికూలత అనే చిమ్మ చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖల్లా బయటికొస్తున్నారు ఎంతోమంది సెంచరీ బామ్మలు. వయసు మీరినా, అనారోగ్యాలున్నా ‘ఐ డోంట్ కేర్’ అంటూ పాజిటివిటీని చాటుతూనే ఈ వైరస్‌ను తుదముట్టిస్తున్నారు.
అసోంలోని గువహటికి చెందిన మాయి హందిఖ్ అనే బామ్మ కూడా ఇదే కోవకు చెందుతారు. పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇటీవలే డిశ్చార్జి అయిన ఈ బామ్మ ధైర్యానికి ఆస్పత్రి యాజమాన్యం ఫిదా అయిపోయింది. అందుకే డిశ్చార్జికి ముందు బామ్మ కోసం ఓ చిన్న పార్టీ కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఈ కొవిడ్ వారియర్ ధైర్యానికి, వైరస్‌ను జయించిన తన ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు.
మాయి హందిఖ్.. అసోం గువహటిలోని మదర్స్ వృద్ధాశ్రమంలో నివసిస్తోందీ వందేళ్ల బామ్మ. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన ఈ బామ్మను అక్కడి ఎంఎంసీహెచ్ కొవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆమె హైపర్‌టెన్షన్ పేషెంట్ కావడంతో అక్కడి వైద్యులు మొదట్లో కాస్త కంగారు పడ్డారు. కానీ బామ్మ మాత్రం సానుకూల దృక్పథంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో ఎంతో చలాకీగా ఉండేది. ఇది చూసిన వైద్యులు సరికొత్త ఉత్సాహంతో ఆమెను పసిపాపలా చూసుకుంటూ చికిత్స అందించారు.
అస్సలు భయం లేదు!
కరోనా బారిన పడి ఆస్పత్రిలో పది రోజుల పాటు చికిత్స తీసుకున్న ఈ బామ్మ.. రోజూ అస్సామీ పాటలు పాడుతూ చలాకీగా ఉండేవారు... అక్కడున్న డాక్టర్లు, నర్సులను తన సొంత పిల్లల్లా భావించి వారితో గడిపేవారు. వారు కూడా ఈ బామ్మను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి బామ్మ అంటూ ప్రేమగా పిలిచేవారు. ఆస్పత్రిలో ఉన్న పది రోజుల పాటు తనకు కరోనా సోకిందన్న భయం కానీ, హైపర్‌టెన్షన్ వల్ల తనకేమైనా అవుతుందేమోనన్న అభద్రతా భావం కానీ ఆమెలో ఇసుమంతైనా కనిపించలేదంటూ చెబుతున్నారు ఆ ఆస్పత్రి వైద్యులు, నర్సులు. ఇలా రోజూ ఈ బామ్మ ఆత్మవిశ్వాసం చూస్తుంటే తమకూ ఎంతో ఉత్సాహంగా అనిపించేదంటున్నారు.
ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం!
వైరస్ నిర్ధారణ అయ్యాక పది రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం నెగెటివ్ రావడంతో ఆమెను ఇటీవలే డిశ్చార్జి చేసింది ఆస్పత్రి యాజమాన్యం. అయితే అంతకంటే ముందు బామ్మ కోసం ఓ చిన్న పార్టీ కూడా ఏర్పాటుచేసి ఆమెను ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి వృద్ధాశ్రమానికి పంపించారు అక్కడి వైద్యులు, నర్సులు. ఈ క్రమంలో ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది.. వైరస్‌ను జయించానన్న ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో తొణికిసలాడింది. ఇదంతా అక్కడి వైద్యులు, నర్సులు తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం వల్లే సాధ్యమైందంటూ చెప్పుకొచ్చారీ వందేళ్ల బామ్మ.
‘ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు ఈ పది రోజుల పాటు నన్ను కన్నతల్లిలా చూసుకున్నారు. ఇలా వారి ప్రేమను నేనెంతో ఆస్వాదించాను. అలాగే నాకు భోజనంలోకి చేపలు, మాంసం, గుడ్లు, అరటిపండ్లు.. వంటివి అందించారు. అలాగే నేనూ ముందు నుంచీ ధైర్యంగా, సానుకూల దృక్పథంతోనే ఉన్నా.. ఇవే నన్ను వైరస్ నుంచి ఇంత త్వరగా కోలుకునేలా చేశాయి..’ అంటూ చిరునవ్వుతో చెబుతున్నారు మాయి. ఇలా కరోనాను జయించానన్న తన ఆనందాన్ని అస్సామీ పాటలు పాడుతూ మరీ సెలబ్రేట్ చేసుకున్నారీ బామ్మ.
బామ్మా.. మీ ధైర్యానికి వందనం!
ఇలా ఈ బామ్మ ధైర్యానికి ఫిదా అయిన అసోం మంత్రి హిమంత్ బిస్వా శర్మ ఈ కొవిడ్ వారియర్ ఫొటోను ట్విట్టర్లో పంచుకుంటూ ‘వందేళ్ల మాయి హందిఖ్ నిండైన ఆత్మవిశ్వాసంతో కొవిడ్‌ను జయించారు. సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసమే కొవిడ్‌ను జయించేందుకు అసలైన అస్త్రాలు అని మనందరికీ తెలియజేశారు. ఈ క్రమంలో ఈ బామ్మకు సేవలందించిన ఆస్పత్రి యాజమాన్యం కృషి అభినందనీయం’ అంటూ రాసుకొచ్చారు.
గతంలోనూ ఎందరో బామ్మలు, వందేళ్లు దాటిన కురువృద్ధులు కరోనా నుంచి బయటపడి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు.. అనారోగ్యాలున్నా కొవిడ్‌ను జయించచ్చని నిండైన ఆత్మవిశ్వాసంతో నిరూపించారు.. కరోనా భయంతో ఆశలు నీరు గారిపోతున్న అభద్రతా భావానికి లోనవుతున్న ఎంతోమందిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతోన్న ఇలాంటి కరోనా వారియర్లందరికీ సెల్యూట్!