ఆత్మాభిమానం నిండు కుండలా నడిచొస్తే ఎలా ఉంటుందో వీరిద్దరూ కలిసొస్తే అలా ఉంటుంది. ఒకరు మైక్ పట్టి తన మాటలతో ఎన్నో హృదయాలను పలకరిస్తే.. మరొకరు తన హృద్యమైన పాటలతో అవే హృదయాలను పరవశింపజేస్తారు. వారే స్టార్ యాంకర్ ఝాన్సీ, స్టార్ సింగర్ సునీత. మరి మాటలు, పాటలతో మైమరపించే ఈ అందాల తారలు ఒకేచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. నిజ జీవితంలో మంచి స్నేహితులైన వీరిద్దరు తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. షేర్ చేసుకున్నారు.
మీరు వయసులో ఉండగా ‘నీలి నీలి ఆకాశం ఎవరికైనా ఇద్దామనుకున్నారా’?
సునీత: అప్పుడు ఇలాంటివి చూసే అవకాశం ఎక్కడిది. ఎటూ చూసే దాన్ని కాదు.. నా దారి రహదారి. అయితే తల దించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. రోడ్డు కనిపించేలా తల దించుకుంటే చాలు. పుట్టి పెరిగిందంతా గుంటూరులోనే. నా చదువు కూడా అక్కడే పూర్తయింది.
కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో స్టోరీలు, మీకు వీరాభిమానులు ఎవరైనా ఉన్నారా?
సునీత: ఏమైనా క్రియేట్ చేసి చెప్పమంటారా? ఇక అభిమానులంటారా.. ఎప్పుడూ ఉన్నారు.
ఝాన్సీ: అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆమెకు ఆ అభిమానులు ఉన్నారు.
మీరిద్దరూ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?
ఝాన్సీ: శాటిలైట్ ఛానళ్లు మొదలైన తర్వాత ఏ ఛానల్, ఎవరి షో అయినా సారథి, భాగ్యనగర స్టూడియోల్లో మాత్రమే జరిగేది. ఎవరికి పని ఉన్నా, లేకపోయినా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్లం. అలా సునీత ‘నవరాగం’ చేస్తే నేను ఆడియన్స్‌లో కూర్చొనేదాన్ని. నేను క్విజ్ చేస్తే తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేది.
ఝాన్సీ లక్ష్మి.. ఈ పేరు ఎవరు పెట్టారు?
ఝాన్సీ: మా ఇంట్లో వాళ్లే పెట్టారు. ప్రస్తుతం లక్ష్మి లేదు కాబట్టి, నా పేరు వెనుక ఆ పదం లేదు!
మీ పేరు వెనుకా.. ముందు ఏవైనా ఉన్నాయా?
సునీత: ఏమీ లేవండి..
ఈ మధ్య మీరు బాగా రెబల్ అయిపోయారట!
సునీత: మీరు ఏదైనా అడగండి. నా సమాధానం బట్టి మీరే తేల్చుకోవచ్చు. కొన్నిసార్లు తప్పడం లేదు.
ఝాన్సీ: నాదే ట్రైనింగ్.
ఇండస్ట్రీలో మీకు ఎలా బ్రేక్ వచ్చింది?
సునీత: మొదట ‘గులాబీ’, ఆ తర్వాత ‘ఎగిరే పావురమా’ మంచి పేరు తెచ్చాయి.
ఝాన్సీ: ‘ఎగిరే పావురమా’ చిత్రంలో నేను కూడా నటించా. అందులో ‘దిస్ ఈజ్ ది రిథమ్ ఆఫ్ ది లైఫ్’ అనే ఒక పాట కూడా పాడా. మళ్లీ ‘నువ్వు పాట పాడు’ అని అడక్కుండా చేసిన సీన్ అది (నవ్వులు)..
సునీత: ఆ సినిమాలో ఝాన్సీ పాడిన తర్వాత హీరోయిన్ పాడే పాట నేనే పాడా..
ఇటీవల మీరు ఇంత రెబల్‌గా మారడానికి కారణం ఏంటో చెప్పలేదు?
