పెళ్లి.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ పండగను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని జంటలు ఆరాటపడడం సర్వసాధారణం. అయితే కరోనా వచ్చాక పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. అనుకున్న ముహూర్తానికి వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఉంటే చాలనుకుంటున్నారు. ఆ అక్షతలేదో వారి నెత్తిన చల్లేస్తే పనైపోతుందనుకుంటున్నారు. ఇలా కరోనా ఎఫెక్ట్ అమెరికాకు చెందిన ఓ జంట పెళ్లిపై కూడా పడింది. ఎంతో అంగరంగవైభవంగా జరుపుకోవాలనుకున్న తమ పెళ్లి కాస్తా సింపుల్‌గా జరిగే సరికి తీవ్ర నిరాశపడిన ఆ జంట.. తమ పెళ్లి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకుంది. అందుకోసం అందరికంటే వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఓ సూపర్ డూపర్ ఫొటోషూట్ తీయించుకొని అందరినీ ఒక్క క్షణం భయపెట్టింది. అసలు ఈ కరోనా సమయంలో కొత్త జంట ఫొటోషూట్ ఏంటి? అది చూసి అందరూ భయపడడమేంటి? ఏమీ అర్థం కావట్లేదా? అయితే వివరాల్లోకి వెళ్దాం రండి..
రైయాన్, స్కై మైర్స్.. అమెరికాలోని ఆర్కన్సాస్‌కు చెందిన ఈ జంట.. అందరిలాగే తమ వివాహమూ అంగరంగవైభవంగా జరగాలని కలలు కంది.. అతిథులందరి సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో ఉంగరాలు మార్చుకోవాలని ఉవ్విళ్లూరింది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి వారి కలలను కల్లలు చేసింది.. ఆశలన్నీ ఆవిరి చేసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఈ జంట అనుకున్న ముహూర్తానికే ఇటీవలే ఏడడుగులు నడిచింది. అది కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కేవలం 12 మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే!
ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని..!
అయితే ఆర్కన్సాస్లోని హాక్స్బిల్ క్రాగ్ అనే కొండపైనే పెళ్లి చేసుకున్న ఈ జంట.. తమ పెళ్లి సింపుల్‌గా జరిగినా.. ఈ రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని భావించింది. అందుకే ఓ సాహసోపేతమైన ఫొటోషూట్ తీయించుకోవాలని నిర్ణయించుకుంది. వీరుండే ఆర్కన్సాస్ ప్రాంతం కొండపైనే ఉండడం, ఇద్దరికీ సాహస క్రీడలంటే మక్కువ ఉండడంతో ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారీ లవ్లీ కపుల్. ఈ క్రమంలోనే హాక్స్బిల్ క్రాగ్ కొండ చివర్లో.. వెనకంతా కొన్ని వేల అడుగుల లోయ ఉన్న లొకేషన్ దగ్గర వధువు వరుడి చేతిలో చెయ్యేసి వెనక్కి వంగడం, ఆపై అతని చేయి వదులుతూ వెనక్కి పడిపోతున్నట్లుగా.. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో పోజిస్తూ ఫొటోలు తీయించుకుందీ జంట. ‘పట్టు తప్పిందో.. ఇక అంతే సంగతులు!’ అనేలా ఉన్న ఈ పోజుల్ని మాసన్ గార్డ్నర్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘వామ్మో!’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే ఇక్కడ వధువు స్కై మైర్స్ కింద పడకుండా సేఫ్టీ రోప్ కట్టుకుందని తెలుసుకొని హమ్మయ్య అనుకున్నారంతా!
ఈ క్షణం ఎప్పటికీ మరవలేం!
తాము అనుకున్నట్లు వివాహం జరగకపోయినా.. అద్భుతమైన ఫొటోషూట్‌తో తమ మనసు నిండిందంటున్నారీ కొత్త జంట. ‘మా ఇద్దరికీ సాహసాలన్నా, అవుట్డేర్ గేమ్స్ అన్నా చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక సాహస క్రీడలో పాల్గొనాలని పరితపిస్తుంటాం. అయితే గత నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్న మేము.. ఈ ఏడాది ఒక్కటవ్వాలనుకున్నాం. అది కూడా సాదాసీదాగా కాదు.. వందలాది మంది అతిథుల సమక్షంలో! అయితే కరోనా వల్ల అది కుదరలేదు. అయినా కరోనా నిబంధనలు పాటిస్తూ, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఇక మేం తీయించుకున్న ఫొటోషూట్ అద్భుతం.. ఆ క్షణం మేమెప్పటికీ మర్చిపోలేం. ఎంత సాహసోపేతమైన ఫొటోషూట్ అయినా రక్షణే ముఖ్యం కదా! అందుకే కొండ చివర్లో తీయించుకున్న ఈ ఫొటోషూట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చారీ క్యూట్ కపుల్.
ఇలా వీళ్ల ఫొటోషూట్ చూసి కొందరికి రోమాలు నిక్కబొడుచుకొని ఉండచ్చు.. మరికొందరు తాము కూడా ఇలాంటి ఫొటోషూట్ తీయించుకుంటే వెరైటీగా ఉంటుందనుకొనీ ఉండచ్చు.. అయితే ఈ అమెరికన్ కపుల్‌కి సాహస క్రీడల్లో నైపుణ్యం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి డేంజరస్ ఫొటోషూట్ తీయించుకున్నారు? అదే.. అనుభవం లేకపోతే ఇలాంటి సాహసాల్లో ప్రమాదాలు కూడా జరగచ్చు.. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!