ఆకలి తీర్చుకోవడానికి అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఆ ఏనుగు ఇక్కడ కూడా కొన్ని మానవ మృగాలుంటాయని కనిపెట్టలేకపోయింది. అందుకే అనాస పండు(పైనాపిల్)లో ప్రాణం తీసే పేలుడు పదార్థాలు పెట్టిచ్చినా ఆబగా నోటికందుకుంది. ఆ అనాస తన ఆయుష్షు తీస్తుందని తెలియక అమాయకంగా నోరు, నాలుక, దవడను పూర్తిగా ఛిద్రం చేసుకుంది. ఎంతటి బాధనైనా తట్టుకోగలిగే ఆ భారీకాయం ఆ పేలుడు నొప్పి, మంటకు మాత్రం పసిపాపలా విలవిల్లాడిపోయింది. ఉపశమనం కోసం చల్లటి నీరు దొరికితే బాగుండునని ఊరూరా తిరిగింది. చివరకు ఓ నదిలోకి దిగి వూపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే నోరంతా ఛిద్రం అవ్వడం, ఏమీ తినకపోవడంతో ఆకలితోనే ప్రాణమొదిలింది. భూతల స్వర్గంగా పేరొందిన కేరళలో జరిగిన ఈ ఘోరం ‘మనుషుల్లో మానవత్వం మాయమవుతోంది’ అన్న మాటకు సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే మానవ మృగాల చేతిలో మృత్యువాత పడిన ఆ మూగజీవం గర్భంతో ఉండడం..!
మానవత్వం లేని మనుషులను నమ్మి!
మనిషికి మాత్రమే వచ్చిన విద్య నమ్మించి మోసం చేయడం! అది సాటి మనిషినైనా సరే.. నమ్మిన జంతువునైనా సరే! చాలా చోట్ల కుక్కల్ని పెంచుకొని అవి ముసలివి కాగానే మారుమూల ప్రదేశాల్లో వాటిని కట్టేసి రావడం.. అవి యజమాని కోసం ఎదురుచూస్తూ ఆకలితో ప్రాణాలొదలడం వంటివి తరచూ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ, ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు కొందరు దుర్మార్గులు. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో కేరళలోని సైలెంట్ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదీపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశ చూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకొని నోట పెట్టుకుంది. అంతే.. ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటి వెంట రక్తం ధారగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయలేదు. వీరంగానికి పాల్పడలేదు. రక్తమోడుతున్న నోటితోనే గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది.
బాధ తట్టుకోలేక జల సమాధి!
విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి అలాగే జలసమాధి అయింది. కేవలం మానవత్వం లేని మనుషులను నమ్మినందుకు అది తన కడపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటన గురించి మల్లప్పురం అటవీశాఖ అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు.
నిందితుల ఆచూకీ చెబితే రూ.50 వేలు!
ఇలా కొందరు దుర్మార్గులు ఓ అమాయకపు ఏనుగును అమానుషంగా బలిగొనడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జంతుప్రేమికులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈక్రమంలో ఏనుగు ఉసురు తీసిన నిందితుల ఆచూకీ చెబితే రూ.50 వేల బహుమతి అందజేస్తామని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ భారత విభాగం ప్రకటించింది.
ఇది ముమ్మాటికీ హత్యే!
‘ఏనుగు సంఘటన ముమ్మాటికీ హత్యే. కేరళలోని మలప్పురం జిల్లా ముందు నుంచి ఇలాంటి ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇంతకు ముందు కూడా రోడ్లపై విషాన్ని చల్లి ఒకేసారి 300 నుంచి 400 కుక్కలను చంపేశారు. ప్రస్తుతం దేశంలో కేవలం 20 వేల ఏనుగులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా క్రమక్రమంగా అంతమైపోతున్నాయి.’ - మనేకా గాంధీ
రాక్షసులు ఇలా కూడా ఉంటారు!