సునీత: రెబల్ కాదండీ. మొదటి నుంచి నాకో పద్ధతి ఉంది. ఏ విషయాన్నైనా పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఒక వేళ మాట్లాడితే దాని చుట్టూ వేరే స్టోరీలు అల్లుతారని ఊరుకున్నా. అయితే, ఆత్మగౌరవం దెబ్బతినే సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా లేను. కాబట్టి, అవి బయటకు చెప్పుకునే అలవాటు లేదు.
మీ బంధువు అని చెప్పి ఒకాయన డబ్బులు వసూలు చేసి మోసం చేశారట!
సునీత: చాలామంది సెలబ్రిటీలకు ఇది అనుభవమే. ఆయన ఏ ఉద్దేశంతో డబ్బులు వసూలు చేశారో తెలియదు. ఒకతను డబ్బులు అడుగుతుంటే ఇచ్చే వాడికి కనీస జ్ఞానం ఉండక్కర్లేదా?. అందులో కొందరు అమాయకులు కూడా ఉన్నారు. ఆ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి నా బంధువు అయి ఉంటే వారికి నా సొంత డబ్బులు ఇచ్చేదాన్ని. ఎందుకంటే జనాల్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అతను ఎవరికి కాల్ చేసినా వాళ్ల ట్రూ కాలర్‌లో సునీత ఉపద్రష్ట, సునీత సింగర్ అనే పడేది. మనుషులను ట్రాప్ చేయడానికి అదంతా ఒక ప్లాన్. చాలామంది సెలబ్రిటీలు ‘మీ నుంచి టెక్ట్స్ మెసేజ్ లు వస్తున్నాయండీ. మీతో చాట్ చేశామండీ’ అని కలిసినప్పుడు చెబుతుంటే చాలా సీరియస్ ఇష్యూ అనిపించింది. దీనికి ఒకేసారి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నా. ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు కదా! న్యాయపరంగా ఏది కరెక్ట్‌గా ఉంటుందో అదే చేశా.
ఈ ట్రైనింగ్ అంతా మీకు ఝాన్సీ ఇచ్చారా?
ఝాన్సీ: లేదు. అంతా పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేసింది. అప్పుడేమన్నానో తననే అడగండి.
సునీత: ‘నాతో ఒక మాట చెప్పాల్సింది కదా! సాయం చేసేదాన్ని’ అని అన్నది.
ఝాన్సీ: ప్రతి అమ్మాయి కూడా సునీతలాగే స్పందించాలి. సైబర్‌క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కార మార్గాలేంటో తెలుసుకోవాలి.
సునీత: అమ్మాయిలు చాలా ఈజీగా పడిపోతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరితో పడితే వాళ్లతో చాట్ చేస్తున్నారు. మెసేజ్ లకు సమాధానం ఇస్తున్నారు. కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి.
యాంకర్స్ అందరికీ మీరు గ్యాంగ్ లీడర్ట కదా! అంతేకాదు, మీలో చాలా టాలెంట్ ఉందట!
ఝాన్సీ: మీరు జోకులేయొద్దు. వాళ్లు వచ్చి నన్ను కొడతారు. ‘పెద్దలకు మాత్రమే’ అనే ప్రాజెక్టు ఒకటి చేస్తున్నా. ప్రస్తుతం కొవిడ్ మనకు ఎన్నో నేర్పించింది. అయితే నేను చేసే ప్రాజెక్టు అందరూ అనుకునేది కాదు. టెలివిజన్, వెబ్ సిరీస్‌లు వచ్చాక అడల్ట్ కంటెంట్ అనగానే ‘శరీరం, హింస, క్రైమ్, సెక్స్’ ఇలాగే ఆలోచిస్తున్నారు. వాటికి మించి మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెద్దవాళ్లమైపోయాము. ఆ విషయాలపై చర్చించాలనుకుంటున్నాం.
మీరు సింగర్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. మరి యాంకర్‌గా ఎప్పుడు మారారు?
సునీత: సింగర్‌గా నా కెరీర్ స్టార్ట్ అయింది. కానీ సందర్భాన్ని బట్టి అన్నీ సమాంతరంగా అలా జరిగిపోయాయి.
