సురుచికి నెలసరి అంటేనే విపరీతమైన భయం. కారణం.. తనకు ఆ సమయంలో భరించలేనంత కడుపు నొప్పి రావడమే! తొలిరోజు ఆఫీసుకు వెళ్లలేదు.. ఇంట్లో ఉన్నా సరే నొప్పితో విలవిల్లాడిపోతుంటుంది. అలాగని ‘నేను నెలసరి నొప్పి వల్ల ఈ రోజు ఆఫీస్‌కి రాలేకపోతున్నాను..’ అని చెప్పడానికి సిగ్గు, బిడియం. అందుకే నెలనెలా ఏదో ఒక కారణం చెప్పి ఆ సమయంలో ఇంట్లోనే ఉండిపోతుంటుంది.
మానసి పనిచేసే ఆఫీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. పిరియడ్స్ సమయంలో ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే.. వారికి అసలు విషయం చెప్పలేక ఆఫీస్‌కి వెళ్తుంటుంది. ఇక మరీ భరించలేనంత నొప్పి, లేదంటే నీరసం ఉంటే మాత్రం ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు సెలవు తీసుకుంటుంది.
మన మహిళా ఉద్యోగులందరికీ ఇవన్నీ కామనే! నెలసరి సమయంలో కలిగే నొప్పి వల్ల సెలవు పెట్టాల్సి వస్తే.. దానికి అసలు కారణం చెప్పకుండా ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజుకు అలా గడిస్తే చాలనుకుంటాం. ఎందుకంటే పిరియడ్స్ గురించి బయటికి చెప్పడానికి సిగ్గు, బిడియం అడ్డొస్తుంటాయి.. ఇలా చెబితే ఎవరేమనుకుంటారోనన్న మొహమాటమే మన నోటికి తాళం వేస్తుంటుంది. అయితే అలాంటి భయం, మొహమాటం పక్కన పెట్టమంటున్నారు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపీందర్ గోయల్. ‘తాము నెలసరిలో ఉన్నాం.. సెలవు తీసుకుంటున్నామ’నే కారణాన్ని ధైర్యంగా, నిర్మొహమాటంగా చెప్పి మరీ సెలవు తీసుకోమంటూ ఏడాదికి పది ‘పిరియడ్ లీవ్స్’ని తాజాగా తమ మహిళా ఉద్యోగులకు అందించారు గోయల్. ఈ నేపథ్యంలో ఆ సెలవుల నియమనిబంధనల్ని వివరిస్తూ తమ మహిళా ఉద్యోగులందరికీ ఓ సుదీర్ఘ మెయిల్ రాశారాయన. తమ అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

తరాలు మారుతున్నా, అందరి ఆలోచనల్లో మార్పులొస్తున్నా నెలసరి అంటే మాత్రం కొందరు ఇంకా దాన్నో శాపంగానే చూస్తున్నారు. ఆ సమయంలో ఇంట్లోకి రానివ్వకపోవడం, వస్తువుల్ని తాకనివ్వకపోవడం, కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. ఇక కనీసం దాని వల్ల ఎదురయ్యే అసౌకర్యాన్ని నలుగురితో చెప్పుకోవాలన్నా కొంతమందికి ఇబ్బందే! ఇలా చెబితే ఎవరేమనుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారోనన్న మొహమాటమే ఇందుకు కారణం.
అయితే ఇలాంటి వివక్ష తమ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులపై చూపకూడదనుకున్నారు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో. అందుకే వారికి సంవత్సరానికి 10 పిరియడ్ లీవ్స్ని అమలు చేస్తూ తాజాగా ప్రకటన చేశారు. అంతేకాదు.. ‘మేం పిరియడ్‌లో ఉన్నాం.. సెలవు తీసుకుంటున్నాం..’ అని నిర్మొహమాటంగా చెప్పి మరీ సెలవు పెట్టే స్వేచ్ఛను వారికి అందించారాయన.
10 సెలవులే ఎందుకంటే?!
తాజాగా (ఆగస్టు 8 నుంచి) అమల్లోకి వచ్చిన ఈ పిరియడ్ లీవ్ నియమ నిబంధనల్ని వివరిస్తూ తమ మహిళా ఉద్యోగులందరికీ ఓ సుదీర్ఘ మెయిల్ రాశారు గోయల్. ఈ లేఖ సారాంశమేంటంటే..!
ప్రియమైన మహిళా ఉద్యోగులారా,
‘ఈ రోజు నాకు అనారోగ్యంగా ఉంది.. అందుకే సెలవు తీసుకుంటున్నా’ అని మీరు మీ టీమ్‌కి ఎన్నోసార్లు సందేశం పంపించి ఉంటారు. అదేంటని అడిగితే కడుపునొప్పి అనో లేదంటే నీరసంగా ఉందనో.. ఏదో ఒక కారణం చెప్పి అసలు విషయాన్ని దాటేసి ఉంటారు. కానీ ‘ప్రస్తుతం నేను నెలసరిలో ఉన్నాను.. విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాను.. ఈ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నాకో హీటింగ్ ప్యాడ్ కావాలి, శక్తి కోసం గ్రీన్ టీ తాగాలనుంది.. మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడడానికి చాక్లెట్ తినాలనిపిస్తోంది.. అందుకే ఈ రోజు నేను సెలవు తీసుకుంటున్నాను’ అని ఎన్నిసార్లు మీ టీమ్‌కి మీరు సందేశం పంపించి ఉంటారు? కానీ ఇకపై నిజమే చెప్పండి.