‘రాక్షసులంటే తలపై రెండు కొమ్ములేసుకుని భయంకరంగా ఉండరు. మన చుట్టూ మనుషుల రూపంలో కూడా ఉంటారు. వాళ్లు మన పక్కనే నడుస్తారు. చాలా జంతువులు మనుషులను విశ్వసిస్తాయి. మనకు చాలా సహాయం చేస్తాయి. ఏనుగును చంపిన వారి క్రూరత్వం భరించలేని స్థాయిలో ఉంది. వారు మనుషులుగా జీవించే హక్కును కోల్పోయారు. దయ, జాలి లేని వాళ్లను మనుషులుగా పరిగణించరు. ఒకరిని బాధించి ఆనందం పొందేవాడు అసలు మనిషే కాదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలా చేసే వరకు మానవ రూపంలో ఉన్న మృగాలు భయపడవు. వీరిని పట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ త్వరగా వారిని పట్టుకుని కఠిన శిక్ష వేయండి’ - శ్రద్ధా కపూర్
ఇది కూడా హత్యే!
‘గర్భంతో ఉన్న అమాయక ఏనుగుకు పేలుడు పదార్థాలతో నిండిన పైనాపిల్‌ను ఉద్దేశపూర్వకంగానే తినిపించి కొందరు దాని మరణానికి కారణమయ్యారు. ఆ విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. నా మనసును తీవ్రంగా కలిచివేసింది. ఇది కూడా ఓ ప్లాన్ ప్రకారం మనుషులను హత్య చేయడం వంటిదే. ఏనుగుకు న్యాయం జరగాలి’ - రతన్ టాటా
కఠిన శిక్ష విధించాలి!
‘జంతుహింసకు సంబంధించిన చట్టాలను మరింత కఠినతరం చేయాలి. ఈ అమానవీయ ఘటనకు కారణమైన నిందితులను వెంటనే పట్టుకుని శిక్ష విధించాలి. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన మూగజీవికి న్యాయం చేయాలి.’ - అనుష్కా శర్మ
ఇది అనాగరిక చర్య!
‘ఏనుగంటే నాకెంతో ఇష్టం. కుక్కల మాదిరిగా అవి కూడా చాలా విశ్వాసంతో ఉంటాయి. మనలాగే అవి కూడా చాలా తెలివైనవి. అలాంటి ఏనుగును చంపడం అనాగరికం. అసలు ఇంత క్రూరంగా ప్రవర్తించాలని వారికెలా అనిపించిందో నాకు అర్థం కావడం లేదు. దీనికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’. - అథియా శెట్టి
మూగజీవాలను కాపాడుకోవాలి!
‘ఇది చాలా భయానకం. మూగజీవాలకు అండగా ఉండి కాపాడుకోవాల్సిన మనమే వాటి ప్రాణాలు తీయడం దారుణం. ఇది చాలా హృదయ విదారకం.’ - అలియా భట్
మానవత్వాన్ని మంటగలిపారు!
‘ఏనుగును చంపాలని వాళ్లకెలా అనిపించింది? వారు మానవత్వాన్ని మంటగలిపారు’. - సోనాలీ బింద్రే
జంతువులపై ప్రేమ చూపండి!
‘కేరళలో జరిగిన ఈ ఘటన నన్ను కలిచి వేసింది. జంతువులపై ప్రేమ చూపండి. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకండి’ - విరాట్ కోహ్లీ
హృదయ విదారకం!
‘జంతువుల్లో క్రూరత్వం తగ్గిపోతుంటే కొందరు మనుషుల్లో మాత్రం మానవత్వం మాయమైపోతోంది. ఈ ఘటన చాలా హృదయ విదారకం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’. - అక్షయ్ కుమార్
వీరితో పాటు సోనమ్ కపూర్, దిశా పటానీ, రిద్ధిమా కపూర్, మౌనీ రాయ్, జాన్ అబ్రహాం, రాజ్‌కుమార్ రావ్, వరుణ్ ధావన్, రణ్‌దీప్ హుడా, రోహిత్ శర్మ, సునీల్ ఛెత్రి తదితర సెలబ్రిటీలతో పాటు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు.