నెలసరి.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనందరికీ దేవుడు ప్రసాదించిన వరం. దీని కారణంగానే మనకు సంతానోత్పత్తి ప్రాప్తిస్తుంది.. మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగలుగుతున్నాం. అలాంటిది నెలసరి అంటేనే బెంబేలెత్తిపోయే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు. ‘నెలనెలా ఈ బాధ ఆడవారికే ఎందుకిచ్చావ్ దేవుడా..’ అనుకునే వారూ లేకపోలేదు. ఇందుకు నెలసరి గురించి వారిలో సరైన అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. ఆ సమయంలో శ్యానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో లేకపోవడం మరో కారణం. అంతేకాదు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా.. వాటిని కొనలేని పేదరికం కూడా చాలా దేశాల్లో అలుముకొని ఉంది. అలాంటి నెలసరి పేదరికాన్ని దూరం చేయడానికి తాజాగా నడుం బిగించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఈ సత్కార్యానికి అక్కడి విద్యార్థినులతోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డ్ర్న్ తాజాగా ప్రకటించారు.. తన నిర్ణయంతో ప్రపంచ దేశాధినేతలకు ఆదర్శంగా నిలిచారు.

నెలసరి పేదరికం.. ప్రపంచంలోని చాలా దేశాల్లో నెలకొందీ సమస్య. నెలనెలా పలకరించే నెలసరిని ఓ పండగలా భావించడానికి బదులుగా.. ఓ పీడకలలా అనుభవిస్తోన్న మహిళలు, అమ్మాయిలు ఈ ప్రపంచంలో లెక్కలేనంత మంది ఉన్నారు. అందుకు ఆ సమయంలో తమ మాన, ప్రాణాలను కాపాడే శ్యానిటరీ న్యాప్కిన్లు అందుబాటు ధరల్లో లేకపోవడమే ముఖ్య కారణం. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్. అందుకే ఇకపై అక్కడి పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా శ్యానిటరీ న్యాప్కిన్లు అందించనున్నట్లు తాజాగా ప్రకటించి తన పాలనా దక్షతను మరోసారి నిరూపించుకున్నారు.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచారు.
గణాంకాలేం చెబుతున్నాయంటే..!
చాలా దేశాల్లోలాగే న్యూజిలాండ్‌లోనూ నెలసరి అంటే భయపడిపోయే అమ్మాయిలు, మహిళలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా పిరియడ్స్ సమయం అక్కడి పాఠశాల విద్యార్థినుల పాలిట పెనుశాపంగా మారుతోందని ఇటీవలే ఆ దేశంలో నిర్వహించిన ఓ ఆరోగ్య సర్వేలో భాగంగా వెల్లడైంది. దీని ప్రకారం.. 9 నుంచి 13 ఏళ్ల వయసున్న అమ్మాయిల్లో 12 శాతం మంది పిరియడ్స్ సమయంలో శ్యానిటరీ న్యాప్కిన్లు కొనలేకపోతున్నారట. అంతేకాదు.. 12 మంది విద్యార్థినుల్లో ఒకరు నెలసరి సమయంలో శ్యానిటరీ న్యాప్కిన్లు వాడే స్థోమత లేక స్కూల్ ఎగ్గొడుతున్నారట. ఈ కారణంతో దేశవ్యాప్తంగా 9-18 ఏళ్ల వయసున్న దాదాపు 95 వేల మంది అమ్మాయిలు పిరియడ్స్ సమయంలో స్కూల్ మానేస్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించారు కివీస్ ప్రధాని జెసిండా. అందుకే ఇకపై అక్కడి పాఠశాలలో చదివే విద్యార్థినులందరికీ శ్యానిటరీ ఉత్పత్తులు ఉచితంగా అందించనున్నట్లు, తద్వారా తమ దేశంలో నెలసరి పేదరికాన్ని పాలదోలనున్నట్లు ఆమె ప్రకటించారు.
ఇకపై అంతరాయం లేకుండా..!