నమ్మకం, నిజం, అంగీకారం.. ఈ మూడు అంశాలు మూలస్తంభాలుగా ముందుకు సాగుతోంది జొమాటో. అందుకే ఈ రోజు (ఆగస్టు 8) నుంచి మన మహిళా ఉద్యోగులందరికీ (ట్రాన్స్‌జెండర్స్‌తో సహా) ఏడాదికి 10 సెలవుల్ని ‘పిరియడ్ లీవ్స్’ పేరుతో అందిస్తున్నాం.
* పదే ఎందుకంటే? - చాలామంది మహిళలకు ఏడాదికి 14 రుతుచక్రాలొస్తుంటాయి. అందులో కొన్ని వారాంతాల్లో కూడా రావచ్చు. అప్పుడు ఎలాగో సెలవు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటిని సాధారణ రోజులతో అడ్జస్ట్ చేసుకొని మొత్తంగా ఏడాదికి 10 సెలవుల్ని అందిస్తున్నాం. అంటే పురుషుల కంటే మహిళలు అదనంగా 10 సెలవుల్ని వినియోగించుకోవచ్చన్నమాట!
* ఒక్కో రుతుచక్రానికి ఒక్కో సెలవు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
* పురుషులకు, మహిళలకు జీవ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ క్రమంలో పనిపై ప్రతికూల ప్రభావం పడకుండా, పనిలోని నాణ్యత తగ్గకుండా చూసుకోవడం మా విధి.. అందుకే మహిళలకు అదనంగా ‘పిరియడ్ లీవ్స్’ అందిస్తున్నాం.
* పిరియడ్ లీవ్ పెట్టుకునేటప్పుడు మహిళా ఉద్యోగులు సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ‘మేం ఈ రోజు పిరియడ్ లీవ్ తీసుకుంటున్నాం’ అని నిర్మొహమాటంగా మీ బృంద సభ్యులకు చెప్పచ్చు.. లేదంటే ఈ-మెయిల్ పంపొచ్చు.
* అయితే ఈ క్రమంలో మీకు మీ తోటి ఉద్యోగుల (మహిళలు లేదా పురుషులు) నుంచి ఎలాంటి కామెంట్లు, వేధింపులు ఎదురైనా సరే.. వాటి గురించి రిపోర్ట్ చేయచ్చు. దీంతో మన సంస్థకు చెందిన లైంగిక వేధింపుల నివారణ బృందం (POSH) వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకుంటారు.
* మీరు మరీ ఆఫీస్‌కి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సెలవుల్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
* ఈ సెలవుల్ని మీ వ్యక్తిగత అవసరాలు/పనుల కోసం ఉపయోగించుకోవద్దు.
* ఈ సమయంలో మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. తీసుకునే ఆహారం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించండి. తద్వారా శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారుకావచ్చు.

వారికి అండగా ఉందాం!
పురుష ఉద్యోగులారా! మన తోటి మహిళా ఉద్యోగులు పిరియడ్ లీవ్ తీసుకుంటున్నామని చెప్పినప్పుడు వారికి అసౌకర్యం కలిగించకుండా మన మద్దతును వారికి అందిద్దాం. పిరియడ్స్ అనేవి వారి జీవితంలో సర్వసాధారణం. ఆ విషయాన్ని అర్థం చేసుకొని మసలుకుందాం. ఆ సమయంలో వారు విశ్రాంతి కావాలని అడిగినప్పుడు వారిపై నమ్మకం ఉంచి వారికి పూర్తి మద్దతు పలుకుదాం. మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే నొప్పుల గురించి, వాటి తీవ్రత గురించి నేను అర్థం చేసుకోగలను. అందుకే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, పనుల్ని పంచుకుంటూ కంపెనీని మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. మహిళా ఉద్యోగుల్ని గౌరవిద్దాం!
ఇలా తమ మహిళా ఉద్యోగులకు అందించిన పిరియడ్ లీవ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు, ఈ సమయంలో పురుష ఉద్యోగులు తోటి మహిళా ఉద్యోగులతో ఎలా మసలుకోవాలో చెబుతూ సుదీర్ఘ ఉత్తరాన్ని రాశారు దీపీందర్. జొమాటో అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ అయిన ఈ లేఖ మహిళా ఉద్యోగులపై తమ సంస్థకున్న గౌరవాన్ని, ప్రతి మహిళా నెలసరిని శాపంగా భావించకూడదని, ఆ విషయాన్ని నలుగురితో ధైర్యంగా చెప్పగలగాలన్న విషయాలను చెప్పకనే చెబుతోంది. 2008లో హరియాణాలోని గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ సేవలందిస్తోంది. అంతేకాదు.. మహిళలకూ పురుషులతో సమాన అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వాన్ని చాటుతోంది.
Also Read: అందుకే ‘పిరియడ్ లీవ్’ కూడా ఇస్తున్నాయి !