Image for Representation
అత్తాకోడళ్లు.. వీరిద్దరూ భిన్న ధ్రువాలని, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ అత్త కూడా ఒక అమ్మే అని, తన ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయిని తన కూతురితో సమానంగా ప్రేమించగలదని మాటలతోనే కాదు.. చేతలతో నిరూపిస్తుంటారు కొందరు అత్తయ్యలు. అలాంటి కోవకే చెందుతారు మదురైకి చెందిన ఈ అత్తగారు కూడా! తన కోడలి విషయంలో ఆమె చేసిన పనికి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతేనా.. ఇలాంటి అత్తగారు మాకూ ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రతి కోడలూ అనుకునేలా చేస్తోంది. ఇంతకీ ఈ మదురై అత్తగారు తన కోడలి కోసం ఏం చేశారో తెలుసుకుందాం రండి..!
‘ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని.. అత్త గుండెలోన కూడా అమ్మ ఉన్నదని..’ అన్నాడో సినీ కవి. ఇదే విషయాన్ని తన కోడలి విషయంలో నిరూపించారు మదురైకి చెందిన అహిలా అబుల్ కలాం అనే అత్తగారు. ఆమె కొడుక్కి ఇటీవలే వివాహమైంది. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్‌గా వీళ్ల పెళ్లి జరిపించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బంధువులు తమ ఇళ్లకు విందుకు పిలిచినా వెళ్లలేని పరిస్థితి ఈ కొత్త జంటది. దాంతో తన ఇంట అడుగుపెట్టబోయే కొత్త కోడలిని తానే సర్ప్రైజ్ చేయాలనుకున్నారు అహిల.
నవగాయ పిండి వంటలతో..!
‘నా కోడలు మా బంధువులిళ్లకు విందుకు వెళ్లలేకపోతేనేం.. ఆ విందేదో నా చేతులతో నేనే స్వయంగా నా కోడలికి అందిస్తే ఇటు నాకు తృప్తిగా ఉంటుంది.. అటు నా కోడలూ సంతోషపడుతుంది..’ అనుకున్న ఈ అత్తగారు.. తన కొత్త కోడలి కోసం నవగాయ పిండి వంటలు వండారు. తనకొచ్చిన వంటకాలన్నీ ప్రయత్నించి మొత్తంగా 101 వెరైటీలు చేశారు. బిర్యానీ మొదలుకొని, ఫ్రైడ్‌రైస్, చికెన్, మటన్, పరోటా, ఆమ్లెట్, సూప్స్, పండ్ల రసాలు, స్వీట్స్.. ఇలా అన్నీ చేసి దాదాపు ఐదారు అరటి ఆకుల్లో పొందికగా వడ్డించారు. ఇలా ఈ చిన్నసైజు ఫీస్ట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఈ అత్తయ్యను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘నిజమైన ప్రేమ మనతో ఏమైనా చేయిస్తుంది..’ అని ఒకరంటే, ‘ఎంత మంచి అత్తగారో’ అంటూ మరొకరు కితాబిస్తున్నారు.

తన సంతోషంతో నా కడుపు నిండింది!
ఇక ప్రస్తుత లాక్డౌన్ వల్ల తన కోడలు తన బంధువులిళ్లకు వెళ్లలేకపోయిందని, అందుకే తనను సంతోషపెట్టడానికే ఇలా చేశానంటున్నారు అహిల. ‘నా కొడుక్కి ఇటీవలే పెళ్లి చేశాం. పెళ్లయ్యాక చాలామంది నా కొడుకు-కోడలిని విందు కోసం తమ ఇళ్లకు ఆహ్వానించారు. కానీ లాక్డౌన్ కారణంగా వారిని పంపించలేకపోయా. దానికి బదులుగా ఇంట్లోనే నా కోడలి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. అందుకే నాకొచ్చిన వంటలతో ఇలా చిన్నసైజు విందును ఏర్పాటుచేశాను. ఈ క్రమంలో అన్నం, కాయగూరలు, మాంసం, స్వీట్స్, జ్యూసులు.. వంటి వాటితో మొత్తంగా 101 వెరైటీస్ వండాను. ఇది చూసిన నా కోడలు చాలా సంతోషపడింది. నాకూ చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. ఇక ఆఖరిగా మీ కోసం ఒక్కమాట.. బయటికి వెళ్లేముందు కరోనాను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బయటే మనకోసం కాచుక్కూర్చుందన్న విషయం మర్చిపోకండి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లకపోవడమే మంచిది. దానికి బదులు మన ఇంట్లోనే మన పిల్లలతో ఆనందంగా గడుపుదాం. వారికి నచ్చినవి చేసి పెడదాం..!’ అంటూ ఆఖర్లో కరోనా జాగ్రత్తలు కూడా చెప్పుకొచ్చారీ అత్తగారు.
సాధారణంగా కొత్త అల్లుళ్లకు అత్తలు ఇలా పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం కామన్.. కానీ కోడలి కోసం ఇలా ప్రేమతో వండి వడ్డించిన అత్తగారు మాత్రం అహిల ఒక్కరే కాబోలు..! ఏదేమైనా ‘అబ్బ.. ఇలాంటి అత్తగారు మాకూ ఉంటే బాగుంటుంది.. ఆ కోడలు ఎంత అదృష్టవంతురాలో!’ అని బయటికి అనకపోయినా మనసులోనైనా అనుకుంటోన్న కోడళ్లు ఎంతమందో!! కాదంటారా?!
అల్లుడి కోసం 67 వెరైటీలు!
అత్తగారు కోడలినే కాదు.. అల్లుడినీ తన కొడుకులాగే ప్రేమగా చూసుకోగలదని నిరూపించారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో అత్తగారు. తన అల్లుడు ఇంటికి వస్తున్నాడని ఎంతో సంబరపడిపోయిన ఆ అత్తగారు.. ఆయన కోసం 67 రకాల వంటకాలు సిద్ధం చేశారు. వెల్కమ్ డ్రింక్ దగ్గర్నుంచి స్టార్టర్స్, ఛాట్, స్వీట్స్, డెజర్ట్స్, రైస్ వెరైటీస్, పండ్లు, పండ్ల రసాలు, వెజ్, నాన్‌వెజ్ వెరైటీస్.. ఇలా అన్నింటినీ వండి అరటి ఆకుల్లో, వెండి ప్లేట్స్‌లో చక్కగా వడ్డించి డైనింగ్ టేబుల్‌పై రడీగా పెట్టారు. ఇలా ఈ అత్తగారు తయారుచేసిన వంటకాలకు సంబంధించిన వీడియో ఇటీవల వైరలైంది.
|
కోడళ్లూ.. ఇవి చదువుతుంటే మీకూ మీ అత్తగారు ఇచ్చిన సర్ప్రైజ్లు.. మీరు మీ అత్తయ్యను ఆనందపరిచిన క్షణాలు గుర్తొస్తున్నాయా? అయితే వాటిని ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి.. అత్తాకోడళ్లంటే శత్రువులు కాదు.. తల్లీకూతుళ్ల కంటే ఎక్కువ అని నిరూపించండి.