మారుతున్న కాలాన్ని బట్టి వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే కొంతమందిలో ఏ కాలంలోనైనా చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారు వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంట్లతో పాటు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు పాటిస్తుంటారు. అంతేనా.. వాటికి సంబంధించిన రెసిపీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తమకు తెలిసిన సౌందర్య చిట్కాలను నలుగురితో పంచుకుంటుంటారు. తాజాగా అలాంటి ఓ న్యాచురల్ టిప్‌నే తన ఫాలోవర్ల కోసం పోస్ట్ చేసిందో అమ్మాయి. ఇంతకీ తనెవరు? తను పోస్ట్ చేసిన ఆ బ్యూటీ టిప్ ఏంటి? తెలుసుకోవాలంటే ఇది చదవండి.
తమ ఫొటోలు, వీడియోలు, తమలోని సృజనను పంచుకోవడానికే కాదు.. తాము పాటించే సౌందర్య రహస్యాలను, ఫిట్నెస్ టిప్స్, ఆహార నియమాలను షేర్ చేసుకోవడానికి కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వారధిగా మారుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్.. వంటి సామాజిక మాధ్యమాల్లో బిజీగా మారుతున్నారు. తమకు తెలిసిన చిట్కాల్ని నలుగురితో పంచుకుంటున్నారు. (అయితే చైనా యాప్ అయిన టిక్ టాక్ పైన భారత ప్రభుత్వం తాజాగా నిషేధం విధించిన విషయం తెలిసిందే). ఈ క్రమంలో - సోషల్ మీడియా వేదికగా ప్రియాంక అనే బ్యూటీ బ్లాగర్ పొడి బారిన చర్మానికి చక్కటి చిట్కా సూచించింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చపాతీ ఫేస్‌మాస్క్..!
చపాతీ, రోజ్‌వాటర్ వంటి సహజసిద్ధమైన పదార్థాలతోనే ఫేస్‌మాస్క్ తయారుచేసుకోవచ్చంటూ వీడియో పోస్ట్ చేసింది ప్రియాంక. అంతేకాదు.. దాన్ని ఎలా తయారుచేయాలి, ఎలా ఉపయోగించాలో కూడా వివరించింది.
‘ఇందుకోసం ముందుగా.. ఇంట్లో మిగిలిపోయిన చపాతీని స్క్రబ్ పొడిలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్ క్రీమ్, చిటికెడు పసుపు, టీస్పూన్ రోజ్‌వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మాస్క్‌ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పొడిబారిన చర్మం తిరిగి తేమను, మెరుపును సంతరించుకుంటుంది. ఇక ఇందులోని పసుపు చర్మ రంధ్రాలను తెరచుకునేలా చేసి అందులోని దుమ్ము-ధూళిని తొలగిస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. చపాతీ చర్మానికి సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది..’ అంటూ చపాతీ ఫేస్‌మాస్క్ గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుతం ఈ న్యాచురల్ బ్యూటీ టిప్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.