ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా ప్రస్తుతం భారతదేశంలో ఉగ్రరూపం చూపిస్తోంది. ‘అన్‌లాక్’ అంటూ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులివ్వడంతో కరుణ లేకుండా అందరిపై విరుచుకుపడుతోంది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వైరస్ బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా ప్రముఖ బాక్సర్ లైశ్రమ్ సరితా దేవి, బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
‘అన్‌లాక్’ ప్రక్రియలో భాగంగా క్రీడాకారుల సాధనకు, శిక్షణకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో భాగంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే పలు నగరాల్లో శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పటికే స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి, హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్ తదితర క్రీడాకారులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మణిపూర్ స్టార్ బాక్సర్ సరితా దేవి, ఆమె భర్త తోబియా సింగ్ ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరారు. ప్రస్తుతం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారీ దంపతులు.

కండరాల్లో నొప్పి మొదలైంది!
‘నేను మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. కొద్దిగా జలుబు, ఒళ్లు నొప్పులు కూడా బాధిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నా సోదరుడి భార్య ప్రసవించడంతో అతడి ఇంటికి వెళ్లాను. కొద్ది రోజులు అక్కడే ఉండి ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాను. అక్కడి నుంచి వచ్చాక మొదటి రెండు రోజులు కూడా బాగానే గడిచాయి. అయితే మూడో రోజు హఠాత్తుగా కండరాల్లో నొప్పి మొదలయ్యింది. అనుమానమొచ్చి నేను, నా భర్త కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందులో మా ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారితమైంది. వెంటనే మా ఎనిమిదేళ్ల కుమారుడు తోమ్థిల్తో పాటు ఇతర కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయించాం. అయితే అదృష్టవశాత్తూ మా ఫ్యామిలీలో మరెవరికీ ఈ మహమ్మారి సోకలేదు. ఈ విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చిందీ బాక్సింగ్ క్వీన్.
అలా అందరి దృష్టిని ఆకర్షించింది!
మణిపూర్‌కు చెందిన 38 ఏళ్ల సరిత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం ఎనిమిది మెడల్స్ సాధించింది. 2006లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ స్టార్ బాక్సర్ 2005, 2008 ప్రపంచ ఛాంపియన్ టోర్నీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటిన సరిత అదే ఏడాది ఏషియన్ గేమ్స్ ఫైనల్లో వివాదాస్పద రీతిలో ఓటమిపాలైంది. ఈక్రమంలో అంపైర్ తప్పిదంతోనే తాను ఓడిపోయానంటూ సిల్వర్ మెడల్‌ను తిరస్కరించి అందరి నోళ్లల్లో నానింది. ఇక ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ ట్రయల్స్ లోనూ నిరాశపరిచిన సరిత అప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయింది.
వారందరి స్ఫూర్తితో త్వరలోనే కరోనాను జయిస్తాం!
సరిత కుటుంబానికి సన్నిహితుడు, మాజీ బాక్సర్ డింగ్కో సింగ్ ఈ ఏడాది జూన్‌లో కరోనా బారిన పడ్డాడు. క్యాన్సర్ బాధితుడైన అతడు నెల రోజులు కరోనాతో పోరాటం చేసి కోలుకున్నాడు. ఈ సందర్భంగా డింగ్కో సింగ్ స్ఫూర్తితోనే కరోనాపై విజయం సాధిస్తానంటోంది సరిత. ‘కొవిడ్ ఆస్పత్రికి బయలుదేరుతున్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నా కుమారుడికి సూచించాను. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తామని సముదాయించాం. ఆస్పత్రికి వచ్చాక కూడా నిరంతరం వాడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రస్తుతం నేను, నా భర్త సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఈ వైరస్ బారిన పడ్డ బాధితులందరూ క్రమంగా కోలుకుంటున్నారని, మరణాల రేటు కూడా తక్కువగా ఉందని వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్‌లో చూస్తున్నాం. ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరిన హాకీ క్రీడాకారులందరూ కోలుకుని ఇంటికి వెళ్లారని విన్నాను. ఇక జూన్‌లో క్యాన్సర్ బాధితుడైన డింగ్కో సింగ్ ఈ వైరస్‌పై విజయం సాధించారు. వీరందరి స్ఫూర్తితో మేం కూడా త్వరలోనే ఈ కరోనాను జయిస్తాం. ప్రస్తుతం వైద్యులు సూచించిన మందులను వాడుతున్నాం. అదేవిధంగా వారు చెప్పిన జాగ్రత్తలన్నింటినీ పాటిస్తున్నాం’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ బాక్సింగ్ క్వీన్.
నేను కూడా కరోనా బాధితుల్లో చేరాను!

ఇక బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటోన్న ఆమె ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘కరోనా పాజిటివ్ కేసుల్లో నేను కూడా చేరాను. కానీ నాకు తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వైరస్ నన్ను వదిలేస్తుందనే అనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారామె. ఈ సందర్భంగా సౌమ్యా స్వామినాథన్, శశిథరూర్, ఆనంద్మహీంద్రా, నవీన్ జిందాల్ తదితర ప్రముఖులు ‘బయోక్వీన్’ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.