తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే... గురువు ఆ జీవితంలో ఎదగడానికి కావాల్సిన విద్యా బుద్ధులు, క్రమశిక్షణ, జ్ఞానాన్ని అందిస్తారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ... అంటూ అమ్మానాన్నల తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇస్తాం. ఈ క్రమంలో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ రోజున ఎంతోమంది తమ జీవితానికి బంగారు బాటలు వేసిన గురువులను తలచుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు తమ జీవితాల్లోని గురువులను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆ విశేషాలేంటో చూద్దామా!
మీరే మా హీరోలు!
ఈ ప్రపంచానికి మీరు కేవలం ఒక టీచర్ మాత్రమే కావొచ్చు. కానీ మీ విద్యార్థులకు మాత్రం మీరే ఓ హీరో. పిల్లల ఆలోచనలను, స్మజనాత్మకతను ప్రోత్సహిస్తూ ప్రేమను పంచుతున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా ‘ఏకమ్’ ఎర్లీ లెర్నింగ్ స్కూల్ కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి మీరు చూపిస్తున్న కృషి నాకెంతో స్ఫూర్తినిస్తోంది.
- సమంత
జీవితాన్ని మించిన గురువు లేరు!
ఒకసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే జీవితాన్ని మించిన గురువు లేరనిపిస్తుంది. నవ్వు నుంచి ఏడుపు వరకు జీవితం మనకు ప్రతి ఒక్కటీ నేర్పుతుంది. మనమెప్పుడూ వూహించని పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది. హ్యాపీ టీచర్స్ డే!
- మంజుల ఘట్టమనేని
అప్పుడు నాకు టీచర్ల విలువ బాగా అర్థమైంది!
మన జీవితాల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు కేవలం థ్యాంక్స్ మాత్రమే చెబితే సరిపోదు. మన జీవితంలో టీచర్లు పోషించిన పాత్రను వివరించడానికి మాటలు చాలవు. అయితే ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా తీసుకుని నా గురువులందరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. నాకు ఫిజిక్స్ పాఠాలు నేర్పిన రాధా మిస్ ఫొటో అదృష్టవశాత్తూ నా దగ్గర ఉంది. . నాకు ఫిజిక్స్ పాఠాలు నచ్చనప్పటికీ ఆమె మాత్రం నా ఫేవరెట్ టీచర్. ఆమె నవ్వుతూ తరగతి గదిలోకి రాగానే క్లాస్ రూం అంతటా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయేది. అలా నవ్వడం నేను ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇటీవల నేను చదువుకున్న స్కూల్‌ను సందర్శించగా ఆమె ఇప్పటికీ అక్కడే ఉన్నారు. లాక్డౌన్లో నా కుమారుడిని భరించడానికి ఎంతో సహనం కావాల్సి వచ్చింది (నవ్వుతూ). అప్పుడు నాకు ఉపాధ్యాయుల విలువ బాగా అర్థమైంది. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఈ ప్రత్యేకమైన రోజున మీ టీచర్లను సంప్రదించి, శుభాకాంక్షలు చెప్పండి. బంగారు భవిష్యత్ కోసం పిల్లల ఆలోచనలకు పదును పెడుతున్న వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!
- శిల్పాశెట్టి
వారు నా జీవితాన్ని తీర్చిదిద్దారు!
‘నేను మొదటి తరగతిలో ఉన్నప్పుడు దిగిన ఫొటో ఇది. క్లాస్ యాన్యువల్ డే సందర్భంగా మేం చేసిన పహడీ నట్టిని (డ్యాన్స్) మెచ్చుకుని మా టీచర్లు మాకు బహమతి ప్రదానం చేశారు. వీరే కాదు... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందరో ఉపాధ్యాయులు నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. వారందరికీ నా ధన్యవాదాలు! హ్యాపీ టీచర్స్‌డే!’
- కంగనా రనౌత్
థ్యాంక్యూ టీచర్స్!
‘గురువులే లేకపోయి ఉంటే ఈ ప్రపంచంలో మరి ఏ ఇతర వృత్తులూ ఉండేవి కావు!’
- బిపాసా బసు
టీచర్లందరికీ నా సెల్యూట్!
ఎందరో టీచర్ల నుంచి జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకున్నాను. మాకు మంచి నడవడికను నేర్పిన టీచర్లందరికీ నా సెల్యూట్. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని మేం కూడా ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేందుకు ప్రయత్నిస్తాం! హ్యాపీ టీచర్స్ డే!
- నిమ్రత్ కౌర్
అమ్మా... నువ్వు చూపించిన మార్గంలోనే!
అమ్మా... నువ్వు చూపించిన మార్గంలోనే ప్రయాణం మొదలుపెట్టాను. నా లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ నీ స్ఫూర్తితో కచ్చితంగా అందుకుంటాను. హ్యాపీ టీచర్స్‌డే మై టీచర్ (ప్రొఫెసర్ సరోజ్ సూద్)!
- సోనూ సూద్