తమ దేశంలో నెలకొన్న నెలసరి పేదరికాన్ని పారదోలడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు జెసిండా. ‘దేశంలో 9-18 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 95 వేల మంది అమ్మాయిలు నెలసరి సమయంలో స్కూల్ మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఆ సమయంలో ఉపయోగించే శ్యానిటరీ ఉత్పత్తులు కొనే స్థోమత వారికి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకోసమే ఇకపై ఇక్కడి పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులందరికీ శ్యానిటరీ న్యాప్కిన్లు, ట్యాంపూన్స్, ఇతర శ్యానిటరీ ఉత్పత్తులను ఉచితంగానే అందించనున్నాం. తద్వారా వారు తమ చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్భయంగా బడికి వెళ్లచ్చు.. చక్కగా చదువుకోవచ్చు..’ అన్నారామె.

దశల వారీగా..!
న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి పాఠశాలల్లో దశల వారీగా అమలు చేయనున్నారు. ముందుగా వెయికాటో జిల్లాలోని 15 పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు శ్యానిటరీ ఉత్పత్తులు అందించనున్నారట. ఆపై వచ్చే ఏడాది దేశంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది కివీస్ ప్రభుత్వం. ఇలా విద్యార్థినులకు ఉచితంగా అందించనున్న శ్యానిటరీ ఉత్పత్తుల్ని తయారుచేసే బాధ్యతను అక్కడి ‘డిగ్నిటీ’ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది ప్రభుత్వం.
మేడం.. మీ పాలన ఆదర్శప్రాయం!
ఉచితంగా శ్యానిటరీ న్యాప్కిన్లు అందించాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన కివీస్ ప్రధాని జెసిండాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఆమె నాయకత్వ ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో.. ‘మేడం.. మీ పరిపాలనా దక్షత, నాయకత్వంతో మరోసారి మా మనసుల్ని కొల్లగొట్టారు. ఈ రెండేళ్లలో దేశాభివృద్ధికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు, సాగించిన పాలన ఇతర దేశాలన్నింటికీ ఆదర్శప్రాయం..’ అంటూ ఒకరు స్పందించగా, ‘మహిళలు పదవుల్లో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి..’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
ప్రజానేతగా మన్ననలందుకున్నారు!
న్యూజిలాండ్ మూడో మహిళా ప్రధానిగా 2017, అక్టోబర్ 26న గద్దెనెక్కిన జెసిండా.. ఈ రెండున్నరేళ్ల కాలంలో దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. దేశవాసులకు 92,000 ఉద్యోగాలు కల్పించడం దగ్గర్నుంచి.. పేద, మధ్య తరగతి వారి కోసం ఇల్లు కట్టించి తక్కువ ధరకే అద్దెకిచ్చారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా 140 మిలియన్ల మొక్కలు నాటించి పర్యావరణంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టేలా చేశారు. క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఆసుపత్రుల్లో అధునాతన యంత్రాలను ఏర్పాటు చేయించారు. అలాగే పేద, మధ్య తరగతి వారికి డాక్టర్ ఫీజుల దగ్గర్నుంచి ఆసుపత్రి ఖర్చుల దాకా అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఆమె హయాంలో దాదాపు 3,84,000 లకు పైగా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాయంటేనే అర్థమవుతుంది.. తన దేశంలో పేదరిక నిర్మూలకు ఆమె చేసిన కృషి ఎంతటిదో! ఇలా తన రెండున్నరేళ్ల పాలనలో ప్రజానేతగా మన్ననలందుకున్నారు జెసిండా.
|
అలా కరోనాకు కళ్లెం..!
ఇక ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ విజయం సాధించారు జెసిండా. తన దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి తాను వేసే ప్రతి అడుగూ ఆచితూచి వేశారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని త్వరగా గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం, లాక్డౌన్ విధించడం, దాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రజలూ ఆమె నిర్ణయాలను శిరసా వహించడంతో అక్కడ కరోనా కేసులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. లాక్డౌన్లో ఉన్నా.. తన దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు జెసిండా. ఇలా ఒక ప్రజా నేతగా ప్రజలతో మమేకమై కరోనా కోరలు పీకి.. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచారీ సూపర్ వుమన్.
|
ఇప్పుడు తమ దేశంలో నెలసరి పేదరికాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకొని.. అక్కడి విద్యార్థినులకు శ్యానిటరీ ఉత్పత్తుల్ని ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించి మరోసారి తన పరిపాలన దక్షతను చాటుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులూ గెలుచుకున్నారు జెసిండా.