తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన మరుక్షణం నుంచీ ఆ జంట ఆనందానికి అంతుండదు. ఇక తమకు పుట్టబోయేది పాపో / బాబో తెలుసుకోవాలన్న ఆరాటం కాబోయే పేరెంట్స్‌కి ఉన్నప్పటికీ అది మన దేశంలో చట్ట విరుద్ధం. కానీ విదేశాల్లో మాత్రం దీన్నో వేడుకలా జరుపుకొంటారు తమకు పుట్టబోయే బిడ్డ ఎవరో తాము తెలుసుకోవడమే కాదు.. తమ బంధువులు, స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చి మరీ సర్ప్రైజ్ చేస్తారు. ఇలాంటి వేడుకనే అందరికంటే భిన్నంగా జరుపుకొని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు దుబాయ్‌కి చెందిన ఓ జంట. ‘జెండర్ రివీల్ పార్టీ’ని అంత ప్రత్యేకంగా జరుపుకొన్నారు కాబట్టే ప్రస్తుతం వారి వీడియో ఇంటర్నెట్లో ఓ సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది.
అనాస్ మార్వా, అసలా మార్వా.. దుబాయ్‌కి చెందిన ఈ జంట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా కొనసాగుతున్నారు. తమ ఫ్యామిలీ ఫొటోలతో పాటు విభిన్న అంశాలపై వీడియోలు రూపొందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో, తమ యూట్యూబ్ ఛానల్స్‌లో పోస్ట్ చేస్తూ అశేషమైన ఫాలోవర్లను సంపాదించుకున్నారీ క్యూట్ కపుల్. ఈ జంటకు ఓ కూతురుంది. ఆ పాపను కూడా తమ వీడియోల్లో భాగం చేస్తుంటారు అనాస్-అసలా. అయితే ప్రస్తుతం అసలా రెండోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో- ‘జెండర్ రివీల్ పార్టీ’ని విభిన్నంగా జరుపుకొన్నారీ లవ్లీ కపుల్.
జీవితాంతం గుర్తుండిపోయేలా..!
‘జెండర్ రివీల్ పార్టీ’ అయితే చేసుకుందామనుకున్నారు.. కానీ అది అందరిలా కాకుండా ప్రత్యేకంగా, తమకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించిందీ జంట. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వారి మదిలో మెదిలింది. తమకు పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ కోసం ఆ భవనాన్నే వేదికగా చేసుకోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల్ని మాత్రమే అక్కడికి ఆహ్వానించారు మార్వా కపుల్. ఈ వేడుకలో అసలా, తన పాప తెలుపు రంగు దుస్తుల్లో దేవకన్యల్లా మెరిసిపోగా, అనాస్ వైట్ అండ్ గ్రే సూట్లో ముస్తాబయ్యాడు. ఇక ఈ వేడుకలో హాజరైన అతిథులు కూడా నిండైన దుస్తుల్లో కనిపించారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అనుసరించారు.
బ్లూ కలర్లో వెలిగిన బుర్జ్!
828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులున్న ఈ భవనం ‘జెండర్ రివీల్ పార్టీ’ సందర్భంగా వెలుగులీనింది. ఈ స్వీట్ ఫ్యామిలీ ఫొటోతో పాటు ఓసారి బ్లూ కలర్ ఇలస్ట్రేషన్స్, మరోసారి పింక్ కలర్ ఇలస్ట్రేషన్స్తో భవనమంతా తళుక్కున మెరిసింది. ఆపై భవనానికి ఓవైపు పింక్, మరోవైపు బ్లూ కలర్ లైట్స్ వెలిగేలా ఏర్పాటు చేశారు. ఇలా తమకు పుట్టబోయేది పాపా/బాబా అని ఆ జంట ఆతృతగా చూడడం, అక్కడికొచ్చిన వారి సన్నిహితులు, స్నేహితుల ఎగ్జైట్మెంట్ మధ్య కౌంట్‌డౌన్ ఆరంభమైంది. బ్లూ-పింక్ లైట్లు దోబూచులాడుతూ సాగిన ఈ కౌంట్‌డౌన్ పూర్తై భవనమంతా నీలం రంగు లైట్లతో వెలిగిపోతూ.. ‘ఇట్స్ ఎ బాయ్’ అనే సందేశం కనిపిస్తుంది. ఇక అప్పుడు మార్వా ఫ్యామిలీ ముఖాలు వెయ్యి వోల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి. ఆపై అందరూ ఆ జంటను అభినందిస్తూ బహుమతులు అందించారు. ఇలా తమ బేబీ జెండర్ రివీల్ పార్టీని అందరికంటే ప్రత్యేకంగా జరుపుకొని వార్తల్లోకెక్కిందీ అందాల జంట.
ఇది మా కుటుంబానికి తీపి గుర్తు!
అంతేకాదు.. ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ‘బేబీ రివీల్’ అంటూ ఆ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు మార్వా కపుల్. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ని సంపాదించుకుంది. ‘మా బేబీ జెండర్ రివీల్ పార్టీని అందరికంటే ప్రత్యేకంగా, మెమరబుల్‌గా జరుపుకోవాలనుకున్నాం. భవిష్యత్తులో ఇది మా కుటుంబానికి ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది..’ అంటూ సంబరపడిపోతున్నారీ క్యూటెస్ట్ కపుల్. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, వీరి ఫాలోవర్లు శుభాకాంక్షలతో కామెంట్ సెక్షన్‌ని నింపేశారు. ఇలా ప్రస్తుతం సెన్సేషన్‌గా మారిన ఈ బేబీ జెండర్ రివీల్ పార్టీ కోసం భారీగానే ఖర్చయినట్లు తెలుస్తోంది.
అయితే కొంతమంది వీరి ఆలోచనను మెచ్చుకుంటున్నా, ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతుంటే ఇంత డబ్బు ఖర్చు చేసి ఇప్పుడిలా పార్టీలు చేసుకోవడంలో ఏమైనా అర్ధముందా అంటూ విమర్శిస్తున్న వారూ చాలామందే ఉన్నారు. మరి వీళ్ళ ఆలోచన గురించి మీరేమంటారు?