శ్రీజ గత ఐదు నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తోంది. ఉదయం పదింటికి లాగిన్ అయ్యిందంటే, లాగౌట్ అయ్యే సరికి రాత్రి 10 అవుతుంది. ఇక ఆ తర్వాతైనా విశ్రాంతి తీసుకుంటుందా అంటే అదీ లేదు. అర్ధరాత్రి దాకా ఫోన్లో ఫ్రెండ్స్‌తో అచ్చట్లు, ముచ్చట్లు! దీంతో గత కొన్ని రోజుల నుంచి ఆమెను తీవ్రమైన మెడనొప్పి, నడుంనొప్పి వేధిస్తున్నాయి.
మహిజ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కరోనా ప్రభావంతో తన కాలేజీ మూతపడడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది. అయితే టీవీ చూడడం లేదంటే మొబైల్‌తో గడపడం.. రోజంతా ఆమె చేసే పనులు ఈ రెండే! అందులోనూ ఈ మధ్య కరోనాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా ఫాలో అయ్యేసరికి వాటిలో వాస్తవమెంతో, అవాస్తవమెంతో తెలుసుకోకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది.
ఈ కరోనా కాలంలో వృత్తిరీత్యా లేదా టైంపాస్ కోసం డిజిటల్ గ్యాడ్జెట్స్‌కి అలవాటు పడిన వారు ఎందరో! ఇలా స్క్రీన్ టైమ్ అధికంగా ఉండే వారిలో అటు ఆరోగ్య సమస్యలే కాదు.. మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా అధికమవుతున్నాయంటున్నారు నిపుణులు. అందుకే రోజులో కాసేపు ఎవరికి వారే స్వచ్ఛందంగా డిజిటల్ ప్రపంచానికి దూరంగా (డిజిటల్ డీటాక్స్) ఉండాలంటున్నారు. లేదంటే దీని ప్రభావం పరోక్షంగా రోగనిరోధక వ్యవస్థపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరి, ఈ డిజిటల్ డీటాక్స్ ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..
‘ఓ పూట ఆహారం తీసుకోకుండానైనా ఉంటామేమో గానీ మొబైల్స్, ల్యాప్టాప్స్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం’.. ఇదీ డిజిటల్ ప్రపంచంలో మునిగితేలుతోన్న నేటి యువత వరస. అయితే ఇలా ఎక్కువ సమయం స్క్రీన్‌ని చూడడం వల్ల కళ్లు అలసిపోతాయి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల మెడనొప్పి, నడుం నొప్పి వేధిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతాయి. ఈ సమస్యల ప్రభావం పరోక్షంగా మన రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ వ్యసనాన్ని వదిలించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

ఆలోచిస్తే ఆప్షన్లు బోలెడు!
వృత్తిపరంగా లేదా టైంపాస్ కావట్లేదంటూ.. ప్రస్తుతం చాలామంది డిజిటల్ ప్రపంచమే లోకంగా గడుపుతున్నారు. కానీ ఎంతలా దీనికి అలవాటు పడితే మన ఆరోగ్యంపై అంత ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు.. ఇది కుటుంబ బంధాలను సైతం దెబ్బతీస్తుంది.. పనిలో నాణ్యతను తగ్గిస్తుంది.. చదువుపై ఆసక్తినీ కోల్పోయేలా చేస్తుంది.. అలాగే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో అవాస్తవాలే ఎక్కువగా ఉంటున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటి వాటిని నమ్మడం, వాటిని ఇతరులకు పంపించడం వల్ల ఇద్దరికీ మానసిక సమస్యలు తప్పవు. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే గ్యాడ్జెట్స్‌ని వినియోగించుకోవాలి.
ఒకవేళ టైంపాస్ కోసమే డిజిటల్‌ని ఆశ్రయిస్తున్నట్లయితే.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. ఈ క్రమంలో మీకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపచ్చు. ఆటలు, పాటలు, కళలు.. వంటి అంశాల్లో మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇక వృత్తిరీత్యా ఆన్లైన్లో ఉండేవాళ్లు.. తమ పని పూర్తైన తర్వాత ఇలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టచ్చు. ఆలోచించాలే గానీ ఇలాంటి ఆప్షన్స్ బోలెడున్నాయి. వీటివల్ల డిజిటల్ ప్రపంచం నుంచి కాస్త విరామం దొరకడంతో పాటు శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది.