మీ ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా?
సునీత: అమ్మ, మేనత్త చిన్నప్పటి నుంచి సంగీత పాఠాలు చెప్పేవారు. మ్యూజిక్ టీచర్లు. మా ఇంట్లో సంగీతం తరతరాలుగా వస్తోంది. మా అమ్మాయి.. అబ్బాయి పాడతారు.
ఈ షోకు వచ్చేముందు మీరు ఏమైనా మాట్లాడుకున్నారా?
ఝాన్సీ: అవును మాట్లాడుకున్నాం. ‘షోకు ఏ చీర కట్టుకుని వస్తావు’ అని అడిగింది. ‘ఏదైనా కలర్ కాంబినేషన్లో వెళ్దామా’ అని నేను అడిగా.
సునీత: ఆ తర్వాత నేను చెబుతా. వీలైతే ‘నువ్వు కట్టుకునే చీర వాట్సాప్‌లో ఫొటో పెట్టు’ అని అడిగితే.. ‘నేను వాట్సప్ వాడటం లేదు’ అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయా. అదేంటి అని అడిగితే ‘డీటాక్స్. ఏడాదిన్నర క్రితం నుంచి నేను వాట్సప్ వాడటం లేదు’ అని చెప్పింది.
ఝాన్సీ: నేను ఆన్ అండ్ ఆఫ్ డిజిటల్ డీటాక్స్లోకి వెళ్తుంటా. ఎవరైనా మన జీవితంలోకి రావాలంటే అడిగి రావాలి. ప్రస్తుతం వాట్సప్ అవసరం ఉన్న మాట వాస్తవమే. అయితే, అవసరం లేని వాటి విషయాల్లో పడిపోతున్నాం. పడిపోయాం కూడా. అందుకే దూరంగా ఉండాలనుకున్నా. మరీ అత్యవసరమైతే మా ఇంట్లో ఎవరో ఒకరి నెంబరుకు పంపమని చెబుతా. ఆఫీస్‌కు సంబంధించిన వ్యవహారాల్లో నా టీమ్ మెంబర్లకు పంపితే చాలు. ఇక చీర విషయానికొస్తే సునీత ఏం చీర కట్టుకున్నా దానికి అందం వస్తుంది.
సునీత పాడిన పాటల్లో అద్భుతమైన పాట ఏది?
ఝాన్సీ: ‘చాలు చాలు..’ పాట చాలా బాగా పాడింది. ఈ విషయం చాలా సార్లు చెప్పా.
సునీత: ఝాన్సీ ఎప్పటి నుంచో నటిస్తోంది. ‘ఎగిరే పావురమా’ మొదటి చిత్రం. అప్పటి నుంచి మొన్నటి ‘మల్లేశం’వరకూ తీసుకుంటే ప్రతి పాత్రలోనూ ఎంతో పరిణతి చెందిన నటన కనబరుస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ వస్తోంది. విభిన్న పాత్రలు ఎన్నో పోషించింది. ఝాన్సీని ఒక మంచి ఫ్రెండ్‌గా ఎంత గౌరవిస్తానో, ఒక క్రియేటివ్ పర్సన్‌గా అంతే గౌరవిస్తా. మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోం.
ఝాన్సీ: ఏ విషయమైనా కూడా చేసేసిన తర్వాత కనెక్ట్ అవుతాం!
ఏం చదివావు ఝాన్సీ?
ఝాన్సీ: జీవితం (నవ్వులు). ప్రతి మనిషి జీవితం చదవాలి. లా చదివా.
ఝాన్సీ.. మీ ఫేవరెంట్ సింగర్ ఎవరు?
ఝాన్సీ: చిన్మయి గొంతు చాలా ఇష్టం. మేల్ సింగర్స్‌లో బాలు గారు.
సునీత: కచ్చితంగా బాల సుబ్రహ్మణ్యం గారు. ఫిమేల్ సింగర్స్‌లో జానకిగారు, శ్రేయా ఘోషల్.
మీ జీవితంలో ఎదురైన చెడు అనుభవాలను ఎలా ఎదుర్కొన్నారు?
