ఈవ్‌టీజింగ్ దగ్గర్నుంచి ప్రేమ పేరుతో వేధింపుల దాకా, లైంగిక హింస దగ్గర్నుంచి హత్యాచారం దాకా అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు ఓ అంతూ పొంతూ లేకుండా పోతోంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ చిన్నారులు/అమ్మాయిలు/మహిళలు ఏదో ఒక చోట, ఎలాగోలా ఆకతాయిల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇకపై అలాంటి ఆకతాయిల ఆగడాలు తాను పనిచేసే చోట మాత్రం సాగవంటున్నారు పోలీసాఫీసర్ వృందా శుక్లా. ప్రస్తుతం నోయిడా డీసీపీ (మహిళా రక్షణ)గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. అక్కడి మహిళల రక్షణ కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహిళలకు సంబంధించిన పలు ఇనీషియేటివ్స్‌తో తనదైన ముద్ర వేసిన వృందా.. ఇప్పుడు స్త్రీల రక్షణ కోసం మరోసారి నడుం బిగించి వార్తల్లో నిలిచారు. మరి, ఇంతకీ నోయిడాలో మహిళా రక్షణ కోసం ఈ ఐపీఎస్ ఆఫీసర్ చేపట్టిన ఆ కార్యక్రమమేంటి? దాని విశేషాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడవాళ్లు ఏదో ఒక రకంగా హింసకు గురవుతూనే ఉన్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఆగడాలు ఆగట్లేదు. ఇలా రాన్రానూ మహిళలకు రక్షణ కొరవడుతుందన్న విషయం మనం రోజూ చూసే కొన్ని సంఘటనల ద్వారానే తేటతెల్లమవుతుంది. అయితే తాను పనిచేసే చోట మాత్రం ఇలాంటి ఆకతాయిల ఆగడాలు సాగవని అంటున్నారు నోయిడా డీసీపీ వ్రిందా శుక్లా. 2014 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన ఈ మహిళా ఐపీఎస్.. తాజాగా నోయిడా మహిళల రక్షణ కోసం ‘స్వయం సిద్ధ’ పేరుతో పెట్రోలింగ్ యూనిట్‌ని ఏర్పాటుచేశారామె. ఈ ఇనీషియేటివ్‌ని నోయిడా కమిషనర్ పచ్చజెండా ఊపి ఇటీవలే ప్రారంభించారు.
మహిళా సంచారం ఉన్న చోట..!
దాదాపు 100 మందితో కూడిన మహిళా పోలీసు బృందంతో ఏర్పాటైన ఈ పెట్రోలింగ్ యూనిట్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్.. తదితర మహిళా పోలీసులు స్కూటీలపై తిరుగుతూ నిరంతరం పహారా కాసేలా ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కాలేజీలు, ఆటో స్టాండ్స్.. వంటి మహిళా సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీరు మహిళలకు రక్షణగా వారి చుట్టూనే తిరుగుతుంటారని చెబుతున్నారు వృందా. ఈ క్రమంలో స్త్రీలను ఆటపట్టించే ఆకతాయిల పని పట్టడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారీ మహిళా రక్షక భటులు. అలాగే వీరంతా పోలీసు యూనిఫాం ధరించినప్పటికీ దాని పైనుంచి పింక్ కలర్ జాకెట్ వేసుకొని, తలకు హెల్మెట్ పెట్టుకొని తమకు నిర్దేశించిన ప్రదేశాల్లో స్కూటీలపై తిరుగుతూ గస్తీ కాస్తారు.
ఇవన్నీ వారి వెంటే..!
మహిళా రక్షణ కోసం నడుం బిగించిన ఈ మహిళా పోలీసులు.. తమ యూనిఫాంతో పాటు ఓ కెమెరాను కూడా కనిపించకుండా తమ దుస్తులకు బిగించుకుంటారు. అలాగే లాఠీ, పిస్తోలు, బుల్లెట్స్.. వంటివి కూడా తమ వెంటే ఉంచుకుంటారు. అయితే ఈ మహిళా పోలీసులు మొదట కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం పూట సేవలందించనున్నట్లు.. ఆ తర్వాత రాత్రి పూటకూ వీరి సేవలను విస్తరించనున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. ఇలా మహిళా రక్షణ కోసం ఈ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చిన వృందా, ఆమె బృందాన్ని కమిషనర్ కొనియాడారు.
వృందా సారథ్యంలో ఇలా మహిళా రక్షణ కోసం అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేయడం ఇది తొలిసారేమీ కాదు.. గతంలో ‘మహిళా చౌపల్’ పేరుతో అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక యూనిట్ల ద్వారా మహిళల సమస్యలు, వారి వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఈ ఇనీషియేటివ్‌కి అక్కడి మహిళల నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.
Photo: Twitter
Also Read: ఇక్కడ భార్యే భర్తకు బాస్!