8-8-8 రూల్!
రోజులో ఉండేదే 24 గంటలు. అందులోనూ 2/3 వంతు డిజిటల్ ప్రపంచంలోనే మునిగి తేలితే ఇక నిద్రెప్పుడు పోతారు? ఇతర పనులన్నీ ఎప్పుడు పూర్తిచేసుకుంటారు? ఇలా నిరంతరం గ్యాడ్జెట్స్ మాయలో పడిపోయి చాలామందికి నిద్ర కరవవుతుంది. తద్వారా ఆరోగ్యానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అటు మీ పనిని, ఇటు నిద్రను, మీ కంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి.. ఇలా అన్నింటినీ సమన్వయం చేయాలంటే ‘8-8-8 రూల్’ పాటించాల్సిందే! అంటే.. 8 గంటలు మీ వృత్తికి, 8 గంటలు గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టేసి హాయిగా నిద్ర పోవడానికి, మరో ఎనిమిది గంటలు ఇంటి పనులు పూర్తి చేసుకొని మీకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి వినియోగించండి.. ఇలా బ్యాలన్స్ చేసుకోగలిగితే జీవితం ఎంత ప్రశాంతంగా సాగుతుందో మీకే తెలుస్తుంది.

గ్యాడ్జెట్స్‌కీ వీక్లీ-ఆఫ్!
వృత్తిరీత్యా మనకు వారాంతాల్లో ఒకటి లేదా రెండు రోజులు సెలవులుంటాయి.. కానీ గ్యాడ్జెట్స్‌కు మాత్రం మనం ఒక్క పూటైనా సెలవివ్వం. ఇలా నిర్విరామంగా పనిచేయడం వల్ల అవి అలసిపోతాయో లేదో గానీ.. మనమైతే విపరీతంగా అలసిపోవడం ఖాయం. ఎందుకంటే వారంలో ఐదారు రోజులు పనిలో భాగంగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతాం.. డిజిటల్ లోకంలోనే విహరిస్తాం.. తద్వారా ఎదురయ్యే ఒత్తిడి నుంచి రిలాక్సవడానికే వారాంతాల్లో వచ్చే సెలవులు ఉపయోగపడతాయి. అలాంటిది అప్పుడు కూడా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతామంటే ఎలా చెప్పండి? ఇలా అయితే మానసిక ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది?
అందుకే వారాంతాల్లో మీరు కూడా మీ గ్యాడ్జెట్స్‌కి వీక్లీ-ఆఫ్ ఇచ్చేయండి..! మరీ రోజంతా అంటే కష్టమనుకుంటే కనీసం ఓ పూటైనా వాటిని కనికరించండి! ఆ సమయంలో హాయిగా నిద్ర పోండి.. కాసేపు వ్యాయామం చేయండి.. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి.. ఇలా కనీసం వారానికొకసారైనా అలవాటు చేసుకున్నారంటే మీలోని ఒత్తిళ్లు, ఆందోళనలు అన్నీ హుష్‌కాకి అయిపోవాల్సిందే! శరీరానికైనా, మనసుకైనా ఇంతకుమించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి!

