పదహారేళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాల మీద మోసిన మహేంద్ర సింగ్ ధోనీ మాయాజాలం ఇక అంతర్జాతీయ క్రికెట్లో కనిపించదు. ఆటగాడిగానే కాదు అంతకంటే అత్యద్భుత నాయకుడిగా జట్టకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన ఈ కూల్ కెప్టెన్ ఎలాంటి హంగు, అర్భాటం లేకుండానే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. భారత క్రికెట్ జట్టు రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఈ మహేంద్రుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. అతడి నిర్ణయంతో క్రికెట్ అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోగా, ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అతని సేవలను కొనియాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేసింది.
ధోనీ, సాక్షి సింగ్‌లది ప్రేమ వివాహమని అందరికీ తెలిసిందే. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ సుమారు పదేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కారు. ఈ దంపతులకు జీవా అనే ఓ ఐదేళ్ల కూతురు ఉంది. ఈక్రమంలో తన భర్త రిటైర్మెంట్పై స్పందించిన సాక్షి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భావాలను అందరితో పంచుకుంది.
కచ్చితంగా... కంటతడి పెట్టుంటావ్!
‘నువ్వు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉండాలి. ఆటకు అత్యుత్తమ సేవలు అందించినందుకు అభినందనలు. నువ్వు సాధించిన విజయాలు, నీ వ్యక్తిత్వాన్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే సమయంలో నువ్వు కచ్చితంగా కంటతడి పెట్టుంటావని అనుకుంటున్నా. భవిష్యత్‌లో నువ్వు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది సాక్షి. దీంతో పాటు అమెరికన్ రచయిత్రి మాయా ఏంజెలో చెప్పిన ‘నువ్వు చెప్పిన మాటలను, చేసిన పనులను ప్రజలు మరిచిపోవచ్చు. కానీ నువ్వు పంచిన అనుభూతిని వాళ్లు ఎప్పటికీ మరవలేరు’ అనే మాటలను మరోసారి గుర్తు చేసిందామె.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు మహేంద్రుడి సేవలను కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తమ భావాలను పంచుకున్నారు.
‘ధోనీ నువ్వో లెజెండ్‌వి. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ ప్లేయర్లలో నువ్వూ ఒకడివి. ఆన్ ఫీల్డ్ అయినా, ఆఫ్ ది ఫీల్డ్ అయినా నీ వ్యక్తిత్వం మాకు ఆదర్శం. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత నీ భవిష్యత్ మరింత బాగుండాలని కోరుకుంటున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఓ క్రీడాకారిణిగా అయినందుకు గర్విస్తున్నా’
- సానియా మీర్జా
‘ప్రపంచకప్‌ను చూడాలనుకున్న కోట్లాది భారతీయుల కలను రెండుసార్లు నిజం చేశావు. మైదానంలో ప్రశాంతంగా ఆలోచిస్తూనే వేగంగా నిర్ణయాలు తీసుకుని అందరితో ‘కూల్ కెప్టెన్’ అనిపించుకున్నావు. నీ ఆట తీరు, వ్యక్తిత్వంతో నువ్వు ధరించిన ఏడో నంబర్ జెర్సీ కూడా గర్వపడి ఉంటుంది. నీ సేవలకు గుర్తుగా ఏడో నంబర్ జెర్సీకి కూడా శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించాలి. భారత క్రికెట్లో అద్భుత ప్రయాణం సాగించిన నీకు అభినందనలు.’
- మిథాలీ రాజ్
‘భారత క్రికెట్లో మీ ప్రయాణం అద్భుతం. క్రికెట్ కోసం మీరు అందించిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. మీ భవిష్యత్ మరింత బాగుండాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఇంకా బ్లూ జెర్సీలో చూడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది.’
- స్మృతీ మందాన
‘ధోనీ... మీరు ఒక తెలివైన కెప్టెన్, అద్భుతమైన ఆటగాడు, నమ్మదగిన సహచరుడు...ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మాస్టర్. సంక్షిప్తంగా చెప్పాలంటే మీరొక నిజమైన జెంటిల్మన్. భారత క్రికెట్ జట్టులో మీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు.’
- ఐశ్వర్యా రాజేష్
‘భారత క్రికెట్లో ఒక అధ్యాయం ముగిసింది’ - తాప్సీ
‘ధోనీ... భారత క్రికెట్లో నువ్వో దిగ్గజం. అసాధారణ ఆటగాడిగా రాణించావు. నాయకుడిగా అందరిలో స్ఫూర్తిని పంచావు. మైదానంలో అయినా, వెలుపల అయినా నువ్వొక అద్భుతమైన వ్యక్తివి. దేశం కోసం నువ్వు చేసిన సేవలకు ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయాణం మరింత బాగుండాలని కోరుకుంటున్నా.’
- సోఫీ చౌదరి
‘అద్భుతమైన ఆటతోనే కాదు ... మీ వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. భారత క్రికెట్లో మీ ప్రయాణం మాకెంతో ఆదర్శం.’
- యామీ గౌతమ్
‘తన మ్యాజిక్‌తో భారత క్రికెట్ రూపు రేఖలను సమూలంగా మార్చేసిన ధోనీకి ధన్యవాదాలు’ - స్మృతి ఇరానీ