‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్ బ్రేకప్ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. రియల్ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!
మాజీ ప్రేమికుడికి బుద్ధి చెప్పాలని!
ఈ రోజుల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, విడాకులు సర్వసాధారణమైపోయాయి. రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన ఈ విషయాలను చాలామంది టేకిట్ ఈజీగా తీసుకుంటున్నా, కొంతమంది సున్నిత మనస్కులు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన జావో అనే యువతి ఏడాది పాటు ఓ యువకుడితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఇటీవల అతను హఠాత్తుగా ఆమెకు బ్రేకప్ చెప్పాడు. అలా ఉన్నట్లుండి తన ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో మానసికంగా కుంగిపోయింది జావో. అదే సమయంలో తన మాజీ ప్రియుడు మాత్రం ఎలాంటి బాధ లేకుండా జాలీగా ఉన్నాడని తన స్నేహితుల ద్వారా తెలుసుకుంది. దీంతో అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.
టన్ను ఉల్లిపాయలను పంపి!
చైనా క్యాలెండర్‌కు సంబంధించి ‘మే20’కి ఓ విశిష్టత ఉంది. మనదేశంలో ‘ఫిబ్రవరి 14’న ప్రేమికుల దినోత్సవం ఎలా ఘనంగా జరుపుకొంటామో అక్కడి ప్రేమికులు ఏటా మే 20ను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. గిఫ్ట్‌లు, గ్రీటింగ్ కార్డులు, ఫ్లవర్ బొకేలతో తమ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో లవ్ బ్రేకప్‌తో పూర్తిగా ఢీలా పడిపోయిన జావో తన ప్రేమికుడికి 1000కిలోల ఉల్లిపాయలను హోం డెలివరీ చేసింది. అంతేకాదు అతడిని కలవకుండా, అతడికి తెలియకుండా ఆ ఉల్లిపాయలను అతని ఇంటి గుమ్మం వద్ద వేసి రమ్మని డెలివరీ బాయ్‌కు సూచించింది. ‘నువ్వు సడెన్‌గా బ్రేకప్ చెప్పావు. దీంతో మూడు రోజుల పాటు నేను ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడు నీ వంతు’ అని తన ఆవేదనకు అక్షర రూపమిస్తూ ఓ సందేశం కూడా రాసి పంపింది.
దించడానికే నాలుగు గంటలు!
ఈమేరకు టన్ను ఉల్లిపాయల లోడుతో జావో మాజీ ప్రియుడు ఉండే ఇంటి అడ్రస్‌కు బయలుదేరాడు డెలివరీ బాయ్. ఆమె చెప్పినట్లుగానే తనకేమీ తెలియకుండా ఉల్లిపాయలను అతని ఇంటి గుమ్మం ముందు రాశులుగా పోశాడు. ట్రక్కులో ఉన్న 1000కిలోల ఉల్లిపాయలను ఇంటి ముందు కుప్పలుగా పోయడానికి సుమారు 4 గంటలకుపైగానే పట్టడం గమనార్హం. అలా ఇంటి ముందు రాశులుగా పోసి ఉన్న ఉల్లిపాయలను చూసి ఒక్కసారిగా అయోమయానికి గురయ్యాడు ఆ యువకుడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తన ఇంటి గుమ్మం ముందు కుప్పలు తెప్పలుగా పడిఉన్న ఉల్లిపాయలను చూస్తూ ఏం చేయాలో తెలియక తలమీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్న యువకుడి ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
కన్నీళ్లు ఆగడం లేదు!
ఈ నేపథ్యంలో తనకు బ్రేకప్ చెప్పిన ప్రేమికుడి కళ్ల్లల్లో నీళ్లు చూడడానికి జావో చేసిన ఉల్లిపాయల డెలివరీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉల్లిపాయల ఘాటుతో ఆ యువకుడితో పాటు అతని చుట్టుపక్కల నివసించే వారి కళ్ల్ల్లల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. ‘ప్రియుడిపై కోపంతో ఆమె పంపించిన ఈ ఉల్లిపాయలతో అతను ఎలా ఉన్నాడో కానీ.. మా కళ్లల్లో మాత్రం నీరు ఆగడం లేదు’ అని చెబుతున్నారు.