అనవసరంగా ముప్పు కొని తెచ్చుకోవద్దు!
సోషల్ మీడియా ఉపయోగించడం ఇప్పుడు అందరికీ కామనైపోయింది. అయితే వాటిని అవసరం కోసం వినియోగించుకొనే వారు కొందరైతే.. టైంపాస్ అంటూ వాటి వెంట పడే వారు మరికొందరు. దేన్నైనా అతిగా వాడితే మొదటికే మోసమొస్తుంది. ఉదాహరణకు.. అవసరం లేకపోయినా కొంతమంది ప్రతి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీనికి తోడు చిన్న పిల్లల ఫొటోలు, సమాచారం కూడా అందులో షేర్ చేస్తుంటారు. అసలే ఆన్లైన్ మోసాలు, ఫొటో మార్ఫింగ్స్, ఖాతాల్ని హ్యాక్ చేసి వాటిని దుర్వినియోగపరచడం.. వంటివి ఎక్కువగా జరుగుతోన్న ఈ రోజుల్లో సోషల్ మీడియాను వీలైనంత తక్కువగా వాడుకోవడం ఉత్తమం. అది కూడా అవసరమైతేనే అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని అందరికీ కనిపించేలా కాకుండా ప్రైవేట్‌గా ఉంచుకోవడం.. ఇలా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా అవసరమున్నప్పుడే వాటిని వినియోగించుకుంటాం కాబట్టి స్క్రీన్ టైమ్‌ని కాస్త తగ్గించచ్చు.. ఆ విలువైన సమయంలో మరో పని పూర్తిచేసుకోవచ్చు. ఇది శారీరకంగా, మానసికంగా మనకు ప్రశాంతతను అందిస్తుంది.
ఇవి కూడా!

* చాలామంది ఖాళీగా కూర్చున్నారంటే చాలు.. చేతులు ఫోన్ దగ్గరికే పరుగులు పెడతాయి. అదే మనం అనుకున్న పనులన్నింటినీ ఓ ప్లాన్ ప్రకారం పూర్తిచేశామంటే ఖాళీగా, బద్ధకంగా కూర్చునే అవసరమే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికీ రోజువారీ ప్రణాళిక తప్పనిసరి. దాని ప్రకారమే వ్యాయామం, ఆఫీస్ పని, ఇంటి పని, పిల్లల బాధ్యత, కుటుంబంతో గడపడం, నిద్రపోవడం.. వీటన్నింటినీ బ్యాలన్స్ చేసుకోవచ్చు.. తద్వారా డిజిటల్ ప్రపంచంలో విహరించే సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. * ఫోన్, ల్యాపీ.. ఇలా వీటిని మన ఖాళీ సమయాల్లో కూడా వెంటే ఉంచుకోవడం వల్ల పదే పదే వాటిపైకే మన దృష్టి మళ్లుతుంది. అందుకే డిజిటల్ డీటాక్స్‌లో భాగంగా వాటిని మన కంటికి కనిపించనంత దూరంగా పెట్టేయడం మంచిది. తద్వారా మనం చేసే ఇతర పనులపై పూర్తి శ్రద్ధ పెట్టచ్చు. * డిజిటల్ డీటాక్స్‌ని ఇంట్లో మీరొక్కరే పాటిస్తూ.. ఇతరులు విచ్చలవిడిగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతున్నారనుకోండి.. మీకూ వాటిపైకే మనసు మళ్లుతుంది. కాబట్టి ఇంట్లో అందరూ పాటించేలా ఒక నియమం పెట్టుకోండి.. కావాలంటే ‘ఈ పద్ధతిని ఎవరు ఎక్కువ సేపు పాటిస్తారో చూద్దాం..!’ అంటూ ఓ ఛాలెంజ్ విసురుకోండి.. ఈ సమయంలో అందరూ కలిసి ఏదో ఒక గేమ్ ఆడడం, వంటలో ఒకరికొకరు సహాయపడడం.. వంటివి చేయచ్చు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. అనుబంధాలూ దృఢమవుతాయి.
|
‘అమ్మో.. గ్యాడ్జెట్స్ ఉపయోగించకుండా మేం ఒక్క క్షణం కూడా ఉండలేం!’ అనుకునే వాళ్లు ఈ నియమాలు పాటించండి.. ఒక్క రోజు కాదు.. వీటిని రోజువారీ అలవాటుగా మార్చుకోండి.. కొన్ని రోజుల్లో తేడా మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే డిజిటల్ డీటాక్స్ పద్ధతిని పాటిస్తున్నట్లయితే.. ఆ చిట్కాలేంటో ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి.. నలుగురిలో స్ఫూర్తి నింపండి!