ఝాన్సీ: జీవితం మనకు చాలా ఇస్తుంది. అనుభవం పాఠాలు నేర్పుతుంది. మనకు ఎదురైన చెడు అనుభవాల నుంచి వెతుక్కోవాలంటే అవే మళ్లీ మనకు ఎదురవుతాయి. సమస్య ఎదురైనప్పుడు ఎవరో వచ్చి పరిష్కరించాలని అనుకోకుండా మనమే పక్కకు జరిగి ముందుకు వెళ్తే, ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. నేను నా జీవితంలో తీసుకున్న నిర్ణయం ఒక క్లారిటీ కోసం తీసుకున్నా. కానీ, సామాజిక మాధ్యమాల్లో దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్ల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటంలో తప్పులేదు. అయితే, జరిగిన దానికి మరికాస్త జోడించి లేనిపోనివి మాకు అంటగట్టారు.
సునీత: ఝాన్సీ జీవితానికి, నా జీవితానికి చాలా సారూప్యతలు ఉన్నాయి.
ఝాన్సీ: వివాహ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన చాలా మంది మహిళలు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉండి ఉంటారు. ప్రతి ఒక్కరికీ వారి వారి స్థాయిలో సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా విమర్శ చేసే హక్కు ఉంది. అయితే ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి. వ్యక్తిని నాశనం చేసేలా ఉండకూడదు. శరీరం, వ్యక్తిత్వం పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఒక నింద వల్ల అనేక కుటుంబాలు కూలిపోయాయి.. ఇంకా కూలిపోతున్నాయి.
సునీత: మేము బలమైన మహిళలమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విపత్కర పరిస్థితుల నుంచి మేము బయటపడిన తీరే ఆ విషయాన్ని తెలియజేసింది. భగవంతుడు ఇచ్చిన టాలెంట్, అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రమంలో ఎన్ని కుక్కలు మొరిగినా, అసలు అలాంటి వాళ్లను కుక్కలతో పోల్చడం నాకు ఇష్టం లేదు. ఎవరూ నిజం ఏంటనేది తెలుసుకోరు. ‘ఇలా జరిగింది అట’ అనేది మాత్రం దావానలంలా వ్యాపిస్తుంది. ‘అట’ అన్నదానికి అంత పవర్ ఉందని నాకు తెలియదు. మేం ఇద్దరం దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. అప్పటి నుంచి మా జీవితంలో జరిగిన చాలా విషయాల్లో సారూప్యతలు ఉన్నాయి. అయితే, అవి సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడూ తలదించుకునే పనిచేయలేదు. ఇంకొకరికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేము. ఏదైనా విషయంపై మాపై ఆరోపణలు చేసినా, ఎవరితోనైనా లింకప్ చేసినా, మాట్లాడినా దానిపై స్పందించకపోవడానికి కారణం... అసలు నిజమేంటో మాకు తెలుసు. నా కుటుంబానికి తెలుసు. నేను సమాధానం చెప్పాల్సింది నా కుటుంబానికి మాత్రమే. వాళ్లందరికీ నా క్యారక్టర్ ఏంటో తెలుసు.
మీరెప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు!
ఝాన్సీ: ఈ ప్రశ్న అడిగినందుకు చాలా థ్యాంక్స్. జవాబు కంటే ప్రశ్నకు పవర్ ఎక్కువని నేను నమ్ముతా. ఆడియన్స్ కొన్ని వందల సమాధానాలు వాళ్లే చెప్పేసుకున్నారు. ఈ రోజు నేను ఏం చెప్పినా వాళ్లకు అవసరం లేదు (నవ్వులు).. ఒకవేళ ఎప్పుడైనా ‘నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనే’ అంటే, వాళ్లు ఊహించుకునే ఫొటోలు తారుమారు అయిపోతే తట్టుకోలేరు. అందుకే నేను చెప్పదలచుకోలేదు. చేసుకుంటే తప్పకుండా చెబుతా!
సునీత: ప్రస్తుతం నేను హాయిగా ఉన్నా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?
నీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది?
ఝాన్సీ: ‘తులసి’. అందులో పోషించిన పాత్ర గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది.