కరోనా వైరస్ పుణ్యమా అని మన జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ పేరుతో ఇలా దేశమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొనడం మన జీవితంలో మునుపెన్నడూ చూసి ఎరగం. అలాగే స్వీయ నిర్బంధం అనే పదం కూడా మనలో చాలామంది విని ఉండరు. కానీ కరోనా కారణంగా మనకు మనమే గృహ నిర్బంధంలో ఉండాల్సిన గడ్డు పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇవే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందిని బలిగొంటోన్న కరోనా.. ప్రప్రంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. అందులో కొన్ని మనకు మంచి విషయాలు నేర్పిన మార్పులు కూడా ఉన్నాయి. మరి, ఇంతకీ కరోనా మన జీవనశైలిలో తీసుకొచ్చిన మార్పులు-చేర్పులు ఏంటో తెలుసుకుందామా?

నమస్తే ‘కరో’నా..
రెండు చేతులు జోడించి సవినయంగా ‘నమస్కారం’ చేస్తూ ఎదుటివారిని పలకరించడమే మన భారతీయ సంప్రదాయం. కానీ కరోనాకు ముందు వరకు ప్రపంచమంతా ఎవరిని కలిసినా కరచాలనంతో పలకరించడం అలవాటుగా ఉండేది.. నిజానికి ఈ కరచాలనం అనే పద్ధతి పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది. ఇదే పద్ధతి బ్రిటిష్ వారి రాకతో మన దేశంలోకీ అడుగుపెట్టి నమస్కారాన్ని కనుమరుగు చేసింది. కానీ మూడు నెలల క్రితం వచ్చిన కరోనా ఈ పాశ్చాత్య సంస్కృతిని ఒక్కసారిగా రూపుమాపింది. ఇది అంటువ్యాధి కావడం వల్ల ‘కరచాలనం వద్దు.. నమస్కారమే ముద్దు..’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ జాగ్రత్తల్లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీలు, దేశాధినేతల దాకా.. ఎవరు ఎవరిని కలిసినా నమస్కారం చేసుకోవడం తమ అలవాటుగా మార్చుకున్నారు. ఇలా కరోనా పుణ్యమా అని భారతీయ సంప్రదాయం నేడు ప్రపంచ పలకరింపుగా మారిపోయింది. ఇలా ఇతర దేశస్థులు తమ పలకరింపుల్లో భాగంగా వారి ట్రెడిషన్‌ను పక్కన పెట్టి మన సంప్రదాయాన్ని పాటించడంతో ఎందరో భారతీయుల మది పులకరించిందని చెప్పడంలో సందేహమే లేదు.
చేతులు శుభ్రం చేసుకోవడం..
చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.. ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం.. అలాగే వైద్యులు, నిపుణులు ఈ మాట పదే పదే చెప్పినా మనం పెడచెవిన పెడుతుంటాం.. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో రోగాలు రాకుండా అరికట్టవచ్చు అనే విషయం మనకు తెలిసినా నిర్లక్ష్యం వహిస్తుంటాం. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో.. దాన్ని నివారించడంలో చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం అతి ముఖ్యమైన జాగ్రత్తగా మారిందో.. ఇక అప్పట్నుంచి కరోనా భయంతో అందరూ తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం.. వంటివి చేస్తున్నారు. అదెంతలా అంటే శానిటైజర్ల కొరత ఏర్పడేంతలా! ఇలా చేతులు కడుక్కోవడం అనే మంచి అలవాటును అందరికీ అలవడేలా చేసింది కరోనా.

కాలుష్యం తగ్గుముఖం!
కాలుష్యం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న అతి భయంకరమైన సమస్యల్లో ఇదీ ఒకటి. దీన్ని నివారించడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్ధలు, ఎంతో మంది సెలబ్రిటీలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఈ కాలుష్య భూతం కారణంగా మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అంతేకాదు ఎన్నో మూగజీవాలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి కూడా! మంచు కొండలు సైతం కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ఇలా మానవాళికి పెనుభూతంగా మారిన కాలుష్యాన్ని కాస్త తగ్గించడంలో కరోనా పాత్ర చాలానే ఉందని చెప్పుకోవచ్చు. అదెలాగంటే.. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల అందరూ ఇళ్లకే పరిమితమవడం వల్ల రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. తద్వారా వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. అలాగే ఎవరింట్లో వారు ఉండడం వల్ల ప్లాస్టిక్ వాడకం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో భూమిపై కాలుష్యం చాలా వరకు తగ్గిందంటూ పలు నివేదికలు సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా కాలుష్యాన్ని తగ్గించే విషయంలో మనిషి వల్ల సాధ్యం కాని పనిని కరోనా చేసిందని చెప్పచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గడం వల్ల ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల జీవన ప్రమాణాలు కొంత వరకు మెరుగవుతున్నాయి.

ఇంటర్నెట్కు పెరిగిన డిమాండ్..
ఈ లాక్డౌన్ పిరియడ్‌లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండడం వల్ల ఏది కావాలన్నా.. ఏది చూడాలన్నా.. ఇంటర్నెట్ పైనే ఆధారపడడం ఎక్కువైంది. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ సమయంలో సరికొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, ఆన్లైన్ తరగతుల ద్వారా పిల్లలు పాఠాలు నేర్చుకోవాలన్నా, వ్యాయామానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఫిట్‌గా మారిపోవాలన్నా, ఇంట్లోంచే పనిచేయాలన్నా.. ఇలా పలు రకాలుగా ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఇలా ఇంట్లోనే బంధితమై ఉన్నా.. ప్రపంచం నలుమూలలా తిరిగిన ఫీలింగ్‌ని ఇంటర్నెట్ మనకు అందిస్తుందనడంలో అస్సలు సందేహం లేదు. ఇలా మనకు నచ్చిన విషయాలను ఇతరులపై ఆధారపడకుండానే ఆన్లైన్ వీడియోల ద్వారా సులభంగా నేర్చేసుకోవచ్చు. ఇలా కరోనా రాకతో టెక్నాలజీ వాడకం అందరికీ మరింతగా చేరువైందని చెప్పుకోవచ్చు.

ప్రపంచాన్ని ఏకం చేసింది..
ప్రపంచమంతా ఒకవైపు.. కరోనా ఒకవైపు.. అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కలిసి ఒక్కదానిపైనే పోరాటం చేస్తోంది. అది ఎవరి కంటికి కనిపించకపోయినా.. అది చేసే మరణ మృదంగం మాత్రం మనుషులకు పెనుసవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కలిసి ఐకమత్యంగా ఈ మహమ్మారిపై గెలవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్కరి ప్రయత్నం ఫలించినా.. అది కరోనాపై మనందరి విజయం అవుతుంది.. ఇలా కరోనా రాకతో అందరూ కలిసి కట్టుగా ఉంటేనే విజయం సాధించగలం.. కష్టకాలంలో అందరూ కలిస్తేనే పోరాటానికి మరింత బలం చేకూరుతుందనే విషయాల్ని తెలియజెప్పిందీ మహమ్మారి.
ఇలా కరోనా రాకతో మన జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మరి, ఈ మహమ్మారి మీ జీవితంలో వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది.. ‘వసుంధర.నెట్’ వేదికగా మీ అనుభవాలను మాతో పంచుకోండి..